T20 World cup 2022:  బంగ్లాకి వణుకు పుట్టించిన నెదర్లాండ్స్... ఆఖరి ఓవర్‌ వరకూ పోరాడి ఓడిన పసికూన..

By Chinthakindhi Ramu  |  First Published Oct 24, 2022, 1:15 PM IST

Bangladesh vs Netherlands: నెదర్లాండ్స్ జట్టుపై 9 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న బంగ్లాదేశ్... టాపార్డర్ ఫెయిల్ అయినా ఆఖరి ఓవర్ వరకూ పోరాడిన నెదర్లాండ్స్... 


టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ సూపర్ 4 రౌండ్‌ని విజయంతో ఆరంభించింది బంగ్లాదేశ్. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో గెలిచింది బంగ్లా. 145 పరుగుల లక్ష్యఛేదనలో సున్నాకే 2 వికెట్లు, 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా పట్టువదలకుండా ఆఖరి వరకూ పోరాడిన నెదర్లాండ్స్... బంగ్లాదేశ్‌కి వెన్నులో వణుకు పుట్టించింది. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. 14 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన సౌమ్య సర్కార్, వాన్ మీకీరెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. లిటన్ దాస్ 11 బంతుల్లో 9 పరుగులు చేయగా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 9 బంతుల్లో 7 పరుగులు చేశాడు. సాంటో 20 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేశాడు....

Latest Videos

యాసిర్ ఆలీ 3 పరుగులు చేయగా అఫిఫ్ హుస్సేన్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. నురుల్ హసన్ 18 బంతుల్లో 13 పరుగులు, మెసడెన్ హస్సున్ 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేశాడు. టస్కిన్ అహ్మద్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

145 పరుగుల లక్ష్యఛేదనలో మొదటి రెండు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. టస్కీన్ అహ్మద్ బౌలింగ్‌లో విక్రమ్‌జీత్ సింగ్, బస్ దే లీడ్ గోల్డెన్ డకౌట్ అయ్యారు. సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. మాక్స్ ఓడౌడ్ 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చసి అవుట్ కాగా టామ్ కూపర్ బంతులేమీ ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యాడు...

15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. ఈ దశలో స్కాట్ ఎడ్వర్డ్స్ 24 బంతుల్లో ఓ ఫోర్‌తో 16 పరుగులు, కోలిన్ అకీర్మెన్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి కాసేపు వికెట్లు పతనాన్ని అడ్డుకోగలిగారు. అయితే ఈ ఇద్దరూ అవుటైన తర్వాత టిమ్ ప్రింగెల్ 1, లోగన్ వాన్ బిక్ 2, షారీజ్ అహ్మద్ 9 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో వరుస వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్...

అయితే ఫ్రెడ్ క్లాసెన్‌తో కలిసి పాల్ వాన్ మీకీరెన్ ఆఖరి వరకూ పోరాడాడు. నెదర్లాండ్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 24 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి రెండు బంతుల్లో రెండేసి పరుగులు వచ్చాయి. మూడో బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. దీంతో నెదర్లాండ్స్ విజయానికి ఆఖరి 3 బంతుల్లో 19 పరుగులు కావాల్సి వచ్చాయి. ప్రతీ బంతికి సిక్సర్లు కొట్టాల్సిన పరిస్థితి. అయితే నాలుగో బంతికి వైడ్ వెళ్లడం, ఆ తర్వాతి బంతికి వాన్ మీకీరెన్ సిక్సర్ బాదడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారిపోయింది...

అయితే ఐదో బంతికి 2 పరుగులు మాత్రమే రావడంతో బంగ్లా విజయం ఖాయమైపోయింది. 14 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసిన వాన్ మీకీరెన్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. 

click me!