
లక్నో తో జరిగిన తొలి మ్యాచులో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కున్న గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభమన్ గిల్.. ఢిల్లీతో జరుగుతున్న పోరులో మాత్రం రెచ్చిపోయి ఆడాడు. సహచర ఆటగాళ్లతో కలిసి వరుసగా కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించడానికి బాటలు వేశాడు. ఎదుర్కున్న 46 బంతుల్లోనే 84 పరుగులు చేసి సత్తా చాటాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 భారీ సిక్సర్లున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. శుభమన్ గిల్ తో పాటు హార్థిక్ పాండ్యా (27 బంతుల్లో 31.. 4 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (15 బంతుల్లో 20.. 2 ఫోర్లు) రాణించారు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ కు శుభారంభం దక్కలేదు. ముస్తాఫిజుర్ వేసిన తొలి ఓవర్లో రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ వేడ్ (1) ను ఔట్ చేశాడు. వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు వేడ్. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విజయ్ శంకర్.. (20 బంతుల్లో 13) మరోసారి విఫలమయ్యాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అతడు బౌల్డ్ అయ్యాడు.
తొలి పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. అప్పటికీ ఇంకా గిల్ బాదుడు మొదలు కాలేదు. కానీ తర్వాత గిల్ గేర్ మార్చాడు. పాండ్యాతో కలిసి గ్రౌండ్ నలువైపులా చూడచక్కని షాట్లు ఆడాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 13 వ ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు గిల్. ఇది అతడికి 11వ ఐపీఎల్ అర్థ శతకం. అయితే తర్వాత ఓవర్లో పాండ్యా ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు.
కుల్దీప్ వేసిన 15వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ బాదిన గిల్.. అక్షర్ పటేల్ వేసిన 16వ ఓవర్లో వరుసగా రెండు బంతులను స్టాండ్స్ లోకి పంపాడు. ఈ క్రమంలో అతడు తన ఐపీఎల్ కెరీర్ లో అత్యధిక స్కోరు (83) సాధించాడు. గిల్ 80 దాటగానే రాజస్థాన్-ముంబై మ్యాచులో బట్లర్ మాదిరే మరో సెంచరీ నమోదవుతుందని గుజరాత్ అభిమానులు ఆశించారు. కానీ 18వ ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్.. తొలి బంతికే అతడిని ఔట్ చేశాడు.
గిల్ నిష్క్రమించాక 19వ ఓవర్లో ఒక సిక్సర్ సాయంతో గుజరాత్ కు 112 పరుగులు వచ్చాయి. ఇక 20 వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్.. నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్.. 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ మ్యాచులో ఢిల్లీ గెలవాలంటే.. 20 ఓవర్లలో 172 పరుగులు చేయాలి.
ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్.. 4 ఓవర్లు విసిరి 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ కు ఒక వికెట్ దక్కింది. శార్దూల్ ఠాకూర్.. 4 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు.