
ఐపీఎల్ పుణ్యమా అని ప్రశాంతత కు బ్రాండ్ అంబాసిడర్లు గా నిలిచే ఎంతో మంది క్రికెటర్లు తమలోని ఉగ్ర రూపాన్ని బయిటి ప్రపంచానికి చూపుతున్నారు. ఎప్పుడూ దూకుడుగా ఉండే విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు ఆగ్రహానికి గురయ్యారంటే లైట్ అనుకుంటాం. కానీ నిత్యం శాంతంగా ఉండే ఆటగాళ్లు కూడా ఆగ్రహానికి లోనైతే.. మ్యాచ్ పోతుందున్న అసహనంతో డగౌట్ లో అటూ ఇటూ ఊగిపోతే...? అదే జరిగింది. గుజరాత్ టైటాన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య బుధవారం ముగిసిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో మార్కో జాన్సేన్ ధారాళంగా పరుగులివ్వడంతో డగౌట్ లో ఉన్న ఆ జట్టు మెంటార్ ముత్తయ్య మురళీధరన్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
క్రికెట్ ఆడే సమయంలో తన బౌలింగ్ యాక్షన్ తోనే ప్రత్యర్థిని భయపెట్టే మురళీ.. ఫీల్డ్ లో మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. ఏదైనా ఇంటర్వ్యూలో గానీ ఇతర సమయాల్లో గానీ అతడిని చూస్తే ముఖంలో నవ్వు తప్ప కోపం కనపడదు. కానీ బుధవారం నాటి మ్యాచ్ ఆఖరి ఓవర్లో అతడు ఆగ్రహంతో అందరినీ షాక్ కు గురిచేశాడు.
ఆఖరి ఓవర్లో 22 పరుగులు అవసరముండగా భారీగా పరుగులిస్తున్న జాన్సేన్ బౌలింగ్ ను చూసి మురళీ అసహనానికి గురయ్యాడు. డగౌట్ లో తాను కూర్చున్న కుర్చీ నుంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ తీవ్ర అసహనంగా కనిపించాడు. ‘ఏం బౌలింగ్ చేస్తున్నావ్. ఈ టైంలో ఫుల్ లెంగ్త్ బంతులేంటి.. చూసుకోవా..? అసలు మైండ్ పనిచేస్తుందా..?’ అంటూ ఫైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక చివరి ఓవర్లో జాన్సేన్ 6, 1, 6, 0, 6, 6 ఇచ్చి సన్ రైజర్స్ ఓటమికి కారణమయ్యాడు. ఆర్సీబీతో ఆడిన గత మ్యాచ్ లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి అందరి చేత ప్రశంసలు అందుకున్న ఈ దక్షిణాఫ్రికా యువ పేసర్.. ఈ మ్యాచ్ లో మాత్రం హైదరాబాద్ కు విలన్ గా మారాడు.
చెత్త రికార్డు :
కాగా ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి భారీగా పరుగులిచ్చిన జాన్సేన్ తన పేరిట ఓ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. నాలుగు ఓవర్లలో 63 పరుగులిచ్చిన అతడు.. లక్ష్య ఛేదన సమయంలో ప్రత్యర్థి జట్టుకు భారీగా పరుగలిచ్చిన రెండో బౌలర్ గా నిలిచాడు. ఇంతకుముందు లుంగి ఎంగిడి (ఇతడిది కూడా దక్షిణాఫ్రికానే) 2019 లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ.. 4 ఓవర్లలో 62 పరుగులిచ్చాడు. తాజాగా జాన్సేన్ అంతకన్నా ఒక పరుగు ఎక్కువే ఇచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (65), మార్క్రమ్ (56), శశాంక్ సింగ్ (25 నాటౌట్) లు రాణించారు. లక్ష్య ఛేదనలో గుజరాత్.. 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు సాధించింది. ఆఖరి ఓవర్లో చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు రషీద్ ఖాన్. ఈ మ్యాచ్ లో గుజరాత్ ఇన్నింగ్స్ ను దెబ్బతీసి 5 వికెట్లు పడగొట్టిన ఉమ్రాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.