ప్రపంచకప్ నుంచి అఫ్గాన్ ఔట్.. లంకకు రెండో విజయం.. అయినా సెమీస్ కష్టమే..!

Published : Nov 01, 2022, 01:08 PM IST
ప్రపంచకప్ నుంచి అఫ్గాన్ ఔట్.. లంకకు  రెండో విజయం.. అయినా సెమీస్ కష్టమే..!

సారాంశం

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా అఫ్గానిస్తాన్ - శ్రీలంక మధ్య ముగిసిన  మ్యాచ్ లో ఆసియా ఛాంపియన్లనే విజయం వరించింది.  ముందు బౌలింగ్ తో అఫ్గాన్లను కట్టడిచేసిన లంకేయులు.. ఆ తర్వాత  బ్యాటింగ్ లోనూ   చెలరేగారు. 

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న  టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక మరో విజయంతో సెమీస్ రేసులో నిలిచింది. బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ముగిసిన అఫ్గానిస్తాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ ను లంకేయులు ఆరు వికెట్ల తేడాతో గెలుచుకున్నారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల  నష్టానికి 144 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని  శ్రీలంక  18.3 ఓవర్లలోనే ఛేదించింది. లంక జట్టులో ధనంజయ డిసిల్వ (42 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఈ విజయంతో శ్రీలంక సెమీస్ ఆశలు ఇంకా  సజీవంగానే ఉండగా  అఫ్గాన్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది.  నేడు జరుగబోయే ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ లో ఫలితంతో గ్రూప్-1 నుంచి సెమీస్ బెర్త్ లలో ఓ స్పష్టత రానున్నది. 

ఇక లంకతో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్.. తొలుత బాగానే ఆడింది. ఓపెనర్లు గుర్బాజ్ (28), ఉస్మాన్ ఘనీ (27) లు తొలి వికెట్ కు 41 పరుగులు జోడించారు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని లాహిరు కుమార విడదీశాడు. అతడు వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి.. గుర్బాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  

గుర్బాజ్ నిష్క్రమించినా ఇబ్రహీం జద్రాన్ (18 బంతుల్లో 22,  1 ఫోర్, 1 సిక్స్) తో కలిసి ఘనీ ఇన్నింగ్స్ ను నడిపించాడు. కానీ హసరంగ వేసిన పదో ఓవర్ రెండో బంతికి అతడు కూడా పెవిలియన్ చేరాడు.  ఆ తర్వాత అఫ్గాన్ ఇన్నింగ్స్ లో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. నజీబుల్లా (18), గుల్బాదిన్ (12), కెప్టెన్ నబీ (13), రషీద్  ఖాన్ (13) విఫలమయ్యారు.  ఫలితంగా అఫ్గాన్. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.   

145 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంకకు ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు.  ఓపెనర్ పతుమ్ నిస్సంక (10) నిరాశపరిచాడు. కుశాల్ మెండిస్ (25) కూడా నిలువలేకపోయాడు. కానీ ధనంజయ డిసిల్వ.. చరిత్ అసలంక (19), భానుక రాజపక్స (18) లతో కలిసి  లంకకు విజయాన్ని అందించాడు.  18.2 ఓవర్లలో లంక లక్ష్యాన్ని ఛేదించింది. 

 

ఈ టోర్నీలో లంకకు ఇది రెండో విజయం. నాలుగు మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో  పాయింట్ల పట్టికలో (నాలుగు పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్.. మూడు మ్యాచ్ లలో ఒక విజయం ఒక ఓటమి (మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) తో మూడు పాయింట్లు మాత్రమే సాధించి  నాలుగో స్థానంలో నిలిచింది. శ్రీలంక సెమీస్ అవకాశాలు నేడు జరుగబోయే ఇంగ్లాండ్ -న్యూజిలాండ్ విజేతను బట్టి ఆధారపడతాయి. తర్వాత మ్యాచ్ లో  శ్రీలంక.. నవంబర్ 5న ఇంగ్లాండ్ తో తలపడుతుంది. 

ఇక  నాలుగు మ్యాచ్ లు ఆడి మూడింట్లో ఓడి (ఒక మ్యాచ్ లో వర్షం కారణంగా ఫలితం తేలలేదు)న అఫ్గాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !