IPL 2022: అరవీర భయంకర బట్లర్.. ఐపీఎల్-15 లో మూడో సెంచరీ.. తేలిపోయిన ఢిల్లీ బౌలర్లు

Published : Apr 22, 2022, 09:29 PM ISTUpdated : Apr 22, 2022, 09:38 PM IST
IPL 2022: అరవీర భయంకర బట్లర్.. ఐపీఎల్-15 లో మూడో సెంచరీ.. తేలిపోయిన ఢిల్లీ బౌలర్లు

సారాంశం

TATA IPL 2022- DC vs RR: ఈ సీజన్  కు ముందు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఎక్కడికి వెళ్లొచ్చాడో గానీ బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన ఈ ఇంగ్లీష్ బ్యాటర్.. ఇప్పుడు ఢిల్లీ పై కూడా శతకం బాదాడు. బట్లర్ ఆట చూస్తే 2016 సీజన్ లో కోహ్లిని గుర్తుకు తెస్తున్నాడు.

ఐపీఎల్-2022 లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సీజన్ లో వరుసగా రెండో సెంచరీ, సీజన్లో మూడో శతకాన్ని నమోదు చేశాడు.  ఢిల్లీ క్యాపిటల్స్ తో వాంఖెడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో.. ఓపెనర్ గా వచ్చిన బట్లర్  65 బంతుల్లోనే 116 పరుగులు సాధించాడు. అతడి సూపర్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 54.. 7 ఫోర్లు, 2 సిక్సర్లు) జతగా తొలి వికెట్ కు 155 పరుగులు జోడించాడు. అనంతరం సంజూ శాంసన్ కూడా చెలరేగి ఆడాడు. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్.. 2 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లు తేలిపోయిన వేళ.. వాంఖెడే లో రాజస్తాన్ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్ల సునామీ సృష్టించారు.

ఢిల్లీ ఆహ్వానం మేరకు   బ్యాటింగ్ కు వచ్చిన రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ను ధాటిగానే ప్రారంభించింది. తొలి ఓవర్లోనే బట్లర్ రెండు బౌండరీలు బాది తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. అయితే తర్వాత రెండు ఓవర్లలో నాలుగు పరుగులే వచ్చాయి.   కానీ ముస్తాఫిజుర్ వేసిన నాలుగో ఓవర్లో 3 బౌండరీలు బాదాడు పడిక్కల్.

బట్లర్ బాదుడు షురూ.. 

ఆరో ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్  బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన బట్లర్ బాదుడు షురూ చేశాడు. పడిక్కల్ కూడా అదే బాటలో పయనించాడు. కుల్దీప్  యాదవ్ వేసిన 9వ ఓవర్లో సిక్సర్, ఫోర్ కొట్టిన బట్లర్..  లలిత్ యాదవ్ వేసిన పదకొండో ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టి.. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు.  అదే ఓవర్లోనే పడిక్లక్ కూడా 4, 6 బాదడంతో తొలి వికెట్ భాగస్వామ్యం  వంద పరుగులు దాటింది.

ఇక హాఫ్ సెంచరీ తర్వాత  బట్లర్.. ఢిల్లీ బౌలర్లకు విశ్వరూపమే చూపాడు. లలిత  వేసిన 13వ ఓవర్లో 6, 4, 6 కొట్టి  డెబ్బైల్లోకి చేరాడు. ఇక తర్వాత కుల్దీప్ యాదవ్ వేసిన 15వ ఓవర్లో.. 6, 6, 4 బాది సెంచరీకి దగ్గరయ్యాడు.  ఆ క్రమంలో ఖలీల్ అహ్మద్ వేసిన 16 ఓవర్ తొలి బంతికి పడిక్కల్.. ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. దీంత 155 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  

 

మూడో సెంచరీ.. 

ఖలీల్ వేసిన అదే ఓవర్లో ఐదో బంతిని లాంగ్ ఆన్ దిశగా కొట్టిన బట్లర్ సెంచరీ సాధించాడు.  ఈ సీజన్ లో అతడికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం.  మొత్తంగా నాలుగో సెంచరీ. హాఫ్ సెంచరీకి  36 బంతులు తీసుకున్న బట్లర్..  తర్వాత 50 పరుగులను 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. వీటిలో ఎక్కువ భాగం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. కాగా సెంచరీ చేసిన  క్రమంలో బట్లర్ పలు రికార్డులు నమోదు చేశాడు.  ఒక సీజన్ లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన వారి జాబితాలో విరాట్ కోహ్లి తర్వాత నిలిచాడు. కోహ్లి 2016 సీజన్ లో  4 సెంచరీలతో కదం తొక్కాడు. 

ఈ సీజన్ లో బట్లర్ స్కోర్లు : ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్ లు ఆడిన బట్లర్ స్కోర్లు..  35, 100, 70, 13, 54,  103, 116 గా ఉన్నాయి. ఏడు ఇన్నింగ్స్ లో ఏకంగా 81.83 సగటుతో 491 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

కాగా పడిక్కల్ ఔటయ్యాక వచ్చి కెప్టెన్ సంజూ శాంసన్ (19 బంతుల్లో 46 నాటౌట్.. 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడాడు. ఖలీల్ వేసిన 18వ ఓవర్లో 4, 6, 4, 6  తో చెలరేగాడు. ఆఖరి ఓవర్లో శార్దూల్ కూడా 20  పరుగులు ఇచ్చుకున్నాడు.  దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్.. 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. బట్లర్, పడిక్కల్, సంజూ శాంసన్ ధాటికి ఢిల్లీ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసిన ఢిల్లీ బౌలర్లలో అందరి ఎకానమీ 10 దాటడం విశేషం. ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ లకు తలో వికెట్ దక్కింది. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !