జిడ్డుకే యమ జిడ్డూ బ్యాటింగ్... గవాస్కర్ మీద కోపంతో స్టేడియంలోకి లంచ్ బాక్సు విసిరేసిన అభిమాని...

Published : Jun 07, 2022, 05:15 PM IST
జిడ్డుకే యమ జిడ్డూ బ్యాటింగ్...  గవాస్కర్ మీద కోపంతో స్టేడియంలోకి లంచ్ బాక్సు విసిరేసిన అభిమాని...

సారాంశం

మొట్టమొదటి వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై 174 బంతులాడి 36 పరుగులు మాత్రమే చేసిన సునీల్ గవాస్కర్... వన్డే ఫార్మాట్‌లో అతి దారుణమైన రికార్డు...

టీ20లు వచ్చిన తర్వాత వన్డే క్రికెట్‌కి క్రేజ్ తగ్గిపోయింది. అయితే వన్డే ఫార్మాట్ వచ్చిన కొత్తలో దాని క్రేజే వేరు. 60 ఓవర్ల ఫార్మాట్‌తో మొదలైన వన్డేలు, ఆ తర్వాత 10 ఓవర్లు తగ్గి 50-50 ఫార్మాట్‌కి ఫిక్స్ అయ్యాయి. టీ20లతో పోలిస్తే వన్డేల్లో బ్యాటర్లకు సెటిల్ అవ్వడానికి కాస్త సమయం ఉంటుంది... టీ20ల్లో 60-65 బంతుల్లో సెంచరీ చేసినా టెస్టు ఇన్నింగ్స్ అని ట్రోల్ చేస్తారు, అయితే వన్డేల్లో మాత్రం 120 బంతుల్లో 100 పరుగులు చేసినా, పెద్దగా విమర్శలు రావు... 

అయితే వన్డేల్లో జిడ్డుకే యమ జిడ్డు ఇన్నింగ్స్‌తో మ్యాచ్ చూసే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు భారత క్రికెటర్ సునీల్ గవాస్కర్. గవాస్కర్ కెరీర్‌లోనే కాదు, టీమిండియా చరిత్రలోనే ఓ విభిన్నమైన స్థానం దక్కించుకున్న ఆ ఇన్నింగ్స్‌కి నేటికి సరిగ్గా 47 ఏళ్లు...

1975లో మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ (60 ఓవర్ల ఫార్మాట్) జరిగింది. ఈ టోర్నీలో టీమిండియాతో మొదటి మ్యాచ్ ఆడింది ఇంగ్లాండ్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, నిర్ణీత 60 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది...

డెన్నిస్ అమీస్ 147 బంతుల్లో 18 ఫోర్లతో 137 పరుగులు చేయగా కీత్ ఫ్లెంచర్ 68, మైక్ డెన్నిస్ 37, క్రిస్ ఓల్డ్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశారు.. 335 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు...

34 బంతుల్లో 8 పరుగులు చేసిన ఏక్‌నాథ్ సోల్కర్ అవుటైన తర్వాత అన్షుమాన్ గైక్వాడ్ 22,గుండప్ప విశ్వనాథ్ 59 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దిగ్గజ క్రికెటర్‌గా, టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచిన సునీల్ గవాస్కర్ మాత్రం.. 174 బంతులాడి 36 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు...

ఈ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ కొట్టింది ఒకే ఒక్క ఫోర్ మాత్రమే, స్ట్రైయిక్ రేటు 20.69... 60 ఓవర్లలో దాదాపు సగం ఓవర్లు ఆడేసిన సునీల్ గవాస్కర్, సింగిల్స్ తీయడానికి కూడా తెగ ఇబ్బందిపడడంతో స్కోరు బోర్డు ముందుకు సాగలేదు...

దీంతో 60 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. చేతిలో 7 వికెట్లు పెట్టుకుని, 202 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. ఈ మ్యాచ్ తర్వాత సునీల్ గవాస్కర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. స్టేడియంలోనే సునీల్ గవాస్కర్‌పై నిరసన వ్యక్తం చేశారు కొందరు అభిమానులు...

సునీల్ గవాస్కర్ ఆడుతున్న జిడ్డు ఇన్నింగ్స్ చూడలేక, స్టేడియానికి వచ్చిన ఓ క్రికెట్ అభిమాని, తన లంచ్ బాక్స్‌ని క్రీజుపైకి విసిరేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత చాలామంది అభిమానులు కలిసి, గవాస్కర్ వైపు దూసుకు వచ్చారు..

అయితే ఆ రోజు తాను పూర్తి ఆఫ్‌లో ఉన్నానని, దానికి తోడు అతనికి ఏదీ కలిసి రాలేదని కొన్నాళ్ల ముందు చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్... ‘మొదటి వరల్డ్‌ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నా ఇన్నింగ్స్‌ గురించి తలుచుకుంటే ఇప్పటికీ ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు...

ఎంత ప్రయత్నించినా పరుగులు చేయలేకపోయాను. ఇలా కాదు, ఇక అవుట్ అవుదామని ఎంతో ప్రయత్నించాను. వికెట్ పారేసుకోవాలని ప్రయత్నించాను, స్టంప్‌కి దూరంగా జరిగాను. కానీ ఏదీ కలిసి రాలేదు... బహుశా నా బ్యాటింగ్ చూసి నన్ను అవుట్ చేయకూడదని వాళ్లు అనుకుని ఉంటారేమో... అందుకు నా వికెట్ పడలేదు...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్..

టీమిండియా తరుపున 108 వన్డేలు ఆడిన సునీల్ గవాస్కర్ 35.1 సగటుతో, 62.3 స్ట్రైయిక్ రేటుతో 3092 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?