T20 worldcup 2021: కీ మ్యాచ్‌లో టీమిండియా పరమ చెత్తాట... న్యూజిలాండ్ ముందు ఈజీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Oct 31, 2021, 9:08 PM IST
Highlights

T20 Worldcup 2021 India vs New Zealand: ఘోరంగా విఫలమైన భారత బ్యాటింగ్ లైనప్... 11 ఓవర్లపాటు బౌండరీ కొట్టలేకపోయిన టీమిండియా... న్యూజిలాండ్ టార్గెట్ 111...

టీ20 వరల్డ్‌కప్ 2021 ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ముకుమ్మడిగా ఫెయిల్ అయ్యాడు. ఒత్తిడిని ఎదుర్కోలేక ఎన్నో మ్యాచుల్లో ఓడిన టీమిండియా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ అదే పంథాను కొనసాగించింది... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 110 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదటి ఓవర్ నుంచి కష్టాలు ఎదుర్కొంది. మొదటి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే రాగా మూడో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించింది భారత జట్టు. పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేని ఇషాన్ కిషన్‌ని ఓపెనర్‌గా పంపించాలనుకునే నిర్ణయం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 

Latest Videos

Must Read: కీలక మ్యాచ్‌లో ఇలాంటి చెత్త ప్రయోగాలా... ధోనీ, టీమిండియాను ఏం చేయాలనుకుంటున్నావ్..

ఇషాన్ కిషన్ 8 బంతుల్లో ఓ ఫోర్ ‌తో 4 పరుగులు చేసి, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ ఆరంభమ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే అవుటైన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. ఇంతకుముందు 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరగా, గత మ్యాచ్‌లో టీ20 వరల్డ్‌కప్ ఆరంగ్రేటం చేసిన కెఎల్ రాహుల్ 3 పరుగులకే అవుటైన విషయం తెలిసిందే.

ఇషాన్ కిషన్ అవుటైన తర్వాతి బంతికే భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ... అవుటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రోహిత్ శర్మ చేతుల్లోకి ఇచ్చిన క్యాచ్‌ను ఆడమ్ మిల్నే నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ డ్రాప్‌తో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు... 16 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. భారత జట్టు కోల్పోయిన మూడు వికెట్లలో ఏదీ అద్భుతమైన బౌలింగ్ కారణంగా పడింది కాదు. అందరూ భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించి, ఫీల్డర్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరినవాళ్లే.

Must Read: టీ20 వరల్డ్‌కప్‌లో ఆఖరిగా వికెట్ తీసిన భారత బౌలర్‌ ఎవరో తెలుసా... విరాట్ కోహ్లీ తర్వాత...

ఆదుకుంటాడని అనుకున్న విరాట్ కోహ్లీ 17 బంతులాడి 9 పరుగులు చేసి ఇష్ సోదీ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీని మూడోసారి అవుట్ చేశాడు ఇష్ సోదీ.. 19 బంతుల్లో 12 పరుగులు చేసిన రిషబ్ పంత్, ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 7వ ఓవర్ తర్వాత 17వ ఓవర్ ఆఖరి బంతి వరకూ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు భారత బ్యాట్స్‌మెన్...

టీ20ల్లో టీమిండియాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తన రికార్డును మరింత మెరుగు పర్చుకున్నాడు ఇష్ సోదీ. 24 బంతుల్లో ఓ ఫోర్‌తో 23 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 

అదే ఓవర్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన శార్దూల్ ఠాకూర్ డకౌట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్‌కి ఇది 50వ టీ20 వికెట్. చివర్లో జడేజా 19 బంతుల్లో 26 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది ఇండియా...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియాకి ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 2016 టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులకే ఆలౌట్ అయ్యింది భారత జట్టు. రవీంద్ర జడేజా 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేయగా భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కలిసి 36 బంతులు ఎదుర్కొన్న ఒక్క బౌండరీ చేయలేకపోయారు. 

click me!