IPL 2022: ముంబై.. ఇక బై బై.. రోహిత్ సేనను ముంచిన ధోని.. ఆఖరి ఓవర్లో మహేంద్రుడి విధ్వంసం..

Published : Apr 21, 2022, 11:40 PM ISTUpdated : Apr 21, 2022, 11:48 PM IST
IPL 2022: ముంబై.. ఇక బై బై.. రోహిత్ సేనను ముంచిన ధోని.. ఆఖరి ఓవర్లో మహేంద్రుడి విధ్వంసం..

సారాంశం

TATA IPL 2022 - MI vs CSK: ముంబై - చెన్నై జట్ల అభిమానులతో పాటు ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా ఈ దిగ్గజాల మధ్య మ్యాచ్ ను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారో మరోసారి నిరూపితమైంది. లో స్కోరింగ్ గేమ్ అయినా రెండు జట్లు విజయం కోసం తుదివరకు పోరాడాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై పోరాడి ఓడింది. 

 ఐపీఎల్-2022 సీజన్ లో వరుసగా ఆరు మ్యాచులు ఓడిన ముంబై..  తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పోరాడి ఓడింది.. బ్యాటింగ్ లో విఫలమైనా.. బౌలింగ్ లో  కట్టుదిట్టంగా బంతులు విసిరి సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంటుందని భావించినా చివర్లో ఫినిషర్ ధోని అద్భుత బ్యాటింగ్ తో  చెన్నైని విజయం వరించింది. లో స్కోరింగ్ గేమ్ అయినా  అభిమానులకు చివరివరకు  ఉత్కంఠను రేపింది.  ముంబై నిర్దేశించిన 156 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై..  ఆఖరి బంతికి గెలుపును అందుకుంది. ఈ సీజన్ లో ఏడు మ్యాచులాడిన రోహిత్ సేనకు ఇది ఏడో ఓటమి కాగా.. చెన్నైకి రెండో విజయం. ఇక ఈ విజయంతో చెన్నై ప్లే ఆఫ్ ఆశలు సజీవం.

మోస్తారు లక్ష్య ఛేదనలో  చెన్నైకి కూడా ఆశించిన ఆరంభం దక్కలేదు. ఈ సీజన్ లో వరుసగా విఫలమవుతూ గత మ్యాచ్ లోనే ఫామ్ లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (0) మరోసారి గోల్డెన్ డకౌటయ్యాడు.  వన్ డౌన్ లో వచ్చిన మిచెల్ సాంట్నర్ (11) కూడా  త్వరగానే నిష్క్రమించాడు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది చెన్నై. వీళ్లిద్దరూ  డేనియల్ సామ్స్ బౌలింగ్ లోనే నిష్క్రమించారు. 

అయితే రాబిన్ ఊతప్ప (25 బంతుల్లో 30.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తో జతకలిసిన అంబటి రాయుడు (35 బంతుల్లో 40.. 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 50 పరుగులు జోడించారు. క్రీజులో కుదురుకున్న ఈ జంటను ఉనద్కత్ విడదీశాడు. అతడు వేసిన 9వ ఓవర్లో ఊతప్ప.. డెవాల్డ్ బ్రెవిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ఊతప్ప నిష్క్రమించినా.. శివమ్ ధూబే (13) తో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ ను నడిపించడానికి ప్రయత్నించాడు రాయుడు. కానీ డేనియల్ సామ్స్ చెన్నైకి మరో షాకిచ్చాడు. అతడు వేసిన 13వ ఓవర్ ఆఖరి బంతికి శివమ్ దూబే.. ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ఇదే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్. దీని తర్వాత చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. ముంబై కి విజయం మీద ఆశలు  కలిగింది కూడా ఇక్కడే. 

దూబే  పెవిలియన్ చేరాక సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతుండటంతో హిట్టింగ్ కు దిగుదామనుకున్న రాయుడు కూడా సామ్స్ బౌలింగ్ లోనే బోల్తా కొట్టాడు.  అతడు వేసిన 14వ ఓవర్లో రాయుడు పొలార్డ్ కు క్యాచ్ ఇచ్చి  పెవిలియన్ బాట పట్టాడు. ఆ మరుసటి ఓవర్లో చెన్నై సారథి రవీంద్ర జడేజా (3) కూడా నిష్క్రమించాడు. 

ధోని.. ద ఫినిషర్

మ్యాచ్  సీఎస్కే చేతుల నుంచి చేజారుతుందనుకున్న తరుణంలో చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోని (13 బంతుల్లో 28 నాటౌట్.. 3 ఫోర్లు, 1 సిక్సర్), ప్రిటోరియస్ (22) లు  ఆఖర్లో పోరాడారు. ధోనిని ఎందుకు అందరు ఫినిషర్ అంటారో మరోసారి నిరూపిస్తూ.. మహేంద్రుడు మరోసారి శివమెత్తాడు. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్లో  హైడ్రామా నెలకొంది.  ఉనద్కత్ వేసిన తొలి బంతికి ప్రిటోరియస్ ఔట్ అయ్యాడు. రెండో బంతికి బ్రావో సింగిల్ తీశాడు. మూడో బంతికి ధోని సిక్సర్. నాలుగో బంతికి ఫోర్. ఐదో బంతికి రెండు పరుగులు. చివరి బంతికి ధోని.. ఫోర్ కొట్టి చెన్నైకి  చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 

 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన  ముంబై ఇండియన్స్  బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.  ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు డకౌట్ కాగా.. డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా  క్రీజులో నిలవలేదు. కానీ సూర్యకుమార్ యాదవ్ (32) సాయంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (52 నాటౌట్) రాణించాడు. హృతిక్ షోకిన్ (25), ఉనద్కత్ (19 నాటౌట్) మెరవడంతో ముంబై  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది. తాజా ఓటమితో ఐపీఎల్-2022 లో రోహిత్ సేన ప్లే ఆఫ్ అవకాశాలకు గండి పడింది. కాగా.. ఐపీఎల్ లో 5 ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్.. ఒక సీజన్ లో ఏడు మ్యాచులు ఓడిన జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !