
‘కృనాల్ పాండ్యా నాకు అన్న. మేము సోదరులం...’ ఈ మాట అన్నది హార్థిక్ పాండ్యా అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పనేలేదు. కానీ బద్ద శత్రువులైన ఓ ఇద్దరు క్రికటర్లలో ఒకరు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషమే కదా. గతేడాది దేశవాళీలో జరిగిన ఓ టోర్నీలో ఒకరిమీద ఒకరు అభ్యంతరకరమైన దూషణలు చేసుకుని దాదాపు కొట్టుకునే స్థితికి వెళ్లిన కృనాల్ పాండ్యా-దీపక్ హుడా లు... ఇప్పుడు కలిసిపోయారు. తామిద్దరం సోదరుల వంటి వాళ్లమని.. అన్నాతమ్ముళ్లన్నాక పంచాయితీలుంటాయి.. తర్వాత కలుసుకోమా ఏంటి..? అంటూ కొత్త అర్థాలు చెబుతున్నాడు దీపక్ హుడా. వీళ్ల బ్రొమాన్స్ కథేందో చదవండి మరి..
అసలు విషయానికొస్తే.. గతేడాది సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా బరోడా తరఫున ఆడిన కృనాల్, దీపక్ హుడా లు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత..? అనే దగ్గరికి వెళ్లింది ఈ గొడవ. కృనాల్ తనను తిట్టాడని హుడా... తప్పు అతడితే అని పాండ్యా.. ఇలా ఒకరిపై ఒకరు కంప్లయింట్ ఇచ్చుకున్నారు.
అయితే ఇద్దరి వాదనలు విన్న బరోడా రంజీ జట్టు.. హుడా దే తప్పు అని తేల్చడంతో అతడు ఆ టీమ్ మీద అలిగి రాజస్థాన్ తో చేతులు కలిపాడు. కట్ చేస్తే.. ఈ ఇద్దరూ ఐపీఎల్-2022 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నారు. దీంతో ఈ ఇద్దరూ కలిసి ఎలా ఆడతారు..? అని అనుమానం అందరిలోనూ కలిగింది. అయితే లోపల ఏం జరిగిందో ఏమో గానీ ఇప్పుడైతే ఈ ఇద్దరు ఆల్ రౌండర్ల మధ్య సంబంధాలు బలపడ్డాయట. ఈ విషయాన్ని స్వయంగా హుడానే వెల్లడించాడు.
గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్బంగా మాట్లాడుతూ... ‘కృనాల్ నాకు సోదరుడితో సమానం. అన్నాతమ్ముళ్లు గొడవ పడరా ఏంటి..? అదంతా గతం ఇప్పుడు మేం ఒక లక్ష్యం (లక్నో సూపర్ జెయింట్స్ విజయం) కోసం ఆడుతున్నాం. దానికోసమే ఇద్దరం పాటుపడతాం.. ’ అని అన్నాడు. ఇక ఐపీఎల్ వేలం లో ఇద్దరూ ఒకే జట్టు తరఫున ఆడతారని తెలిసినప్పుడు మీ స్పందన ఏంటి..? అని హుడాను అడగ్గా.. ‘నేను ఐపీఎల్ వేలం చూడలేదు. కానీ సీజన్ ప్రారంభంలో హోటల్ కు వచ్చినప్పుడు నేను అతడిని ఒక తోటి క్రికెటర్ గా కలిశాను. జరిగిందేదో జరిగిపోయింది. మనమంతా ఒక జట్టు తరఫున ఆడుతున్నాం. మన దృష్టంతా దానిమీదే పెడదాం అని చెప్పుకున్నాం..’ అంటూ చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరి బ్రొమాన్స్ చూసిన ఫ్యాన్స్.. ‘అంటే మీరు మీరు కలిసిపోయారన్నమాట’ అని కామెంట్స్ పెడుతున్నారు.
కాగా ఈ సీజన్ లో ఈ ఇద్దరూ కలిసి లక్నో ఆడుతున్న తొలి మ్యాచ్ నుంచి జట్టులో ఉన్నారు. కలిసి బ్యాటింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్యాటింగ్ లో హుడా అదరగొడుతుంటే.. బౌలింగ్ లో పాండ్యా రాణిస్తున్నాడు. ఇదిలాఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొననున్నది.