
తొలి మ్యాచులో భారీ స్కోరు సాధించినా కాపాడుకోలేకపోయామన్న కసో ఏమో గానీ కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. రెండు వందలు కొట్టిన కాపాడుకోని బౌలర్లు.. కోల్కతా నైట్ రైడర్స్ ను 128 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ.. అద్బుత ప్రదర్శనతో కేకేఆర్ బ్యాటింగ్ ను కకావికలం చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన హసరంగ.. 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడికి తోడు హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్ కూడా రాణించారు. దీంతో 20 ఓవర్లలో కేకేఆర్.. 128 పరుగులకు ఆలౌట్ అయింది. సీజన్ లో తొలి విజయం నమోదు చేసేందుకు ఆర్సీబీ... 129 పరుగులు చేయాలి.
టాస్ గెలిచిన డుప్లెసిస్.. కోల్కతాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. అయితే భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న కేకేఆర్ కు ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కోల్కతా బ్యాటర్లకు పరుగులు చేసే అవకాశమే కల్పించలేదు. దీంతో అజింక్యా రహానే (10 బంతుల్లో 9), వెంకటేశ్ అయ్యర్ (14 బంతుల్లో10) పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించారు.
కేకేఆర్ ఇన్నింగ్స్ 5 ఓవర్లకే ఓపెనర్లను కోల్పోయాక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (10 బంతుల్లో 13), నితీశ్ రాణా (5 బంతుల్లో 10) కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయ్యర్ నను హసరంగ ఔట్ చేయగా.. రాణాను ఆకాశ్ దీప పెవిలియన్ కు పంపాడు.
ఈ క్రమంలో ఆర్సీబీ పట్టు బిగించింది. తర్వాత వచ్చిన ఆటగాళ్లెవరూ కుదురుకోకుండా.. హసరంగతోనే బౌలింగ్ చేయించాడు డుప్లెసిస్. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. హసరంగ సునీల్ నరైన్ (8 బంతుల్లో 12), షెల్డన్ జాక్సన్ (0) ల పనిపట్టాడు. అప్పటికే కేకేఆర్.. 8.6 ఓవర్లకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి 67 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆండ్రూ రసెల్ కాసేపు మెరుపులు మెరిపించాడు. 18 బంతులు ఎదుర్కున్న రసెల్.. 1 ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేశాడుు. కానీ అతడిని హర్షల్ పటేల్ బోల్తా కొట్టించాడు. హర్షల్ వేసిన 13.5 ఓవర్లో రసెల్ కీపర్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
రసెల్ ఔటయ్యాక వచ్చిన టిమ్ సౌథీ (1) అలా వచ్చి ఇలా వెళ్లాడు. అయితే ఆఖర్లో వచ్చిన ఉమేశ్ యాదవ్ (12 బంతుల్లో 18), వరుణ్ చక్రవర్తి (16 బంతుల్లో 10 నాటౌట్) ల సహకారంతో ఆ జట్టు.. 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇక ఆర్సీబీ బౌలింగ్ లో హసరంగ నాలుగు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ కు 3 వికెట్లు దక్కాయి. హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచులో గెలవాలంటే ఆర్సీబీకి 20 ఓవర్లలో 129 పరుగులు కావాల్సి ఉంది.