సెలక్టర్లకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి : గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

Published : Mar 06, 2023, 05:41 PM IST
సెలక్టర్లకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి : గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఇండియా-ఆస్ట్రేలియా  మధ్య జరుగుతున్న  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో  పిచ్ లతో పాటు ఆటగాళ్ల ప్రదర్శన గురించి కూడా విపరీతమైన చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం  సునీల్ గవాస్కర్  షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు  ఇండోర్ లో గెలిచినా పిచ్ ల మీద నిందలు వేయడం మానలేదు.  నాగ్‌పూర్, ఢిల్లీలతో పాటు ఇండోర్ పిచ్  గురించి కూడా నానా యాగి చేస్తన్నారు. తమ ఓటములకు పిచ్ లను బాధ్యులుగా చేస్తున్న ఆస్ట్రేలియా మాజీలపై   టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్  సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ఆసీస్ క్రికెట్ బోర్డు సెలక్టర్లకు ఏమాత్రం బాధ్యత ఉన్నా వాళ్లు వెంటనే తమ  పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు.  

నాలుగో టెస్టు ప్రారంభానికి ముందే అహ్మదాబాద్ పిచ్ పై అవాకులు చెవాకులు పేలుతున్న ఆసీస్ మాజీ క్రికెటర్లను ఉద్దేశిస్తూ గవాస్కర్... ‘పలువురు ఆసీస్ మాజీలు ఇక్కడి పిచ్ లు, ఆటగాళ్ల గురించి  మీడియాలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ నిజానికి వాళ్లు మాట్లాడిల్సింది  ప్లేయర్ల గురించి కాదు.. సెలక్టర్లను.. 

భారత్ తో మొదటి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటారో లేదో తెలియనప్పటికీ  మిచెల్ స్టార్క్ , జోష్ హెజిల్వుడ్, కామెరూన్ గ్రీన్ లను ఎంపిక చేశారు. సగం సిరీస్ కు వాళ్లు అందుబాటులో ఉండరని తెలిసి కూడా వాళ్లను ఎందుకు ఎంపిక చేసినట్టు..?  వాళ్లు  ఫిట్ గా లేకుంటే  13 మందితోనే టీమ్ ను ప్రకటించి ఉండొచ్చు కదా.. ఢిల్లీ టెస్టులో అప్పటికప్పుడు ఆగమేఘాల మీద  కొత్త స్పిన్నర్  మాథ్యూ కుహ్నేమన్ ను రప్పించారు. ఆస్టన్ అగర్ ఉన్నప్పటికీ  అతడిని ప్రత్యేకించి ఎందుకు తీసుకొచ్చినట్టు..?  అతడు అవసరం లేడని ముందే తెలిస్తే  ఆ ప్లేయర్ ను ఎంపిక చేయడం దేనికి..?  మళ్లీ అతడిని భర్తీ చేయడం ఎందుకు..? 

నిజంగా ఆసీస్ సెలక్టర్లకు చిత్తశుద్ధి ఉంటే వాళ్లు వెంటనే రాజీనామా చేయాలి.   ఇండోర్ టెస్టులో గెలిచారు సరే.. నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచినా  సెలక్టర్లు తొలి రెండు టెస్టులలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ  రాజీనామా చేయాలి..’అని గవాస్కర్  తెలిపాడు.  

 

ఈ సిరీస్ కు ఆస్ట్రేలియా 17 మందితో కూడిన జట్టును సుమారు  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి మూడు వారాల ముందే ప్రకటించింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారిలో హెజిల్వుడ్,  గ్రీన్ గాయం నుంచి కోలుకోలేదు.  స్టార్క్ అయితే రెండో టెస్టుకే ఇండియాకు వచ్చాడు. తర్వాత గాయం కారణంగా వార్నర్, హెజిల్వుడ్.. వ్యక్తిగత కారణాలతో కమిన్స్, స్వెప్సన్  లు ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణమయ్యారు.  

కాగా ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.  నాలుగో టెస్టు ఈనెల 9 నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ ను  ప్రత్యక్షంగా వీక్షించడానికి భారత, ఆస్ట్రేలియా ప్రధానులిద్దరూ  స్టేడియానికి రానున్నారు. ఈ మేరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?