T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో సూపర్-12 దశ చివరి అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన న్యూజిలాండ్.. మిగతా జట్ల కంటే ముందుగానే సెమీస్ కు చేరింది.
ఆస్ట్రేలియా గడ్డ మీద జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో సూపర్-12 దశ చివరికి చేరింది. పలు జట్లు ఈ దశలో తమ చివరి మ్యాచ్ లు కూడా ఆడేశాయి. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ లు ఐదు మ్యాచ్ లు ఆడేశాయి. శనివారం ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య కీలక మ్యాచ్ తో ఈ రెండు జట్లు కూడా చివరి మ్యాచ్ ఆడేస్తాయి. సూపర్ - 12 దశ చివరి అంకానికి చేరుకున్నా గ్రూప్-1 నుంచి సెమీస్ చేరే జట్ల విషయంలో ఇంకా ఆసక్తికర పోరు జరుగుతూనే ఉంది. ఈ గ్రూప్ లో ఉన్న న్యూజిలాండ్.. టోర్నీకి ఎటువంటి అంచనాలు లేకుండానే వచ్చి ఈ టోర్నీలో వరుసగా మూడోసారి సెమీస్ కు చేరకుంది. నేడు ఐర్లాండ్ ను ఓడించి ఆ జట్టు సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.
ఇవాళే అడిలైడ్ ఓవల్ లో ముగిసిన ఆస్ట్రేలియా- అఫ్గానిస్తాన్ మ్యాచ్ లో నాలుగు పరుగుల తేడాతో కంగారూలు విజయం సాధించారు. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆసీస్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ విఫలమై చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు గెలిచి పరువు నిలుపుకుంది.
అఫ్గాన్ మీద గెలిచినా గ్రూప్-1లో ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కంగారూలు సెమీస్ చేరాలంటే శనివారం ఇంగ్లాండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్ ఫలితం మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.
లంక మీదే గంపెడాశలు..
ఆసీస్-ఇంగ్లాండ్ లలో సెమీస్ కు వెళ్లే జట్ల సమీకరణాలు ఎలా ఉన్నాయంటే... ఇంగ్లాండ్-శ్రీలంక మ్యాచ్ లో జోస్ బట్లర్ సేన లంకను ఓడిస్తే ఆ జట్టు నేరుగా కివీస్ తర్వాత సెమీస్ కు చేరిన రెండో జట్టు అవుతుంది. ఒకవేళ లంక.. ఇంగ్లాండ్ కు షాకిస్తే అప్పుడు బట్లర్ గ్యాంగ్ లండన్ విమానమెక్కుతారు. ఆసీస్ సెమీస్ చేరుతుంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. ఇంగ్లాండ్ కంటే మెరుగైన పాయింట్లు ఉంటాయి గనక ఆసీస్ సెమీస్ చేరే అవకాశాలే ఎక్కువ. ఇప్పుడు కంగారూల ఆశలన్నీ లంక మీదే ఉన్నాయి.
గ్రూప్-1లో పాయింట్ల పట్టికను ఓసారి పరిశీలిస్తే.. న్యూజిలాండ్ 7 పాయింట్లతో సెమీస్ చేరింది. ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్ లు ఆడి మూడు గెలిచి ఒకదాంట్లో ఓడి (ఒకటి వర్షం వల్ల రద్దు) ఏడు పాయింట్లు సాధించింది. ఆ జట్టు నెట్ రన్ రేట్ మాత్రం (-0.173) మైనస్ లలో ఉంది.
మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. నాలుగు మ్యాచ్ లలో రెండు గెలిచి ఒకటి ఓడి (ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది) ఐదు పాయింట్లు సాధించింది. ఆ జట్టు నెట్ రన్ రేట్ (+0.547) ఆసీస్ కంటే మెరుగ్గా ఉంది. లంకతో మ్యాచ్ గెలిస్తే ఇంగ్లాండ్ కు ఏడు పాయింట్లు దక్కుతాయి. అప్పుడు ఆసీస్ తో సమానంగా నిలిచినా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ఇంగ్లాండ్ సెమీస్ కు వెళ్తుంది. ఇక ఇదే గ్రూప్ లో ఉన్న శ్రీలంక, ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.
A narrow win for Australia keeps their net run rate in the negative! 👀
If England beat Sri Lanka tomorrow, the hosts would miss a semi-final spot 😯 2022 Standings 👉 https://t.co/cjmWWRz68E pic.twitter.com/qCPzYznAz9
ఆ సంప్రదాయాన్ని ఆసీస్ కొనసాగిస్తుందా..?
ఇదిలాఉండగా.. శనివారం నాటి మ్యాచ్ లో గనక ఇంగ్లాండ్ సెమీస్ చేరితే ఈ టోర్నీ ప్రారంభం నుంచి వస్తున్న సంప్రదాయం కొనసాగినట్టే అవుతుంది. ఇప్పటివరకు ఏడు ఎడిషన్లు ముగిసి ప్రస్తుతం 8వ ఎడిషన్ జరుగుతున్నా.. పొట్టి ప్రపంచకప్ కు ఆతిథ్యమిచ్చిన ఏ ఒక్క దేశం కూడా కప్ కొట్టలేదు. 2007లో మొదలైన ఈ టోర్నీని తొలిసారిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఆ తర్వాత 2009 లో ఇంగ్లాండ్, 2010 (వెస్టిండీస్), 2012 (శ్రీలంక), 2014 (బంగ్లాదేశ్), 2016 (ఇండియా), 2021 లో యూఏఈ, ఓమన్ లలో నిర్వహించారు. ఈ ఏడు ఎడిషన్లలో ఒక్కసారి కూడా ఆథిత్య దేశం కప్ కొట్టిన చరిత్ర లేదు. ప్రస్తుత ఎడిషన్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నది. మరి ఆసీస్ కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా..? లేదా..? తెలియాలంటే శనివారం ఇంగ్లాండ్-శ్రీలంక మ్యాచ్ ముగిసేదాకా వేచి చూడాలి. ఆ తర్వాత ఆసీస్ సెమీస్ చేరి అనంతరం ఫైనల్ ఆడి గెలిస్తే అప్పుడు చరిత్ర తిరగరాసినట్టు అవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అతిశయోక్తే అవుతుంది.