T20 Worldcup 2021: సూపర్ 12లో పాకిస్తాన్ క్లీన్ స్వీప్... స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ...

By Chinthakindhi RamuFirst Published Nov 7, 2021, 11:03 PM IST
Highlights

T20 Worldcup 2021: స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో విజయం అందుకున్న పాకిస్తాన్... సూపర్ 12 రౌండ్‌లో ఐదు విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా...

టీ20 వరల్డ్‌కప్ 2021  టోర్నీలో పాకిస్తాన్ జట్టు వరుసగా ఐదు విజయాలు అందుకుంది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో విజయం అందుకున్న పాకిస్తాన్, సూపర్ 12 రౌండ్‌లో ఐదు విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. గ్రూప్ 1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్టు నాలుగేసి విజయాలు మాత్రమే అందుకోగలిగాయి.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు మెరుగైన రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా సౌతాఫ్రికా జట్టు నాలుగు విజయాలు అందుకున్నప్పటికీ నెట్ రన్ రేటు తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ 2లో మాత్రం నెట్ రన్ రేట్ అవసరం రాలేదు... పాకిస్తాన్ వరుసగా ఐదు విజయాలతో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరగా, ఆఫ్ఘాన్‌ను ఓడించి నాలుగో విజయం అందుకున్న న్యూజిలాండ్ కూడా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది.

నవంబర్ 10న జరిగే మొదటి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్, 11న జరిగే సెమీ ఫైనల్ 2లో పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా జట్టు తలబడబోతున్నాయి. 190 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన స్కాట్లాండ్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగుతున్నట్టు కనిపించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 117 పరుగులకి పరిమితమైంది. జార్జ్ మున్సే 31 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు, కెప్టెన్ కేల్ 16 బంతుల్లో 9 పరుగులు, మాథ్యూ క్రాస్ 5 పరుగులు, మైకెల్ లీస్క్ 14 పరుగులు చేసి అవుట్ కాగా, బడ్జ్ డకౌట్ అయ్యాడు.

Read: వెస్టిండీస్‌కి ఊహించని ఎదురుదెబ్బ... టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీ సూపర్ 12లో దక్కని చోటు...

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన రిచీ బెర్రింగ్టన్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన బెర్రింగ్టన్ నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 19 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఏడాది టీ20ల్లో 1667 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, ఒక ఏడాదిలో అత్యధిక టీ20 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

2015లో 1665 పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు మహ్మద్ రిజ్వాన్... పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి, సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. క్రిస్ గ్రీవ్స్ బౌలింగ్‌లో మున్సేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బాబర్ ఆజమ్. ఫకార్ జమాన్ 13 బంతుల్లో 8 పరుగులు చేసి క్రిస్ గ్రీవ్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. 

మహ్మద్ హఫీజ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసి సఫ్యాన్ షరీఫ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ సిక్సర్ మోత మోగించాడు. 18 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 54 పరుగులు చేసిన షోయబ్ మాలిక్, యువరాజ్ సింగ్ 12 బంతుల్లో, మోబర్గ్ 17 బంతుల్లో తర్వాత అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ అందుకున్న మూడో బ్యాట్స్‌మెన్‌గా కెఎల్ రాహుల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లతో కలిసి సమంగా నిలిచాడు షోయబ్ మాలిక్...

Read Also: ఇంకేముందిలే, ఇక బ్యాగులు సర్దుకోవడమే... ఐదు నెలల తర్వాత స్వదేశానికి రానున్న టీమిండియా...

39 ఏళ్ల 279 రోజుల వయసులో హాఫ్ సెంచరీ బాదిన షోయబ్ మాలిక్, 2009 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో సనత్ జయసూర్య (39 ఏళ్ల 345 రోజుల వయసులో) తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో అర్ధశతకం నమోదుచేసిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు.  

click me!