
గతేడాది టీమిండియా ఆటగాడు హార్ధిక్ పాండ్యా కు గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా భారత జట్టు కొత్త ఆల్ రౌండర్ కోసం వెతుకుతుండగా.. దుబాయ్ లో ముగిసిన రెండో దశ ఐపీఎల్ వారికి ఒక కుర్రాన్ని పరిచయం చేసింది. ఎడం చేతి వాటం బ్యాటింగ్ ఆకట్టుకునే ప్రదర్శనలతో పాటు బౌలింగ్ కూడా చేయగల ఆ ఆటగాడిని చూసి.. కొత్త ఆల్ రౌండర్ దొరికేసినట్టే అని భావించింది. ఇంకేం.. మో ఆలోచన లేకుండా అతడిని భారత జట్టులోకి ఎంపిక చేసింది. పలు మ్యాచులు కూడా ఆడించింది. అయితే అదే ఉత్సాహంతో ఐపీఎల్-15 సీజన్ లో బరిలోకి దిగిన సదరు ఆటగాడు మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఆ వైఫల్యం పేరు వెంకటేశ్ అయ్యర్.
హార్ధిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో భారత జట్టులోకి వచ్చిన కొత్త కుర్రాడు వెంకటేశ్ అయ్యర్ ఈ ఐపీఎల్ లో వైఫల్యాలకు చిరునామాగా మారాడు. 2021 ఐపీఎల్ రెండో దశలో బ్యాటింగ్ లో ప్రమోట్ (అంతకుముందు ఆరో స్థానంలో వచ్చేవాడు) అయి ఏకంగా జట్టు ఓపెనర్ గా మారి.. 10 మ్యాచుల్లో 370 పరుగులు చేశాడు. కానీ ఈ సీజన్ లో మాత్రం ఏడు మ్యాచులలో చేసిన పరుగులు 126.
సెలెక్టర్ల కన్ను పడింది.. కానీ..
ఐపీఎల్ - 14 లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో నిలకడైన బ్యాటింగ్ తో 370 పరగులు, బౌలింగ్ లో కూడా 3 వికెట్లు తీయడంతో భారత సెలెక్టర్ల కన్ను అతడి మీద పడింది. మరో హార్ధిక్ పాండ్యా కోసం చూస్తున్న భారత జట్టు.. అతడిని అదే విధంగా ప్రమోట్ చేసింది. వెస్టిండీస్, శ్రీలంక లతో సిరీస్ లకు ఎంపిక చేసింది. భారత జట్టుతో పాటు గత ఐపీఎల్ ప్రదర్శనను చూసిన కేకేఆర్ యాజమాన్యం కూడా అతడిపై రూ. 8 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. ఆ జట్టు తరఫున భీకర ఇన్నింగ్స్ లు ఆడిన శుభమన్ గిల్ ను కూడా పక్కనబెట్టి.. అయ్యర్ ను తీసుకుంది.
ఈ ఐపీఎల్ లో తాను ఆడిన ఏడు ఇన్నింగ్స్ లలో అయ్యర్ చేసిన స్కోర్లు ఇవే.. 16, 10, 3, 50, 18, 6, 6, 17.
మళ్లీ పాత స్థానానికే డిమోట్..
ఇక గతేడాది బ్యాటింగ్ లో ప్రమోట్ అయిన అతడి వైఫల్యాలతో కేకేఆర్ యాజమన్యం కూడా ఆలోచనలో పడ్డట్టుంది. గత రెండు మ్యాచులలో అతడిని ఓపెనర్ గా కాకుండా మళ్లీ ఆరో స్థానంలోనే బ్యాటింగ్ కు పంపుతున్నది. ఓపెనర్ గా విఫలమైన అయ్యర్.. ఆరో స్థానంలో ఫినిషర్ గా పనికొస్తాడని పంపుతుందని అనుకున్నా.. అక్కడ కూడా అతడు పెద్దగా రాణించడం లేదు. గత రాజస్తాన్ మ్యాచ్ లో కీలక సమయంలో బ్యాటింగ్ కు వచ్చి 6 పరుగులే చేసిన అయ్యర్.. గుజరాత్ తో మ్యాచ్ లో 17 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. బ్యాటింగ్ సంగతి పక్కనబెడితే బౌలింగ్ లో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
ఇలా అయితే కష్టమే...
వెంకటేశ్ అయ్యర్ తాజా ప్రదర్శన చూస్తే అతడికి తిరిగి భారత జట్టులో చోటు కల్పించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అనిపించక మానదు. అదీగాక మరోవైపు హార్ధిక్ పాండ్యా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుతున్నాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా మెరుస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆరు మ్యాచులాడిన పాండ్యా.. 295 పరుగులు చేసి 2022 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జోస్ బట్లర్ (491) తర్వాత ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు కెప్టెన్ గా కూడా పాండ్యా ఆకట్టుకుంటున్నాడు.
ఐపీఎల్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఐదు టీ20లు ఆడేందుకు భారత పర్యటనకు రానున్నది. వెంకటేశ్ గనక ఇదే విఫల ప్రదర్శనలు చేస్తే అతడికి జాతీయ జట్టులో చోటు దక్కడం అటుంచి వన్ సీజన్ ప్లేయర్ గా మిగిలిపోనుండటం ఖాయం.