IPL2022 GT vs CSK: మిల్లర్ కిల్లర్.. రఫ్ఫాడించిన రషీద్ ఖాన్.. చెన్నైకి తప్పని ఓటమి..

Published : Apr 17, 2022, 11:22 PM ISTUpdated : Apr 17, 2022, 11:28 PM IST
IPL2022 GT vs CSK: మిల్లర్ కిల్లర్.. రఫ్ఫాడించిన రషీద్ ఖాన్.. చెన్నైకి తప్పని ఓటమి..

సారాంశం

TATA IPL 2022- GT vs CSK: డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగిన చెన్నైకి మరోసారి భంగపాటు. బెంగళూరుతో మ్యాచ్ లో  గెలిచి గాడిలో పడ్డట్టే కనిపించిన  సీఎస్కే.. గుజరాత్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఓటమి పాలైంది. 

వరుసగా నాలుగు మ్యాచులు ఓడి  బెంగళూరుతో మ్యాచ్ లో  గెలిచి విజయాల బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గాడి తప్పింది. ఐపీఎల్ టేబుల్ టాపర్లుగా ఉన్న గుజరాత్ టైటాన్స్ ఐదో విజయాన్ని అందుకుంది. ఇన్నింగ్స్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో విజయం మాత్రం గుజరాత్ నే వరించింది. డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ లు రాణించడంతో ఆ జట్టు.. ఓటమి అంచుల నుంచి విజయ తీరాలకు చేరుకుంది. అసలు గెలిచే అవకాశం లేని స్థితి నుంచి  గుజరాత్ విజయం సాధించిందంటే దానికి మిల్లర్ నిలకడ, రషీద్ ఖాన్ మెరుపులే కారణం. చెన్నై నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని  గుజరాత్.. 19.5 ఓవర్లలో ఛేదించి  మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

మోస్తారు లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ కు ఆదిలోనే షాకిచ్చారు చెన్నై బౌలర్లు. ఓపెనర్ శుభమన్ గిల్ (0) పరుగులేమీ చేయకుండానే ముఖేశ్ చౌదరి వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతికి ఊతప్ప కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విజయ్ శంకర్ (0) మరోసారి విఫలమయ్యాడు.

ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో అభినవ్ మనోహర్ (12) కూడా వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ నాలుగు ఓవర్లకే 3 కీలక వికెట్లు కోల్పోయి 16 పరుగులే చేసి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (51 బంతుల్లో 94 నాటౌట్.. 8 ఫోర్లు, 6 సిక్సర్లు).. వృద్ధిమాన్ సాహా (18 బంతుల్లో 11) తో కలిసి స్కోరుబోర్డు వేగాన్ని పెంచాడు. అయితే క్రీజులో ఉన్నంతసేపు ఇబ్బంది పడ్డ సాహా..  రవీంద్ర జడేజా వేసిన 8వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పది ఓవర్లకు గుజరాత్ స్కోరు 58 పరుగులే..

వరుసగా వికెట్లు పడుతున్నా మిల్లర్ మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. మొయిన్ అలీ వేసిన 11 వ ఓవర్లో సిక్సర్  కొట్టిన మిల్లర్.. జడేజా వేసిన 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్  బాదాడు.  ఆ తర్వాతి ఓవర్లోనే బ్రావో.. రాహుల్ తెవాటియా (6) ను వెనక్కి పంపాడు. ఆ క్రమంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ (21 బంతుల్లో 40.. 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రఫ్ఫాడించాడు. 

 

జోర్డాన్ వేసిన 14వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన మిల్లర్.. బ్రావో, మహేశ్ తీక్షణ బౌలింగ్ లో కూడా సిక్సర్లు బాదాడు.  ఇక చెన్నైని ముంచిన 18వ ఓవర్లో రషీధ్ ఖాన్  తన విశ్వరూపం చూపాడు. క్రిస్ జోర్డాన్ వేసిన ఆ ఓవర్లో.. వరుసగా 6, 6, 4, 6 బాదాడు. దీంతో మొత్తంగా ఆ ఓవర్లో 25 పరగులొచ్చాయి.  తర్వాత బ్రావో బౌలింగ్ లో తొలి బంతికి ఫోర్ కొట్టిన రషీద్ ఖాన్.. ఐదో బంతికి మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్ లాస్ట్ బంతికి జోసెఫ్ (0) కూడా ఔటయ్యాడు. ఆ ఓవర్లో పది పరగులొచ్చాయి. 

ఇక ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమనగా.. మళ్లీ జోర్డాన్ కే బంతినిచ్చాడు జడ్డూ. క్రీజులో డేవిడ్ మిల్లర్. తొలి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. మూడో బంతికి సిక్సర్. నాలుగో బంతికి నో బాల్ వేశాడు జోర్డాన్. కీలక సమయంలో వచ్చిన ఫ్రీహిట్ ను  సద్వినియోగం చేసుకున్నాడు మిల్లర్. తర్వాత బంతిని ఫోర్ కొట్టాడు. ఐదో బంతికి  డబుల్ తీసి  గుజరాత్ కు  ఐదో విజయాన్ని అందించాడు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 73)  ఫామ్ లోకి రావడమే గాక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి అంబటి రాయుడు (31 బంతుల్లో 46) తోడుగా నిలిచాడు. ఆఖర్లో జడేజా (22 నాటౌట్) విజృంభణతో చెన్నై ఆ  స్కోరు చేయగలిగింది.  

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !