పోరాడి ఓడిన శ్రీలంక.. ఆసీస్ ఆశలు ఆవిరి! టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌కి ఇంగ్లాండ్, న్యూజిలాండ్...

By Chinthakindhi Ramu  |  First Published Nov 5, 2022, 4:54 PM IST

శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్... ఆఖరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్... నెట్ రన్ రేట్ కారణంగా సెమీ ఫైనల్‌కి దూరమైన ఆస్ట్రేలియా! గ్రూప్ 1 నుంచి సెమీస్‌కి ఇంగ్లాండ్, న్యూజిలాండ్...


టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ 1 సూపర్ 12 మ్యాచులు ముగిశాయి. ఆఖరి మ్యాచ్ వరకూ సెమీస్ బెర్త్‌లపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. శ్రీలంకతో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు 7 పాయింట్లతో సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది... ఆతిథ్య ఆస్ట్రేలియా కూడా 7 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా మూడో స్థానానికి పరిమితమైంది...

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, దూకుడుగా ఇన్నింగ్స్‌ని ఆరంభించింది. 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన కుశాల్ మెండిస్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 11 బంతుల్లో 9 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వ, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

Latest Videos

undefined

ఆరంభంలో దూకుడుగా ఆడిన పథుమ్ నిశ్శంక, తాను ఎదుర్కొన్న మొదటి 15 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాతి 30 బంతుల్లో 36 పరుగులే రాబట్టగలిగాడు నిశ్శంక.  45 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేసిన నిశ్శంక, అదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

అసలంక 8, శనక 3 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. 22 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన రాజపక్ష, మార్క్ వుడ్ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. 9 పరుగులు చేసిన హసరంగ రనౌట్ కాగా కరుణరత్నే, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి డకౌట్ అయ్యాడు..

ఒకానొక దశలో 10 ఓవర్లలో 80 పరుగులు చేసి భారీ స్కోరు చేసేలా కనిపించిన శ్రీలంక, చివరి 10 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే రాబట్టి 6 వికెట్లు కోల్పోయింది. 


142 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌కి అదిరిపోయే ఆరంభం దక్కింది. అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ కలిసి పవర్ ప్లేలో 70 పరుగులు రాబట్టారు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు. 

కసున్ రజిత్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో 6,4,4,4 బాది 20 పరుగులు రాబట్టాడు అలెక్స్ హేల్స్. 23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన జోస్ బట్లర్, హసరంగ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 75 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

30 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన అలెక్స్ హేల్స్, హసరంగ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 పరుగులు చేసిన హారీ బ్రూక్, ధనంజయ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ అవుట్ కాగా లివింగ్‌స్టోన్, లహిరు కుమార బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మొయిన్ ఆలీ 1 పరుగు చేసి ధనంజయ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

సామ్ కుర్రాన్ కూడా లహీరు కుమార బౌలింగ్‌లో అవుట్ కావడంతో ఒకానొక దశలో 75/0 ఉన్న ఇంగ్లాండ్ జట్టు, 129 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో ఉత్కంఠ రేగినా బెన్ స్టోక్స్  36 బంతుల్లో 2  ఫోర్లతో 44 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కి విజయాన్ని అందించాడు. 
 

click me!