నేనైతే అలా చేయలేను... తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న హార్ధిక్ పాండ్యా..

By Chinthakindhi Ramu  |  First Published Oct 24, 2022, 12:45 PM IST

మా కోసం ఉన్న ఊరిని, చేస్తున్న వ్యాపారాన్ని వదిలేసి వచ్చారు... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విజయం తర్వాత తండ్రిన తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న హార్ధిక్ పాండ్యా... 


టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొదటి మ్యాచ్‌లో టీమిండియా, పాకిస్తాన్‌ని ఓడించి తొలి విజయం అందుకుంది. గత ఏడాది ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్న భారత జట్టు, ఐసీసీ వరల్డ్ కప్‌ టోర్నీల్లో పాక్‌పై ఉన్న ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది... టాపార్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయినా విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా కలిసి టీమిండియాకి ఘన విజయాన్ని అందించారు...

కెఎల్ రాహుల్ 4, రోహిత్ శర్మ 4, సూర్యకుమార్ యాదవ్ 15, అక్షర్ పటేల్ 2 పరుగులు చేసి అవుట్ కావడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కి 113 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు...

Latest Videos

ఇన్నింగ్స్ ప్రారంభంలో విరాట్ కోహ్లీ సింగిల్స్ తీస్తూ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఇదే సమయంలో హార్ధిక్ పాండ్యా భారీ షాట్స్ ఆడి స్కోరు బోర్డులో కదలిక తీసుకొచ్చాడు. మహ్మద్ నవాజ్ వేసిన ఇన్నింగ్స్ 12 వ ఓవర్‌లో మొదటి బంతికే సిక్సర్ బాదిన హార్ధిక్ పాండ్యా...ఆఖరి బంతికి మరో సిక్సర్ కొట్టాడు...

37 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, 20వ ఓవర్ మొదటి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి బాబర్ ఆజమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ నాటౌట్‌గా నిలిచి టీమిండియాకి విజయాన్ని అందించాడు...

ఈ విజయం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిన హార్ధిక్ పాండ్యా, కన్నీళ్లతో తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ‘మా నాన్న నన్ను క్రికెట్ ఆడనిచ్చి ఉండకపోతే, ఈ రోజు నేను ఇక్కడ ఇలా నిలబడి ఉండేవాడిని కాదు. వాళ్లు మా కోసం ఎంత పెద్ద త్యాగం చేశారంటే, పుట్టిన ఊరినే వదిలేసి మరో సిటీకి వచ్చేశారు. నేను అలా చేయలేను...

 

నేను  నా పిల్లలను చాలా ప్రేమిస్తాను. వాళ్ల కోసం అన్నీ చేస్తాను. అంతేకానీ 6 ఏళ్ల పిల్లల కోసం పుట్టిన ఊరినీ, చేస్తున్న వ్యాపారాన్ని వదిలేసి వేరే సిటీకి వెళ్లలేను. అది చాలా పెద్ద విషయం. వాళ్లకెప్పుడూ నేను రుణపడి ఉంటాను..’ అంటూ తండ్రిని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశాడు హార్ధిక్ పాండ్యా...

విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు హార్ధిక్ పాండ్యా... ‘హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు... నా గుండెని తాకాయి. అవి చాలా చాలా స్పెషల్. నేను చూసిన బెస్ట్ క్రికెటింగ్ షాట్స్... విరాట్ కోహ్లీ కాకుండా వరల్డ్‌లో ఏ క్రికెటర్ కూడా హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో అలాంటి షాట్స్ ఆడలేరు. ఇది పూర్తిగా మాస్టర్ క్లాస్.. విరాట్ కోహ్లీ ప్రెషర్‌ని ఎంజాయ్ చేస్తాడు. ఎంత ఎక్కువ ప్రెషర్ ఉంటే, అంత బాగా ఆడతాడు. ఇలాంటి ప్లేయర్ చాలా అరుదు... ఇలాంటి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ కోసం బుల్లెట్ తీసుకొమ్మని చెప్పినా సంతోషంగా తీసుకుంటా. అంతేకానీ మరో విరాట్‌ని అవుట్ కానివ్వను..’ అంటూ చెప్పుకొచ్చాడు హార్ధిక్ పాండ్యా... 

బౌలింగ్‌లో 3 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, టీ20ల్లో వెయ్యి పరుగులు, 50+ వికెట్లు తీసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

click me!