గెలిచి నిలిచిన ఇంగ్లాండ్.. సెమీస్ ఆశలు సజీవం.. రేసు రసవత్తరం

Published : Nov 01, 2022, 05:06 PM IST
గెలిచి నిలిచిన ఇంగ్లాండ్.. సెమీస్ ఆశలు సజీవం.. రేసు రసవత్తరం

సారాంశం

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో  నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముందు బ్యాటింగ్ లో ఇరగదీసిన ఇంగ్లీష్ జట్టు ఆ తర్వాత బౌలింగ్ లో కూడా రాణించి కివీస్ ను కట్టడి చేసి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. 

టీ20 ప్రపంచకప్ లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ అదరగొట్టింది. న్యూజిలాండ్ తో బ్రిస్బేన్ (గబ్బా) వేదికగా ముగిసిన కీలక పోరులో ?? తేడాతో విజయం సాధించింది.  ఇంగ్లాండ్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 62, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ కేన్ విలిమయ్సన్ (40) లు పోరాడినా చివర్లో ఒత్తిడి తట్టుకోలేక విఫలమయ్యారు. దీంతో కివీస్ 20 పరుగుల తేడాతో ఓడింది. ఇక ఈ విజయంతో ఇంగ్లాండ్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

భారీ లక్ష్య ఛేదనలో కివీస్ కు రెండో ఓవర్లోనే భారీ షాక్ తగిలింది.  ప్రమాదకర ఓపెనర్ డెవాన్ కాన్వే (3) ను క్రిస్ వోక్స్ ఔట్ చేశాడు. ఆ తర్వాత సామ్ కరన్.. కివీస్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఆఖరి బంతికి ఫిన్ అలెన్ (16) ను కూడా  పెవిలియన్ కు పంపాడు.  దీంతో న్యూజిలాండ్.. ఐదు ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 28  పరుగులు చేసింది. 

ఈ క్రమంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40 బంతుల్లో 40, 3 ఫోర్లు), గ్లెన్ ఫిలిప్స్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు.   రెండు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్  బౌలర్లు దూకుడు పెంచారు.  కానీ కివీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతూ  వికెట్లను కాపాడుకున్నారు. వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ వికెట్ల మధ్య పరుగు పందెం పెట్టుకున్నారా..? అన్న రీతిలో పరిగెత్తారు.   అదిల్ రషీద్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో ఐదో బంతికి  గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను కవర్ పాయింట్ లో  మోయిన్ అలీ నేలపాలుచేశాడు.  పది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్.. 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. 

లైఫ్ దొరకడంతో  ఫిలిప్స్ రెచ్చిపోయాడు. మార్క్ వుడ్ వేసిన  12వ ఓవర్లో తొలి బంతికి డబుల్ తీయడంతో ఈ ఇద్దరి భాగస్వామ్యం 50 పరుగులు దాటింది.  అదే ఓవర్లో ఫిలిప్స్.. మూడో బంతికి భారీ సిక్సర్ బాదాడు. అదిల్ రషీద్ వేసిన 14వ ఓవర్ లో రెండు సిక్సర్లు  కొట్టాడు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే హాఫ్  సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  

బ్రేక్ ఇచ్చిన స్టోక్స్.. 

ఈ ఇద్దరి జోడీ గేర్ మారుస్తున్న తరుణంలో  బట్లర్ చేసిన బౌలింగ్ ఛేంజ్ ఫలితాన్నిచ్చింది.    స్టోక్స్ వేసిన 15వ ఓవర్లో ఐదో బంతికి కేన్ విలియమ్సన్.. కట్ షాట్ ఆడబోయి   థర్డ్ మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అదిల్ రషీద్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  దీంతో 91 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  కేన్ మామ ఔటయ్యాక వచ్చిన జేమ్స్ నీషమ్ (6), డారిల్ మిచెల్ (3) కూడా  ఒత్తిడిలో షాట్లు ఆడి విఫలమయ్యారు.  ఆఖరికి ఫిలిప్స్ కూడా కరన్ వేసిన  18వ ఓవర్లో మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి లాంగాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్ జోర్డాన్ (సబ్ స్టిట్యూట్) కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత కివీస్ ఇన్నింగ్స్ లో చెప్పుకోవడాని ఏమీ లేదు. క్రిస్ వోక్స్ వేసిన 19వ ఓవర్లో 14 పరుగులు రాగా.. కరన్ వేసిన 20 వ ఓవర్లో 5 పరుగులొచ్చాయి. సాంట్నర్ (16 నాటౌట్), ఇష్ సోధీ (6 నాటౌట్) ఓటమి అంతరాన్ని తగ్గించారే గానీ కివీస్ ను పరాజయం నుంచి తప్పించలేకపోయారు. 

 

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన  ఇంగ్లాండ్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. అలెక్స్ హేల్స్ (40 బంతుల్లో 52, 7 పోర్లు, 1 సిక్సర్) తో పాటు  కెప్టెన్ జోస్ బట్లర్ (47 బంతుల్లో 73, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)  దూకుడుగా ఆడారు.  ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 81 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్లలో లివింగ్‌స్టోన్ (20) రెండంకెల స్కోరు చేశాడు. మోయిన్ అలీ (5), హ్యారీ బ్రూక్ (7), స్టోక్స్ (8 విఫలమయ్యారు. ఫలితంగా ఇంగ్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  179 పరుగులు చేసింది. 

సెమీస్ రేసు రసవత్తరం.. 

ఇంగ్లాండ్ విజయం సాధించడంతో  గ్రూప్-1లో  సెమీస్ రేసు రసవత్తరంగా మారింది.  నాలుగు మ్యాచ్ లు ఆడిన ఇంగ్లాండ్.. రెండు విజయాలు, ఒక ఓటమి (ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు)తో  రెండో స్థానానికి చేరింది.  ప్రస్తుతం ఆ జట్టు  ఖాతాలో 5 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా మూడో స్థానాని పడిపోయింది. ఆసీస్ చేతిలో కూడా 5 పాయింట్లు ఉన్నా.. నెటరన్ రేట్ మైనస్ లలో ఉంది. లంక చేతిలో నాలుగు పాయింట్లు మాత్రమే  ఉన్నాయి. తర్వాత మ్యాచ్ గెలిచినా ఆ జట్టు సెమీస్ చేరడం కష్టమే.  

 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?