డక్, డక్, డక్... మూడు మ్యాచుల్లోనూ గోల్డెన్ డక్! వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్ చెత్త రికార్డు...

By Chinthakindhi RamuFirst Published Mar 22, 2023, 9:03 PM IST
Highlights

SuryaKumar Yadav: వరుసగా మూడో వన్డేలోనూ గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్... బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసినా దక్కని ఫలితం.. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా...

టీ20ల్లో నెం.1 ఐసీసీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్‌లో అత్యంత చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, మూడో వన్డేలోనూ మొదటి బంతికే పెవిలియన్ చేరాడు...

తొలి వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటైన సూర్యకుమార్ యాదవ్, రెండో వన్డేలోనూ కాపీ పేస్ట్ చేశాడు. స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. గత రెండు వన్డేల్లో ఫెయిల్ అయిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి జరిపింది టీమిండియా మేనేజ్‌మెంట్...

తొలి రెండు వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. మొదటి రెండు మ్యాచుల్లో ఆసీస్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, మూడో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ అస్టన్ అగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయిన బ్యాటర్‌గా అతి చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. మూడు వన్డేల సిరీస్‌లో మూడు సార్లు డకౌట్ అయిన మొదటి భారత బ్యాటర్ కూడా సూర్యనే.. వరుసగా విఫలం అవుతున్న సూర్యకుమార్ యాదవ్ కారణంగా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి, కష్టాల్లో పడింది టీమిండియా...

61 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత షాట్ ఆడేందుకు తెగ ఇబ్బంది పడ్డాడు. హాఫ్ సెంచరీ తర్వాత 12 బంతుల్లో 4 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ, అస్టన్ అగర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. 

270 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా 185 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. టీమిండియా విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి..

భారీ లక్ష్యఛేదనలో భారత  ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సీన్ అబ్బాట్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

49 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న ఆస్ట్రేలియాకి అనుకూలంగా ఫలితం దక్కింది. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

50 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర సీన్ అబ్బాట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు.  

click me!