
ఐపీఎల్-15 లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. జోస్ బట్లర్ (103) సెంచరీ కి తోడు రాజస్తాన్ సారథి సంజూ శాంసన్, హెట్మెయర్ మెరపులు తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆది నుంచి దూకుడుగా ఆడిన బట్లర్.. ఈ సీజన్ లో రెండో సెంచరీ సాధించాడు. బట్లర్ దూకుడు కారణంగా కేకేఆర్ బౌలర్లలో.. ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, పాట్ కమిన్స్ భారీగా పరుగులిచ్చుకున్నారు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే కేకేఆర్.. 20 ఓవర్లలో 218 పరగులు చేయాల్సి ఉంది.
టాస్ ఓడి కోల్కతా ఆహ్వానం మేరకు బ్యాటింగ్ కు వచ్చిన రాజస్తాన్ రాయల్స్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. జోస్ బట్లర్ (61 బంతుల్లో 103.. 9 ఫోర్లు, 5 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ (18 బంతుల్లో 24.. 3 ఫోర్లు, 1 సిక్సర్) ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 97 పరుగులు జోడించారు. తొలి రెండు ఓవర్లు రాజస్తాన్ బ్యాటింగ్ చూస్తే ఈ మెరుపు ఆరంభాన్ని ఎవరూ ఊహించి ఉండరు. తొలి ఓవర్లో 2 పరుగులు రాగా రెండో ఓవర్లో 7 పరుగులే వచ్చాయి.
కానీ మూడో ఓవర్ నుంచి ఆటను తన కంట్రోటల్ లోకి తెచ్చుకున్నాడు బట్లర్.. వరుణ్ చక్రవర్తి వేసిన ఆ ఓవర్లో.. సిక్స్, ఫోర్ తో స్కోరు బోర్డుకు పరగులు నేర్పాడు. శివమ్ మావి వేసిన ఆరో ఓవర్లో కూడా ఫోర్, సిక్సర్ కొట్టాడు. రెండు ఓవర్లకు 9 పరుగులగా ఉన్న రాజస్తాన్ స్కోరు 6 ఓవర్లకు 60 పరుగులకు చేరింది.
బట్లర్ జోరునందుకోవడంతో పడిక్కల్ కూడా చెలరేగాడు. కమిన్స్ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు రాబట్టాడు. అదే ఓవర్లో ఐదో బంతికి ఫోర్ కొట్టిన బట్లర్ ఈ ఐపీఎల్ లో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 29 బంతుల్లోనే అతడి అర్థ సెంచరీ పూర్తయింది. అదే ఊపులో ఉమేశ్ యాదవ్ వేసిన 9వ ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టి స్కోరు బోర్డు వేగాన్ని మరింత పెంచాడు. కాగా.. 10వ ఓవర్ వేసిన నరైన్ బౌలింగ్ లో తొల బంతికి సిక్స్ కొట్టిన పడిక్కల్.. నాలుగో బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో 97 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
పడిక్కల్ స్థానంలో వచ్చిన రాజస్తాన్ సారథి సంజూ శాంసన్ (19 బంతులలో 38.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా వస్తూనే ధాటిగా ఆడాడు. శివమ్ మావి వేసిన 11 వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు కొట్టిన అతడు..ఉమేశ్ యాదవ్ వేసిన 15వ ఓవర్లో కూడా 4, 6 బాదాడు. కానీ రసెల్ వేసిన 16వ ఓవర్లో శివమ్ మావికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మరోవైపు బట్లర్ కూడా భారీ షాట్లు ఆడకపోయినా సింగిల్స్, డబుల్స్ తో రన్ రేట్ పడిపోకుండా ఆడాడు. కమిన్స్ వేసిన 13వ ఓవర్లో రెండు బౌండరీలు బాది ఎనభైల్లోకి చేరాడు. అదే కమిన్స్ వేసిన 16వ ఓవర్లో లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది ఈ సీజన్ లో రెండో సెంచరీ సాధించాడు. కానీ అదే ఓవర్లో ఐదో బంతికి వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
బట్లర్ నిష్క్రమించిన తర్వాత రాజస్తాన్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. రియన్ పరాగ్ (5), కరుణ్ నాయర్ (3) లు పెద్దగా రాణించలేదు. కానీ హెట్మెయర్ (13 బంతుల్లో 26.. 2 సిక్సర్లు, 2 ఫోర్లు) మాత్రం రసెల్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు బాది రాజస్తాన్ స్కోరును రెండు వందలు దాటించాడు. ఆఖరి ఓవర్లో రాజస్తాన్ కు 18 పరగులొచ్చాయి.