
ఐపీఎల్-2022 ప్లేఆఫ్స్ అంకానికి చేరువైంది. ప్లేఆఫ్స్ కోసం మూడు బెర్త్ లు ఖాయమైనా నాలుగో స్థానం కోసం హోరాహోరి పోరు జరుగుతున్నది. ఆశలున్నా లేకున్నా కనీసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో కేకేఆర్ ఒకటి. అసలు పోటీలోనే ఉండదని భావించిన ఆ జట్టు వరుస విజయాలతో అనూహ్యంగా ప్లేఆఫ్ రేసులో నిలిచింది. నేడు రాత్రి కేకేఆర్.. లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ లో తలపడనుంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కు రానుంది.
ఈ సీజన్ లో ఇప్పటివరకు 13 మ్యాచులాడిన కేకేఆర్ కు ఇది జీవన్మరణ పోరాటం. ఇప్పటివరకు 6 మ్యాచుల్లో గెలిచిన ఆ జట్టు ఈ మ్యాచ్ లో నెగ్గినా 7 విజయాలతో 14 పాయింట్లు సాధిస్తుంది. అయితే కేకేఆర్ విజయం ఒక్కటే గాక ఢిల్లీ, హైదరాబాద్, ఆర్సీబీ, పంజాబ్ ల విజయాలు, పరాజయాలు కేకేఆర్ ప్లేఆఫ్ రేసును నిర్దారిస్తాయి.
ఇక పాయింట్ల పట్టికలో టాప్-3 లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే 8 విజయాలతో ప్లేఆఫ్ రేసును ఖాయం చేసుకున్నా ఆ జట్టు టాప్-2 కోసం గురి పెట్టింది. 8 మ్యాచులు గెలిచినా గత రెండు మ్యాచులలో మాత్రం ఆ జట్టు పరాజయాల పాలైంది. ప్లేఆఫ్స్ ముందు మరో ఓటమి మూటగట్టుకోకుండా విజయంతో అక్కడికి చేరాలని లక్నో భావిస్తున్నది.
ఈ సీజన్ లో తొలుత బాగానే ఆడినా కేకేఆర్ తర్వాత వరుస పరాజయాలతో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నా ఆలస్యంగా మేల్కొంది. వరుసగా సన్ రైజర్స్, ముంబైలపై గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ఆండ్రీ రసెల్ ఆ జట్టుకు ప్రతి మ్యాచ్ లో ఆపద్బాంధవుడిగా మారాడు. నేటి మ్యాచ్ లో కూడా కేకేఆర్ అతడి మీదే ఆశలు పెట్టుకుంది.
ఇక మరోవైపు లక్నో.. తమ గత రెండు మ్యాచులలో ఓడి కాస్త వెనుకబడింది. ఈ రెండు మ్యాచులలో ఆ జట్టు బ్యాటింగ్ దారుణంగా ఉంది. కెఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ లు విఫలమవుతున్నారు. ఒక్క దీపక్ హుడా మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. కానీ ప్లేఆఫ్స్ ముందు రాహుల్, డికాక్ లు తిరిగి ఫామ్ ను అందుకోవాలని లక్నో భావిస్తున్నది. వీరికి తోడు ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ను కూడా బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపాలని తద్వారా వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించేందుకు ఆస్కారం ఉంటుందని లక్నో ప్రణాళిక. మరి నేటి మ్యాచ్ లో లక్నో ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి.
ఈ సీజన్ లోనే లక్నో-కోల్కతా మధ్య జరిగిన ఏకైక మ్యాచ్ లో లక్నో నే విజయం వరించింది.
ఈ మ్యాచ్ లో లక్నో తరఫున కృనాల్ పాండ్యా, అయుష్ బదోని, దుష్మంత చమీర స్థానాలలో మనన్ వోహ్రా, కృష్ణప్ప గౌతమ్, ఎవిన్ లూయిస్ ఆడనున్నారు. కేకేఆర్ తరఫున రహానే స్థానంలో అభిజిత్ తోమర్ ఆడనున్నాడు.
తుది జట్లు :
కోల్కతా నైట్ రైడర్స్ : వెంకటేశ్ అయ్యర్, అభిజిత్ తోమర్, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, వరుణ్ చక్రవర్తి
లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, కృష్ణప్ప గౌతమ్, ఎవిన్ లూయిస్, మార్కస్ స్టోయినిస్, జేసన్ హోల్డర్, మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీర, అవేశ్ ఖాన్