T20 World Cup 2022: పసికూన అనుకుంటే జింబాబ్వే పాకిస్తాన్ కు చెమటలు పట్టించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు జింబాబ్వే చివరి బంతి వరకూ పోరాడి గెలిచింది. అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.
‘శెభాష్ జింబాబ్వే.. మీ ఆటకు, పోరాటానికి సలాం..’ టీ20 ప్రపంచకప్ లో భాగంగా పెర్త్ వేదికగా జింబాబ్వే - పాకిస్తాన్ మధ్య ముగిసిన మ్యాచ్ లో ఈ పసికూన ఆట చూశాక ప్రతీ క్రికెట్ అభిమాని అలా అనకుండా ఉండలేడేమో.. ఆ జట్టు అలాంటి పోరాటం చేసింది మరి.. తొలుత బ్యాటింగ్ లో విఫలమైనా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డింది. చివరి బంతి వరకూ పట్టుదల కోల్పోకుండా ఆడి పాకిస్తాన్ కు చెమటలు పట్టించింది. టీ20 ప్రపంచకప్ లో ఫేవరేట్ జట్లలో ఒకటి గా ఉన్న పాకిస్తాన్ కు కోలుకోలేని షాకిచ్చి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. జింబాబ్వే నిర్దేశించిన 131 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్.. 129 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో గెలిచింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడింది. భారత్ తో మ్యాచ్ లో డకౌట్ అయిన పాక్ సారథి బాబర్ ఆజమ్.. ఈ మ్యాచ్ లో 9 బంతులాడి 4 పరుగులే చేసి బ్రాడ్ ఎవిన్స్ బౌలింగ్ లో ర్యాన్ బుర్ల్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత రిజ్వాన్ (14) కూడా ముజరబని బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇఫ్తికార్ అహ్మద్ (5) కూడా విఫలమయ్యాడు.
కానీ షాదాబ్ ఖాన్ (17) తో జతకలిసిన షాన్ మసూద్ (38 బంతుల్లో 44, 3 ఫోర్లు) పాకిస్తాన్ ను ఆదుకున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 36 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే గాక పాకిస్తాన్ ను విజయం వైపు నడిపించారు.
కానీ సికందర్ రాజా పాకిస్తాన్‌కు 14వ ఓవర్లో డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి షాదాబ్ ఖాన్ ను ఔట్ చేయగా తర్వాత బంతికే హైదర్ అలీ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తన తర్వాత ఓవర్లో కూడా రాజా.. షాన్ మసూద్ ను పెవిలియన్ కు పంపి జింబాబ్వేను పోటీలోకి తెచ్చాడు. ఆ ఓవర్లో రెండో బంతికి మసూద్ ను చకబ్వ స్టంపౌట్ చేశాడు.
ఆఖరి ఓవర్లో హైడ్రామా..
ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మహ్మద్ నవాజ్ (18 బంతుల్లో 22, 1 ఫోర్, 1 సిక్సర్), మహ్మద్ వసీం జూనియర్ (13 బంతుల్లో 12 నాటౌట్, 2 ఫోర్లు) లు పోరాడారు. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమవగా.. ఎంగర్వ వేసిన 19వ ఓవర్లో 11 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. బ్రాడ్ ఎవిన్ వేసిన తొలి బంతికి నవాజ్ మూడు పరుగులు తీశాడు. తర్వాత బంతికి వసీమ్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి ఒక పరుగు మాత్రమే వచ్చింది. నాలుగో బంతికి పరుగు రాలేదు. రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ఐదో బంతికి మహ్మద్ నవాజ్ ఔట్ అయ్యాడు. చివరి బంతికి షాహీన్ అఫ్రిది.. బంతిని ఔట్ సైడ్ ఆఫ్ దిశగా బాది పరుగు తీశాడు. రెండో పరుగు తీసే క్రమంలో అఫ్రిది రనౌట్ అయ్యాడు. అంతే.. జింబాబ్వే చారిత్రాత్మక విజయం..
WHAT.A.MATCH 🔥
Zimbabwe’s stunning one-run victory has helped them climb up the Group 2 Standings!
Check out ➡️ https://t.co/cjmWWRzDYc pic.twitter.com/q1UBNwvwPH
జింబాబ్వే బ్యాటింగ్ విఫలం..
అంతకుముందు టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మధెవేరె (13 బంతుల్లో 17, 3 ఫోర్లు), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (19 బంతుల్లో 19, 2 ఫోర్లు) ధాటిగా ఇన్నింగ్స్ ను ఆరంభించారు. ఈ ఇద్దరూ కలిసి 5 ఓవర్లలో 42 పరుగులు జోడించారు.
హరీస్ రౌఫ్.. ఎర్విన్ ను ఔట్ చేసి పాకిస్తాన్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మిల్టన్ శుబ్మా (8) విఫలమైనా సీన్ విలియమ్స్ (28 బంతుల్లో 31, 3 ఫోర్లు) నిలబడ్డాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో ధాటిగా ఆడిన జింబాబ్వే మధ్య ఓవర్లలో మాత్రం విఫలమైంది. స్పిన్నర్ షాదాబ్ ఖాన్ సీన్ విలియమ్స్, వికెట్ కీపర్ చకబ్వా (0) ను ఔట్ చేశాడు. మహ్మద్ వాసీమ్ కూడా వరుస బంతుల్లో సికిందర్ రాజా (9), ర్యాన్ బురీ (0) లను పెవిలిన్ కు పంపాడు. చివర్లో బ్రాడ్ ఎవాన్స్ (19) జింబాబ్వే కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్ 4 వికెట్లు తీయగా షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.
Look away if your team is Pakistan pic.twitter.com/C8Y2gzlC5N
— Saj Sadiq (@SajSadiqCricket)