IPL 2022: చాహల్ కమాల్.. ఈ సీజన్ లో తొలి హ్యాట్రిక్.. అయ్యర్, ఆరోన్ మెరుపులు వృథా.. కేకేఆర్ కు భంగపాటు

Published : Apr 18, 2022, 11:45 PM ISTUpdated : Apr 18, 2022, 11:53 PM IST
IPL 2022: చాహల్ కమాల్.. ఈ సీజన్ లో తొలి హ్యాట్రిక్.. అయ్యర్, ఆరోన్ మెరుపులు వృథా.. కేకేఆర్ కు భంగపాటు

సారాంశం

TATA IPL 2022 - RR vs KKR: ఐపీఎల్ లో అసలు సిసలు మజాను పంచింది రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్. భారీ స్కోర్లు నమోదైన  ఈ మ్యాచ్ లో విజయం ఆఖరి వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది.  రాజస్తాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ తీశాడు.  మొత్తంగా ఐదు వికెట్లతో  కేకేఆర్ పతనాన్ని శాసించాడు. 

లో స్కోరింగ్ మ్యాచులలోనే కాదు. హై స్కోరింగ్ గేమ్ లలో కూడా మజా ఎలా ఉంటుందో ఈ సీజన్ లో ఐపీఎల్ అభిమానులు ఆస్వాదిస్తూనే ఉన్నారు. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా మ్యాచులు మాత్రం అభిమానులను అలరిస్తున్నాయనడంలో సందేహమే లేదు.  తాజాగా రాజస్తాన్ రాయల్స్ - కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ కూడా అభిమానులకు అలాంటి అనుభూతినే పంచింది. రెండు జట్లు కలిపి 427 పరుగులు చేశాయి. విజయం ఆఖరి ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది.  రాజస్తాన్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్.. 19.3  ఓవర్లలో 210 పరుగులు చేసి ఆలౌటైంది.  ఫలితంగా 7 పరుగుల తేడాతో రాజస్తాన్ ను విజయం వరించింది.  

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  కోల్కతా నైట్ రైడర్స్ కు తొలి ఓవర్ మొదటి బంతికే షాక్ తగిలింది. రెండు వందలకు పైగా టార్గెట్ ఉండటంతో రెగ్యులర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ను కాదని సునీల్ నరైన్ (0) ను  ఫించ్  (28 బంతుల్లో 58.. 9 ఫోర్లు, 2 సిక్సర్లు)  కు జోడిగా పంపింది కేకేఆర్. కానీ బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో  సింగిల్ తీయబోయే క్రమంలో  హెట్మెయర్ వేసిన  సూపర్ త్రో కు  నరైన్ రనౌట్ అయ్యాడు. 

వన్ డౌన్ లో వచ్చిన కేకేఆర్ సారథి  శ్రేయస్ అయ్యర్  (51 బంతుల్లో 85.. 7 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి ఆరోన్ ఫించ్ హిట్టింగ్ కు దిగాడు. ఇద్దరూ కలిసి బౌండరీలు, సిక్సర్లు బాదారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లతో ఖాతా తెరిచిన అయ్యర్.. ప్రసిద్ద్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. మూడో ఓవర్ వేసిన బౌల్డ్  బౌలింగ్ లో రెండు ఫోర్లు బాదాడు ఫించ్.  ఓవర్ కు  పది పరుగులు తగ్గకుండా  ఆడారు అయ్యర్, ఫించ్..  

ఈ క్రమంలో ప్రసిద్ద్ కృష్ణ వేసిన 9వ ఓవర్లో రెండో బంతిని ఫోర్ కొట్టిన ఫించ్.. ఐపీఎల్-15 సీజన్ లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 25 బంతుల్లోనే సెంచరీ చేసిన అతడు.. అదే ఓవర్లో ఆఖరి బంతికి అప్పర్ కట్ ఆడబోయి థర్డ్ మ్యాన్ వద్ద ఉన్న కరుణ్ నాయర్ కు చిక్కాడు. దీంతో 106 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

సారథి జోరు.. 

ఫించ్ నిష్క్రమించినా అయ్యర్ జోరు తగ్గలేదు. నితీశ్ రాణా (11 బంతుల్లో 18.. 1 ఫోర్, 1 సిక్స్)  నిలువలేదు. ఆదుకుంటాడనుకున్న ఆండ్రీ రసెల్ (0) కూడా నిలువలేదు. వరుసగా వికెట్లు పడుతున్నా అయ్యర్ మాత్రం ఒంటరి పోరు చేశాడు. అశ్విన్ వేసిన పదో ఓవర్లో ఆఖరి బంతికి  సింగిల్ తీసి ఈ సీజన్ లో రెండో హాఫ్ సెంచరీ చేసిన  అయ్యర్.. తర్వాత మరింత రెచ్చిపోయాడు. మెక్ కాయ్ వేసిన 15వ ఓవర్లో 6, 4 బాదాడు.  తర్వాత బౌల్ట్ బౌలింగ్ లో కూడా డీప్ పాయింట్ దిశగా  చూడముచ్చటైన సిక్సర్ కొట్టి ఎనభైలలోకి చేరాడు.

చాహల్ మాయ.. 

 

కేకేఆర్ నాలుగు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్ (6),  శ్రేయస్ అయ్యర్.  17వ ఓవర్ వేయమని చాహల్ కు బంతినందించాడు సంజూ శాంసన్. తొలి బంతికి  వెంకటేశ్ అయ్యర్ స్టంపౌట్.   తర్వాత 3 బంతులకు రెండు పరుగులు. నాలుగో బంతికి శ్రేయస్ అయ్యర్ ఎల్బీడబ్ల్యూ. ఐదో బంతికి శివమ్ మావి ఔట్. ఆరో బంతికి ప్యాట్ కమిన్స్  కూడా అదే బాట. అంతే చాహల్ పేరిట మరో  హ్యాట్రిక్. ఆ ఓవర్లో ఏకంగా  నాలుగు వికెట్లు పడ్డాయి. 

 

అయితే మ్యాచ్ ఇక రాజస్తాన్ చేతిలోకి వచ్చినట్టే అనిపించినా.. ఆఖర్లో వచ్చిన ఉమేశ్ యాదవ్ (21) ఆ జట్టును కాస్త భయపెట్టాడు. బౌల్ట్ వేసిన 18వ ఓవర్లో  6, 2, 6, 4తో 20 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ లో మళ్లీ ఉత్కంఠ. కానీ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్లో 7 పరుగులే వచ్చాయి. ఇక ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరమవగా  కేకేఆర్ 3 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా మ్యాచ్ రాజస్తాన్ వశమైంది. ఆ జట్టులో యుజ్వేంద్ర చాహల్ (4-0-40-5) అత్యుత్తమమ గణాంకాలు నమోదు చేశాడు. మెక్ కాయ్ రెండు వికెట్లు తీయగా.. అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.    

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. జోస్ బట్లర్ (103) సెంచరీ సాయంతో భారీ స్కోరు  చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో  జట్టు.. 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.  జోస్ బట్లర్ కు తోడు సంజూ శాంసన్ (38), హెట్మెయర్ (26 నాటౌట్) రాణించారు.  రాజస్తాన్ బ్యాటర్ల ధాటికి కోల్కతా బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !