3 నెలల క్రితమై రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్... ప్రధాని కోరడంతో రిటైర్మెంట్ వెనక్కి! వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోవడంతో..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడబోయే టీమ్స్ అన్నీ జట్లను ప్రకటించేశాయి. ఇప్పటికే చాలా టీమ్స్, ఇండియాకి చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశాయి. పాకిస్తాన్ కూడా మరికొన్ని గంటల్లో భారత్‌లో అడుగుపెట్టబోతోంది. అందరి కంటే ఆలస్యంగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి టీమ్‌ని ప్రకటించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అయితే బంగ్లా కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌కి, వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్‌లో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది..
జూలై 6న అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్. అయితే బంగ్లా ప్రధాని షేక్ హాసినా, ప్రత్యేకంగా కలిసి కోరడంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. గాయంతో ఆసియా కప్ 2023 టోర్నీకి దూరమైన తమీమ్ ఇక్బాల్‌కి, వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్‌లో చోటు దక్కకపోవడం షాకింగ్ విషయమే..
తమీమ్ ఇక్బాల్ గాయంతో జట్టుకి దూరం కావడంతో ఆసియా కప్ 2023 టోర్నీలో బంగ్లా జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు షకీబ్ అల్ హసన్. తమీమ్ ఇక్బాల్‌కి వరల్డ్ కప్ టీమ్‌లో చోటు ఇస్తే, తాను టోర్నీ నుంచి తప్పుకుంటానని షకీబ్ అల్ హసన్, బంగ్లా బోర్డును బెదిరించినట్టు వార్తలు వస్తున్నాయి..
వెన్ను గాయంతో బాధపడుతున్న తమీమ్ ఇక్బాల్ కంటే వరల్డ్ నెం.1 వన్డే ఆల్‌రౌండర్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ ఉండడమే టీమ్‌కి అత్యవసరంగా భావించిన టీమ్ మేనేజ్‌మెంట్.. మాజీ కెప్టెన్‌కి హ్యాండ్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..
ఈ విషయంపై బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్‌రఫే మోర్తాజా స్పందించాడు. ‘చాలామంది తమీమ్ ఇక్బాల్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేయలేదని అనుకుంటున్నారు. అది నిజం కాదు. అతనే వరల్డ్ కప్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడు. జట్టు నుంచి తొలగించడానికి, ఆడకూడదని నిర్ణయం తీసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది.
తమీమ్ ఇక్బాల్‌కి కనీస గౌరవం ఇవ్వండి. అతను ఎందుకు వరల్డ్ కప్ ఆడాలని అనుకోవడం లేదో నాకైతే తెలీదు. ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. తమీమ్ స్వయంగా సమాధానం చెప్పాల్సిందే. ఏదో ఒక రోజు ఆ విషయం అతనే చెబుతాడు..’ అంటూ కామెంట్ చేశాడు ముష్‌రఫే మోర్తాజా..
‘తమీమ్ ఇక్బాల్ చాలా కాలంగా గాయంతో సతమతమవుతున్నాడు. అతను న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ ఒకే మ్యాచ్ ఆడి, ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. కేవలం గాయాన్ని దృష్టిలో పెట్టుకునే, అతన్ని వరల్డ్ కప్‌కి ఎంపిక చేయలేదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు అతన్ని సంప్రదించాం. ’ అంటూ కామెంట్ చేశాడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్ర్ మిన్షాజుల్ అబేదిన్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముస్ఫికర్ రహీం, లిటన్ దాస్, నజ్ముల్ హసన్ షాంటో, మెహిదీ హసన్ మిరాజ్, తోహిద్ హృదయ్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మొహముద్, నసుమ్ అహ్మద్, మెహెడీ హసన్, తంజీమ్ హసన్ షకీం, తంజీమ్ హసన్ తమీమ్, మహ్మదుల్లా రియాద్