పాక్‌పై విజయం : కన్నీటి పర్యంతమైన విరాట్ కోహ్లీ, భుజానికెత్తుకున్న రోహిత్

By Siva KodatiFirst Published Oct 23, 2022, 7:19 PM IST
Highlights

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు క్రీజ్‌లో నిలబడిన రోహిత్ భారత్‌ను గెలిపించాడు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. 

చాలా రోజులుగా సరైన ఫామ్‌లో లేక ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటోన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. డూ ఆర్ డై అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజ్‌లో నిలబడి భారత్‌ను గెలిపించాడు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ.. తనను జట్టుకు దూరం చేయడం ఎందుకు తెలివైన పని కాదో మరోసారి తన ప్రదర్శన ద్వారా తెలియజేశాడు. 

ఈ ఆటతీరుతో మెల్‌బోర్న్ స్టేడియంలో ప్రత్యక్షంగా వున్న 90 వేల మంది క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న అభిమానులను అలరించాడు. ఇన్నింగ్స్ ముగిసి భారత్ విక్టరీ సాధించగానే గ్రౌండ్‌లో నిలబడిన కోహ్లీకి క్రికెటర్లు, అభిమానులు చప్పట్లతో అభినందించారు. వారి మద్ధతుతో ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. కోహ్లీ.. కోహ్ల అనే నినాదాలు ఎంసీజీలో మారుమోగాయి. 

Also Read:థ్రిల్లర్‌కే అమ్మ మొగుడు లాంటి మ్యాచ్... ఉత్కంఠపోరులో టీమిండియా ఘన విజయం...

అంతేకాదు.. ఈ అద్బుత క్షణంలో కోహ్లీని కెప్టెన్ రోహిత్ శర్మ తన భుజాలపైకి ఎత్తుకుని తిప్పేశాడు. అంతేకాదు.. ఇద్దరు కలిసి గ్రౌండ్‌లో పరుగులు తీస్తూ సంబరాలు జరుపుకున్నారు. జట్టు సభ్యులు అశ్విన్, హార్డిక్ పాండ్యా సహా ఇతర సహచరులు కోహ్లీని ఆలింగనం చేసుకుని అభినందించారు. ఈ సంఘటనలతో ఆయన మ్యాన్ ఆఫ్ ది మూమెంట్‌గా నిలిచాడు. భారత్ - పాక్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో మరుపురాని మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. 

మరోవైపు.. దాయాదుల మధ్య సమరం క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ  ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో గత వరల్డ్ కప్‌లో ఎదురైన ప్రతీకారానికి బదులు తీర్చుకుంది.
 

click me!