
పాకిస్తాన్ కు గతంలో హెడ్ కోచ్ గా పనిచేసిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మికీ ఆర్థర్ తో తనకు వ్యక్తిగత విబేధాలున్నాయని, ఈ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తనకు అండగా నిలవలేదని ఉమర్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలకు ఆర్థర్ కూడా అంతే ఘాటుగా స్పందించాడు. ‘అద్దంలో నీ ముఖం చూసుకో ఉమర్..’ అని కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళ్తే..
రెండ్రోజుల క్రితం పాకిస్తాన్ కు చెందిన ఓ టీవీ ఇంటర్వ్యూలో అక్మల్ మాట్లాడుతూ.. ‘మికీ ఆర్థర్ తో నాకు వ్యక్తిగత విబేధాలున్నాయి. ఆ సమయంలో టీమ్ మేనేజ్మెంట్ నాకు అండగా నిలవలేదు. ఈ విషయం గురించి నేను పీసీబీ లోని అధికారులకు చాలాసార్లు విన్నవించాను..కానీ వాళ్లు ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తర్వాత ఆర్థర్ నాతో ‘నేను నీతో కఠినంగా ప్రవర్తించాను. నీ పట్ల అభ్యంతరకర పదాలు వాడాను’ అని నాతో చెప్పాడు..’ అని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ జట్టుకు అతడొక అన్ ఫ్రొఫెషనల్ హెడ్ కోచ్ అని అక్మల్ అన్నాడు.
ఇది ఆ నోటా ఈనోటా ఆర్థర్ వద్దకు వెళ్లింది. దీంతో ఆర్థర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘నీ ముఖం అద్దంలో చూసుకో ఉమర్..’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాక్ కు 2016 లో హెడ్ కోచ్ గా నియమితుడైన ఆర్థర్.. 2017 లో ఆ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ను ఓడించిన పాక్.. ట్రోఫీ గెలుచుకుంది. ఆర్థర్.. గతంలో పాక్ తో పాటు సౌతాఫ్రికా, ఆసీస్, శ్రీలంక లకు కూడా హెడ్ కోచ్ గా పనిచేశాడు.
ఇక ఆర్థర్ నే గాక పాక్ మాజీ బౌలర్ వకార్ యూనిస్ పై కూడా ఉమర్ అక్మల్ స్పందించాడు. ‘వకార్ యూనిస్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్. కానీ నేను అతడిని హెడ్ కోచ్ గా అర్థం చేసుకోలేకపోయా..’ అని అన్నాడు. అయితే వకార్.. ఉమర్ వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు. కాగా పాకిస్తాన్ కు 2009 నుంచి 2019 వరకు ఆడిన ఉమర్ అక్మల్.. జాతీయ జట్టు తరఫున 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి సుమారు 6వేల పరుగులు చేశాడు. కానీ 2019 లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్న అతడిపై పీసీబీ మూడేండ్ల నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత శిక్షను తగ్గించింది. కానీ ఆ తర్వాత అతడు మళ్లీ పాక్ జట్టు తరఫున ఆడలేదు.