IPL 2022: రాజస్తాన్ రాజసంగా.. బౌలర్లూ సూపర్ హిట్.. లక్నోకు భంగపాటు

Published : May 15, 2022, 11:29 PM ISTUpdated : May 15, 2022, 11:36 PM IST
IPL 2022: రాజస్తాన్ రాజసంగా.. బౌలర్లూ సూపర్ హిట్.. లక్నోకు భంగపాటు

సారాంశం

TATA IPL 2022 LSG vs RR: ప్లేఆఫ్ రేసులో నేనంటే నేను ముందు వెళ్తానంటూ పోటీ పడ్డ రెండు టాప్ జట్లలో చివరికి రాజస్తాన్ రాయల్స్ నే విజయం వరించింది. ఈ సీజన్ లో రాజస్తాన్ చేతిలో లక్నో ఓడటం ఇది రెండో సారి. తాజా విజయంతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో టాప్-2 కు చేరడంతో పాటు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. లక్నో మూడో  స్థానానికి పడిపోయింది.

ఐపీఎల్-15  పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాలలో  కొనసాగుతున్న  లక్నో సూపర్ జెయింట్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య బ్రబోర్న్ స్డేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ నే విజయం వరించింది.  భారీ స్కోరును కాపాడుకునే క్రమంలో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి  లక్నోను నిలువరించారు. బౌల్ట్, ప్రసిధ్, అశ్విన్, చాహల్, మెక్ కాయ్ లు ఆకట్టుకున్నారు. రాజస్తాన్ నిర్దేశించిన 179 పరుగులను ఛేదించే క్రమంలో లక్నో.. 20 ఓవర్లలో 154 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఫలితంగా రాజస్తాన్.. 24 పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్ ప్లేఆఫ్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి టాప్-2 లో నిలవాలన్న లక్నో ఆశలు అడియాసలయ్యాయి. 

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నోకు ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (7) బౌల్ట్ వేసిన 3వ ఓవర్ తొలి బంతికి జిమ్మీ నీషమ్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత బంతికే  ఆయుష్ బదోని (0) కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15 పరుగులకే లక్నో రెండు వికెట్లు కోల్పోయింది. 

ప్రసిధ్ వేసిన ఆరో ఓవర్లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ (10).. మూడో బంతికి జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 6 ఓవర్లు కూడా ముగియకముందే రాజస్తాన్.. 34 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది.  

ఆ క్రమంలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా (39 బంతుల్లో 59.. 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కృనాల్ పాండ్యా (23 బంతుల్లో 25.. 1 ఫోర్, 1 సిక్సర్) లు  ఆచితూచి ఆడారు. వస్తూనే చాహల్ వేసిన  ఏడో ఓవర్లో సిక్సర్ కొట్టిన పాండ్యా.. ఆ తర్వాత హిట్టింగ్ కు వెళ్లలేదు. హుడా కూడా అతడి బాటలోనే నడిచాడు. దీంతో పరుగుల రాక నెమ్మదించింది. 10 ఓవర్లకు లక్నో స్కోరు 66 పరుగులే. కానీ చాహల్ వేసిన 11 ఓవర్లో 6, 4 కొట్టి వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు హుడా. అయితే రాజస్తాన్ బౌలర్లు మాత్రం అందుకు అవకాశమివ్వలేదు. 

సింగిల్స్ తో విసిగెత్తిపోయిన కృనాల్.. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ కు యత్నించాడు. కానీ లాంగాఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జోస్ బట్లర్ పరుగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైన్ లోపల బంతిని జాపి అక్కడే ఉన్న రియాన్ పరాగ్ కు దానిని విసిరి లైన్ క్రాస్ చేశాడు. కానీ అప్పటికే బంతి పరాగ్ చేతుల్లో ఉంది.  దాంతో 65 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  14 ఓవర్లకు లక్నో స్కోరు 98-4. 

పాండ్యా స్థానంలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ (17 బంతుల్లో 27..1 ఫోర్, 2 సిక్సర్లు) తో కలిసి హుడా విజయం కోసం యత్నించాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్ లో అతడికి ఇది నాలుగో ఫిఫ్టీ.  కానీ ఛేదించాల్సిన లక్ష్యం పెరిగి లక్నో వాళ్లిద్దరూ ఒత్తిడికి గురయ్యారు. చాహల్ వేసిన 16వ ఓవర్లో  ఫ్రంట్ ఫుట్ కు వచ్చి ఆడిన  హుడాను శాంసన్ స్టంపౌట్ చేశాడు. 

 

ఇక లక్నో లోయరార్డర్ లో హోల్డర్ (1) అలా వచ్చి ఇలా వెళ్లాడు. దుష్మంత చమీర (0) డకౌటయ్యాడు. ఈ ఇద్దరినీ మెక్ కాయ్.. 17వ ఓవర్లో ఔట్ చేశాడు. ఇక ఆ తర్వాత స్టోయినిస్ కొన్ని మెరుపులు మెరిపించినా అవి లక్నో ఓటమి అంతరాన్ని తగ్గించాయే తప్ప విజయాన్ని అందించలేదు. చివరికి అతడు కూడా ఆఖరి ఓవర్లో రియాన్ పరాగ్  కు  క్యాచ్ ఇచ్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో.. 154 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిధ్, మెక్ కాయ్ లు తలా రెండు వికెట్లు తీశారు. చాహల్, అశ్విన్ లు చెరో వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన  రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.  యశస్వి  జైస్వాల్  (41), సంజూ శాంసన్ (32), దేవదత్ పడిక్కల్ (39) రాణించారు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే