IPL2022: రాజస్థాన్ రాజసం.. టాస్ ఓడినా మ్యాచులు గెలుస్తున్న సంజూ శాంసన్ సేన..

Published : Apr 02, 2022, 08:33 PM ISTUpdated : Apr 02, 2022, 08:35 PM IST
IPL2022: రాజస్థాన్ రాజసం.. టాస్ ఓడినా మ్యాచులు గెలుస్తున్న సంజూ శాంసన్ సేన..

సారాంశం

TATA IPL 2022: ఐపీఎల్ మెగా సీజన్ ప్రారంభమై  వారం రోజులు గడిచింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు పది మ్యాచులు జరిగాయి. ఇన్ని మ్యాచులలో టాస్ గెలిచిన జట్టే గెలిచింది. రెండు సందర్భాలలో తప్ప.. 

హమ్మయ్య..! సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఇది శుభవార్తే. ఈ సీజన్ లో తొలి సారి టాస్ గెలిచి కూడా ఓడిన జట్టుగా ఉన్న సన్ రైజర్స్ పేరిట ఉన్న చెత్త రికార్డును ఇప్పుడు ముంబై ఇండియన్స్ కూడా సొంతం చేసుకుంది. శనివారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై కూడా ఓడింది. ఈ రెండు సందర్భాలలో ఎస్ఆర్హెచ్,  ముంబై ప్రత్యర్థికి ఒకరే. ఆ జట్టే రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్ లో టాస్ ఓడినా కూడా మ్యాచులను గెలుస్తున్న జట్టు సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థానే.. రెండు మ్యాచులలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రాజస్థాన్..  ఈసారి ఐపీఎల్ కొట్టాలని బలంగా ఫిక్స్ అయినట్టే కనిపిస్తున్నది. 

ఐపీఎల్ ప్రారంభమై  వారం రోజులు గడిచింది. ఈ వారం రోజుల్లో  పది  మ్యాచులు జరిగాయి. పదింటిలో టాస్ గెలిచిన జట్లు మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంటున్నాయి.  తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఎంత భారీ స్కోరు చేసినా  సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు  అనూహ్య విజయాలు సొంతం చేసుకుంటున్నది. 

అయితే మిగతా జట్ల సంగతేమో గానీ రాజస్థాన్  రాయల్స్ మాత్రం ఇలా కాదు. ఆ జట్టు ఈ సీజన్ లో ఇప్పటికే రెండు మ్యాచులు ఆడింది. రెండింటిలోనూ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కే వచ్చింది.  టాప్ లెవల్ బ్యాటింగ్ తో ముందు అదరగొట్టి తర్వాత బౌలింగ్ లో ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నది.   ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి పేసర్లతో పాటు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ వంటి  ప్రపంచ స్థాయి బౌలర్లు ఆ జట్టు సొంతం. దీంతో  రాజస్థాన్ దూసుకుపోతున్నది. 

 

హైదరాబాద్ ను ఆటాడించి.. 

ఐపీఎల్-15 సీజన్ లో భాగంగా మార్చి 29న పూణేతో  సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో  సంజూ శాంసన్ టాస్ ఓడాడు. హైదరాబాద్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శాంసన్ (55) తో పాటు పడిక్కల్ (41), హెట్మెయర్ (32), జోస్ బట్లర్ (35) లు రాణించారు. 211 పరుగుల లక్ష్య ఛేదనలో  హైదరాబాద్ ను 149 పరుగులకే కట్టడి చేసింది రాజస్థాన్.

ముంబైకి చుక్కలు... 

తమ రెండో మ్యాచులో  రాజస్థాన్... ముంబైని ఢీకొంది. శనివారం డీవై పాటిల్ లో జరిగిన మ్యాచులో శాంసన్ మళ్లీ టాస్ ఓడాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..  జోస్ బట్లర్ (100), హెట్మెయర్ (35), శాంసన్ (30) ల దూకుడుతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.  అనంతరం బౌలింగ్ లో ముంబైని 170 పరుగులకే కట్టడి చేసి రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.

బ్యాటింగ్ లో జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, షిమ్రన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్ వంటి హిట్టర్లతో ఉన్న రాజస్థాన్... ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ వంటి  ప్రపంచ స్థాయి మేటి బౌలర్లున్నారు. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !