
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేస్తూ సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. అనంతరం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలను కమిటీ చూసుకుంటుందని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.
సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ దవే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన ఎలక్టోరల్ కాలేజీని ఫిక్స్ చేస్తారని సిద్ధార్ధ దవే అన్నారు. జస్టిస్ నాగేశ్వరరావు సూపర్‌వైజరీ కమిటీకి నేతృత్వం వహిస్తారని.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌లో వున్న సమస్యను పరిష్కరిస్తారని సుప్రీంకోర్టులో తన ఉత్తర్వుల్లో తెలిపింది. మార్చి 2న కమిటీ తన ఉనికిని కోల్పోతోందని కోర్టు స్పష్టం చేసింది.
ఖర్చులను అసోసియేషన్ భరిస్తుందని.. న్యాయమూర్తికి కోర్టు నుంచి ఏవైనా ఆదేశాలు అవసరమైన పక్షంలో .. తమ ముందు వుంచవచ్చని సుప్రీంకోర్ట్ తెలిపింది. హెచ్‌సీఏలో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోర్ట్ పేర్కొంది. అలాగే ఈ కేసులోని అభ్యర్ధనల రికార్డింగ్‌లను జస్టిస్ లావు నాగేశ్వరరావు ముందు వుంచాలని, అవసరమైన మేరకు ఆయన సహాయం తీసుకోవాలని సూచించారు. ప్రతి స్పోర్ట్స్ అసోసియేషన్‌ను తాము మానిటర్ చేయలేమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అన్నారు.
ALso Read: HCA: ‘డబ్బులు కొట్టు.. బ్యాట్ పట్టు.. హెచ్‌సీఏను భ్రష్టు పట్టిస్తున్న అజారుద్దీన్..’
ఇదిలావుండగా.. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు. మెజారిటీ సభ్యులు కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దీనిని అజార్ తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌సీఏని పర్యవేక్షించడానికి సుప్రీంకోర్ట్ నియమించిన సూపర్ వైజరీ కమిటీ గత నెలలో ఒక నివేదికను సర్వోన్నత న్యాయస్థానం ముందు వుంచింది. ఈ సందర్భంగా హెచ్‌సీఏ సభ్యత్వాలపై విస్మయకర వాస్తవాలను ఈ నివేదిక వెల్లడించింది.
సభ్యత్వాలకు సంబంధించిన రికార్డ్ లేదని, 2019లో హెచ్‌సీఏ ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి ఎలా రూపొందించారనే దానిపై ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేవని నివేదిక పేర్కొంది. కొంతమంది సభ్యులు 7 నుంచి 8 క్లబ్‌లను కలిగి వున్నారు. ఈ సభ్యులు తమ ఓటు హక్కు ద్వారా , రాష్ట్ర జట్ల ఎంపిక విధానాన్ని మార్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని నివేదికలో ప్రస్తావించారు. రాష్ట్ర జట్టు ఎంపిక విధానం, జట్ల కొనుగోలు అమ్మకానికి సంబంధించి సబ్ లాస్‌లో పొందుపరిచిన , జస్టిస్ లోధా కమిటీ సంస్కరణల ద్వారా వచ్చిన అన్ని సంస్థాగత ప్రక్రియలను వారు బ్లాక్ మెయిల్ చేస్తారని నివేదిక హెచ్చరించింది.
తమ ఆధీనంలో ఉన్న బృందాలను లక్షల రూపాయలకు దళారులకు లీజుకు ఇవ్వడంలోనూ మునిగి తేలుతున్నారు. ఈ బ్రోకర్లు హెచ్‌సీఏ ఆతిథ్యం ఇచ్చే లీగ్ మ్యాచ్‌లు ఆడాలని కలలు కనే వర్ధమాన క్రికెటర్ల కుటుంబాలను దోచుకుంటున్నారని.. రాష్ట్ర జట్లకు ఎంపిక చేసేందుకు ఈ మ్యాచ్‌లు ఆధారమని నివేదిక పేర్కొంది. తెలంగాణలో క్రికెట్‌కు ఏకైక ప్రతినిధిగా బీసీసీఐ గుర్తించిన హెచ్‌సీఏలో అసమతుల్య ప్రజాస్వామ్యం వుందని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. సభ్యుల క్లబ్‌ల పేర్లు తరచూ మారుతుండటంతో క్లబ్‌లు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నివేదిక ఆరోపించింది.
హెచ్‌సీఏ సభ్యత్వాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని జిల్లాలకు సమాన సభ్యత్వ హక్కులు కల్పించాలనే ఉద్దేశం లేకపోవడంతో పాటు 35 ఏళ్ల క్రితం వున్న వందలాది క్లబ్‌లు కనుమరుగయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఈ క్లబ్‌లు ఎలా అదృశ్యమయ్యాయని.. వాటిని ఎవరు స్వాధీనం చేసుకున్నారో ఎలాంటి రికార్డులు లేవని నివేదిక పేర్కొంది. సభ్యత్వ నమోదులో మోసాలు 90ల నుంచి వున్నాయని, ఇవి కాలక్రమేణా పెరిగాయని నివేదిక తెలిపింది. తెలియని కారణాల వల్ల నివేదికపై సంతకం చేయడానికి కమిటీ ఛైర్మన్ సంకోచించారని పేర్కొంది.
సాధారణంగా సభ్యత్వంలో జరిగిన మోసాలను అంబుడ్స్‌మన్ పరిశీలించాలి. కొంతమంది లబ్ధిదారులు తమ మెజారిటీని ఉపయోగించి తమకు నచ్చిన అంబుడ్స్‌మన్‌ను నియమించారు. ఆపై మోసపూరిత సభ్యత్వాలు, క్లబ్‌లు మొదలైనవాటికి సంబంధించిన ఫిర్యాదులు ఎప్పుడూ వెలుగులోకి రాకుండా చూసుకున్నారని నివేదిక పేర్కొంది.