
రెండు సంవత్సరాల తర్వాత భారత్ లో జరుగుతున్న (పూర్తిస్తాయిలో) ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022 ప్రారంభానికి ఇక కొద్ది నిముషాలు మాత్రమే సమయముంది. సాయంత్రం 7.30 గంటల నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, గత సీజన్ పరాజితులు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగబోతున్నది. ఈ సీజన్ అంతా మహారాష్ట్ర రాజధాని ముంబై లోని వాంఖెడే, బ్రబోర్న్, డీవై పాటిల్ తో పాటు పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరుగుతుంది. అయితే తొలి మ్యాచ్ మాత్రం ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియంలో జరుగనున్నది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ స్టేడియం.. భారత్ కు 2011 లో ప్రపంచకప్ ను అందించింది. భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లు పరుగుల వరద పారించిన ఈ గ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, బాంబే క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) ల మధ్య తలెత్తిన వివాదంతో వాంఖెడే నిర్మాణం పురుడు పోసుకుంది. అప్పటి బీసీఏ సెక్రటరీ గా ఉన్న ఎస్.కే. వాంఖెడే ఈ స్టేడియానికి కర్త, కర్మ, క్రియ. దక్షిణ ముంబై లోని చర్ఛ్ గేట్ స్టేషన్ కు సమీపంలో ఉండే ఈ స్టేడియాన్ని 1974లో నిర్మించారు. దీని నిర్మాణానికి 13 నెలల సమయం పట్టింది. ఈ స్టేడియానికి రూపకర్త అయిన బారిష్టర్ శేష్రావ్ వాంఖెడే పేరు మీదే.. దీనిని వాంఖెడే స్టేడియం అని పిలుస్తారు.
తొలి టెస్టు మ్యాచ్..
1975లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ స్టేడియంలో జరిగిన మొట్ట మొదటి మ్యాచ్ ఇండియా-వెస్టిండీస్ ల మధ్య జరిగింది. ఆ ఏడాది భారత పర్యటనకు వచ్చిన విండీస్.. భారత్ తో తొలి టెస్టును ఇక్కడే ఆడింది. కానీ ఆ టెస్టులో భారత్ 201 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ 242 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
రవిశాస్త్రి ఆరు సిక్సర్లు కొట్టింది ఇక్కడే..
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి రంజీలలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టింది వాంఖెడే లోనే. 1984-85 రంజీ సీజన్ లో బరోడాతో మ్యాచ్ సందర్భంగా శాస్త్రి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఆ మ్యాచులో శాస్త్రి.. 123 బంతుల్లో 200 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
వాంఖెడే గురించి కొన్ని ఆసక్తికర విషయాలు :
- సుమారు మూడు దశాబ్దాల అనంతరం మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు ఇక్కడే తన రెండో వన్డే ప్రపంచకప్ ను ముద్దాడింది.
- స్టేడియం కెపాజిటీ : 33,108
- వాంఖెడే లోని స్టాండ్లకు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, విజయ్ మర్చంట్, పేర్లను కూడా పెట్టారు.
- 2013లో సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో ఆఖరి మ్యాచ్ ఆడింది ఇక్కడే.. (విండీస్ మీద)
- ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్.. ఒక ఇన్నింగ్స్ లో పది వికెట్లు సాధించాడు.
వాంఖెడే లో ఐపీఎల్ రికార్డులు :
- వాంఖెడే లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ విరాట్ కోహ్లి (235.. 2016-17 లో ఇంగ్లాండ్ మీద)
- 2018లో ఇక్కడే ఐపీఎల్ ఫైనల్ జరిగింది. (చెన్నై విజేత)
- ఐపీఎల్ లో వాంఖెడే లో ఆడుతూ అత్యధిక పరుగులు చేసిన జట్టు ఆర్సీబీ : 235-1 (ముంబై ఇండియన్స్ మీద)
- అత్యల్ప స్కోరు : 67 ఆలౌట్ (కోల్కతా)
- అత్యధిక ఐపీఎల్ రన్స్ : రోహిత్ శర్మ (1,733 పరుగులు)
- అత్యధిక ఐపీఎల్ వికెట్లు : లసిత్ మలింగ (68)
- ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (ఎబి డివిలియర్స్ - 133)
- అత్యుత్తమ బౌలింగ్ : 5/18