IPL 2022: రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..

Published : Apr 22, 2022, 07:06 PM IST
IPL 2022:  రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..

సారాంశం

TATA IPL 2022- DC vs RR: ఐపీఎల్-15లో భాగంగా వాంఖెడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. పాయింట్ల పట్టికలో మూడు, ఆరో స్థానంలో  ఉన్న ఈ జట్లలో పైచేయి ఎవరిది అవుతుందో మరి..?  

నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న  ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ లో  ఆందోళన పెరుగుతున్నా ఆ జట్టు మాత్రం ఆత్మ నిబ్బరంతో  పోరాడుతున్నది. రెండ్రోజుల క్రితం  పంజాబ్ కింగ్స్ ను అన్ని విభాగాల్లో నిలువరించిన రిషభ్ పంత్ సేన.. నేడు కూడా దానినే కొనసాగించాలని భావిస్తున్నది. కానీ సంజూ శాంసన్ సారథ్యంలోని  రాజస్తాన్ రాయల్స్ తో అంత వీజీ కాదు. ఈ రెండు జట్ల మధ్య  వాంఖెడే వేదికగా  జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఈ సీజన్ లో ట్రెండ్ ను ఫాలో అవుతూ బౌలింగ్ నే ఎంచుకుంది. తన కుటుంబంలో ఒకరికి పాజిటివ్ సోకడంతో ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. దీంతో హెడ్ కోచ్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగుతున్నది. 

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో  ప్లేస్ లో నిలిచింది. రాజస్తాన్ ఆరు మ్యాచులాడగా నాలుగు గెలిచి రెండింటిలో ఓడగా..  ఢిల్లీ మూడేసి మ్యాచుల్లో గెలుపోటములు చవిచూసింది. ఈ రెండు జట్లు తాము ఆడిన గత మ్యాచులలో.. రాజస్తాన్ కేకేఆర్ ను ఓడించగా ఢిల్లీ పంజాబ్ ను మట్టికరిపించి జోరుమీదుంది. ఇరు జట్లలో మార్పులేమీ లేవు. గత  మ్యాచ్ లో ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నాయి.

బలాబలాల విషయానికొస్తే..

ఢిల్లీ కి ఓపెనర్లే  కొండంత అండ. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ లు రాకెట్  స్పీడ్ తో  దూసుకుపోతున్నారు.  ఈ ఇద్దరిలో ముఖ్యంగా షా అయితే తొలి ఓవర్  నుంచే ప్రత్యర్థి పై  దాడికి దిగుతున్నాడు. ఉండేది ఆరేడు ఓవర్లే అయినా  కలిగించాల్సిన నష్టాన్ని చేసే వెళ్తున్నాడు.  వార్నర్ కూడా నిలకడగా ఆడుతూ  తానెంతో విలువైన ఆటగాడో గుర్తు చేస్తున్నాడు.  రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్,  శార్దూల్ ఠాకూర్ లతో  ఢిల్లీ బ్యాటింగ్ లోతుగా ఉంది.  

బౌలింగ్ లో  ఆ జట్టు నోర్త్జ్ సేవలు కోల్పోతున్నా ముస్తాఫిజుర్, ఖలీల్ అహ్మద్ రాణిస్తున్నారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్   కట్టుదిట్టంగా బంతులు వేయడమే కాదు వికెట్లు కూడా పడగొడుతున్నారు.  శార్దూల్ ఠాకూర్ కాస్త పరుగులిస్తున్నా  ఆల్ రౌండర్ గా సేవలందిస్తున్నాడు. 

ఇక రాజస్తాన్  కూడా అన్ని విభాగాల్లో  ఢిల్లీ కంటే పటిష్టంగా ఉంది.  ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ (జోస్ బట్లర్), పర్పులు క్యాప్ (యుజ్వేంద్ర చాహల్) వారి వద్దే ఉన్నాయి.  బట్లర్ ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. 375 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. దేవదత్ పడిక్కల్ మెరుపులు మెరిపించకపోయినా బట్లర్ కు తోడుగా నిలుస్తున్నాడు. వన్ డౌన్ లో వచ్చే సంజూ శాంసన్, హెట్మెయర్ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. రాజస్తాన్ బ్యాటింగ్ భారమంతా వీళ్లే మోస్తున్నారు. 

బౌలింగ్ లో రాజస్తాన్ కు తిరుగులేని బౌలర్లున్నారు. ఈ సీజన్ లో ఇంతటి భీకర బౌలింగ్ దళమున్న జట్టు మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి పేసర్లకు తోడు మెక్ కాయ్ కూడా జతకలిశాడు.  ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లు అనదగ్గ ఇద్దరు మేటి ఆటగాళ్లు.. అశ్విన్, చాహల్ కూడా ఆ జట్టు సొంతం. 

ముఖాముఖి : ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచులు జరిగాయి. వీటిలో ఇరు జట్లు తలో 12 మ్యాచుల్లో గెలిచి సమానంగా ఉన్నాయి.  

తుది జట్లు : 

రాజస్తాన్ రాయల్స్ : జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్) , షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, ఆర్. అశ్విన్, ఒబెడ్ మెక్ కాయ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్ 

ఢిల్లీ క్యాపిటల్స్ :  పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రొవ్మెన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ 

PREV
click me!

Recommended Stories

IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !