
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో సెంచరీ చేసిన బట్లర్.. తాజగా రెండో శతకం కూడా బాదేశాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సెంచరీ చేసి ఈ సీజన్ లో తొలి సెంచరీ నమోదు చేసిన బట్లర్.. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ పై కూడా అదే ఫీట్ ను రిపీట్ చేశాడు.
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 66 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్కును అందుకున్నాడు బట్లర్. ఇక కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో 59 బంతుల్లోనే ఆ ఫీట్ ను సాధించాడు. అతడి సెంచరీలో 9 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి.
ఐపీఎల్ లో బట్లర్ కు ఇది మూడో సెంచరీ. గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో తొలి శతకం బాదిన బట్లర్.. ఈ ఏడాది ముంబైపై సెంచరీ చేసి ఐపీఎల్ లో రెండు సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ల జాబితాలోరెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో బెన్ స్టోక్స్.. బట్లర్ కంటే ముందున్నాడు. మొత్తంగా ఐపీఎల్ లో సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్ల జాబితాలో కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో లు బట్లర్ కంటే ముందున్నారు.
రాజస్తాన్ తో మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన బట్లర్.. ఆది నుంచి బాదుడు మంత్రాన్నే ప్రయోగించాడు. కమిన్స్ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు రాబట్టాడు. అదే ఓవర్లో ఐదో బంతికి ఫోర్ కొట్టిన బట్లర్ ఈ ఐపీఎల్ లో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 29 బంతుల్లోనే అతడి అర్థ సెంచరీ పూర్తయింది. అదే ఊపులో ఉమేశ్ యాదవ్ వేసిన 9వ ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టి స్కోరు బోర్డు వేగాన్ని మరింత పెంచాడు.
మధ్యలో కాస్త నెమ్మదించినా.. మళ్లీ జోరు పెంచి సెంచరీకి దగ్గరయ్యాడు. కమిన్స్ వేసిన 13వ ఓవర్లో రెండు బౌండరీలు బాది ఎనభైల్లోకి చేరాడు. రసెల్ వేసిన 16వ ఓవర్లో బౌండరీ బాది 90లలోకి చేరిన బట్లర్.. కమిన్స్ వేసిన 17వ ఓవర్లో రెండో బంతిని సిక్సర్ గా మలిచి సీజన్ లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్లో నాలుగో బంతికి ఫైన్ లెగ్ లో ఉన్న వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కాగా.. 2008లో సరిగ్గా ఇదే రోజున బెంగళూరులో కేకేఆర్-ఆర్సీబీ మధ్య జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ లో కేకేఆర్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ సెంచరీ సాధించగా.. నేడు అదే కేకేఆర్ పై జోస్ బట్లర్ శతకం బాదాడు. మొత్తంగా ఐపీఎల్ లో ఇది 70వ సెంచరీ..
ఒక సీజన్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లు:
- క్రిస్ గేల్ - 2 (2011)
- విరాట్ కోహ్లి - 4 (2016)
- హషీమ్ ఆమ్లా - 2 (2017)
- షేన్ వాట్సన్ - 2 (2018)
- శిఖర్ ధావన్ - 2 ( 2020)
- జోస్ బట్లర్ - 2 ( 2022)