IPL 2022: లక్నోను కట్టుదిట్టంగా కట్టడి చేసిన పంజాబ్.. రఫ్ఫాడించిన రబాడా..

Published : Apr 29, 2022, 09:20 PM ISTUpdated : Apr 29, 2022, 09:23 PM IST
IPL 2022: లక్నోను కట్టుదిట్టంగా కట్టడి చేసిన పంజాబ్.. రఫ్ఫాడించిన రబాడా..

సారాంశం

TATA IPL 2022 PBKS vs LSG: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు ఆకట్టుకున్నారు.  కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నో భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఇక భారమంతా బ్యాటర్ల మీదే.. 

గత మ్యాచ్ లో సీఎస్కేను ఓడించిన పంజాబ్ కింగ్స్ బౌలర్లు తాజాగా  లక్నో  సూపర్ జెయింట్స్ పోరులో కూడా అదరగొట్టారు.  కట్టుదిట్టంగా బంతులు వేసి  లక్నో ను తక్కువ స్కోరుకే నిలువరించారు.  పంజాబ్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసరడమే గాక కీలక సమయంలో వికెట్లు కూడా తీశారు. ఫలితంగా లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో డికాక్, దీపక్ హుడా లు రాణించారు. పంజాబ్ బౌలర్లలో రబాడా 4 వికెట్లు తీశాడు. రాహుల్ చాహర్, సందీప్ శర్మ, రిషి ధావన్ లు లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలవాలంటే 154 పరుగులు చేయాల్సి ఉంది.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు. తొలి రెండు ఓవర్లలో వచ్చినవి 7 పరుగులే.  రబాడా వేసిన  మూడో ఓవర్లో కెఎల్ రాహుల్ (6) వికెట్ కీపర్ జితేశ్ శర్మ కు  క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 13 పరుగులకే లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 

రాహుల్ స్థానంలో వచ్చిన  దీపక్ హుడా (28 బంతుల్లో 34.. 1 ఫోర్, 2 సిక్సర్లు) తో జతకలిసిన క్వింటన్ డికాక్ (37 బంతుల్లో 46.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అప్పుడప్పుడు బంతిని బౌండరీ దాటించినా ధాటిగా అయితే ఆడలేకపోయాడు. రబాడా వేసిన 5 ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన డికాక్.. ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయాడు. మరోవైపు పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో లక్నోకు పరుగుల రాకే కష్టమైంది. సందీప్ శర్మ, రిషి ధావన్ లు లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరారు. దీంతో 8వ ఓవర్లో లక్నో స్కోరు 50 పరుగులు దాటింది. 

వికెట్లు టపటప.. 

లివింగ్ స్టోన్ వేసిన 11 వ ఓవర్లో సిక్సర్ బాదిన హుడా స్కోర్ గేర్ మార్చడానికి ప్రయత్నించాడు. డికాక్ కూడా సందీప్ శర్మ వేసిన 13వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి  ఊపు తెచ్చాడు. ఇద్దరూ కలిసి కుదురుకున్నట్టే కనిపించారు.   కానీ అదే ఓవర్లో నాలుగో బంతికి డికాక్.. జితేశ్ శర్మ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో 85 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. లక్నో వికెట్ల పతనానికి ఇదే నాంది. కాగా, సందీప్ అప్పీల్ కు అంపైర్ ఔటివ్వకపోయినా బంతి బ్యాట్ కు తాకిందని తెలిసి క్రీజును వీడిన డికాక్ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాడు. 

ఇక అర్షదీప్ వేసిన 13వ ఓవర్లో మూడో బంతికి రెండో పరుగు తీస్తుండగా దీపక్ హుడా రనౌటయ్యాడు. రబాడా వేసిన 15వ ఓవర్లో తొలి బంతికే కృనాల్ కూడా లాంగాన్ లో ఉన్న శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చాడు.  అదే ఓవర్  ఐదో బంతికి బదోని (4) కూడా భారీ స్కోరుకు యత్నించి లివింగ్ స్టోన్ సూపర్ క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. 15 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 5 వికెట్ల నష్టానికి 109 పరుగులే..  

 

బదోని ఔటైనా విధ్వంసకర స్టోయినిస్ (1) ఉన్నాడన్న ధైర్యంతో ఉన్న  లక్నో ఆశలపై రాహుల్ చాహర్ నీళ్లు చల్లాడు. చాహర్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి స్టోయినిస్ అతడికే క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. 12 ఓవర్లకు 89-1 గా ఉన్న లక్నో.. 16 ఓవర్లు ముగిసేససరికి 111-6 కు చేరింది. నాలుగు ఓవర్ల పరిధిలో ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. 

ఆఖర్లో హోల్డర్ (11), చమీర (17), మోహ్సిన్ ఖాన్ (13) లు  తలో సిక్సర్ కొట్టి లక్నోకు ఆ మాత్రం స్కోరైనా అందించారు. పంజాబ్ బౌలర్లలో లివింగ్ ప్టోన్ మినహా మిగిలినవారంతా ఆకట్టుకున్నారు. రబాడా 4 వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ, లు తలో వికెట్ పడగొట్టారు. రిషి ధావన్, సందీప్ లు లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు.

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !