Ind vs Nz: క్యాచ్ పట్టి.. సారథిని మెప్పించి.. తొలి టెస్టులో ఇండియాకు తొలి బ్రేక్ ఇప్పించిన తెలుగు కుర్రాడు

By team teluguFirst Published Nov 27, 2021, 5:07 PM IST
Highlights

India Vs New Zealand: ఈ టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలు చూస్తున్న సాహా.. మెడ నొప్పి కారణంగా ఆట మూడో రోజైన శనివారం ఫీల్డ్ లోకి రాలేదు. దీంతో అతడి స్థానంలో సబ్ స్టిట్యూట్ కీపర్ కెఎస్ భరత్.. కీపింగ్ చేశాడు. కివీస్ ఓపెనింగ్ జోడీని విడదీయడంలో తెలుగు కుర్రాడి పాత్ర కూడా ఉంది. 

కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ తొలి టెస్టులో రెండో రోజు తేలిపోయిన భారత  బౌలర్లు మూడో రోజు  అదరగొట్టారు. నిన్న ఒక్క వికెట్  తీయడానికి ఇబ్బందులు పడ్డ బౌలర్లు.. కీలకమైన ఇవాళ పది వికెట్లు నేల కూల్చారు.  స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ల మాయాజాలానికి  కివీస్ తోకముడిచింది. పటేల్ కు ఐదు వికెట్లు దక్కాయి. అయితే అభేద్యమైన తొలి  వికెట్ భాగస్వామ్యాన్ని విడదీసింది మాత్రం అశ్వినే. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఓపెనంగ్ జోడీ  (విల్ యంగ్, లాథమ్) ని విడదీసి భారత్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న విల్ యంగ్ (89) ను ఔట్ చేశాడు. అయితే ఈ ఔట్ లో తెలుగు కుర్రాడు, సబ్ స్టిట్యూట్ వికెట్ కీపర్ కెఎస్ భరత్ పాత్ర కూడా ఉంది. 

ఈ టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలు చూస్తున్న సాహా.. మెడ నొప్పి కారణంగా ఆట మూడో రోజైన శనివారం ఫీల్డ్ లోకి రాలేదు. దీంతో అతడి స్థానంలో సబ్ స్టిట్యూట్ కీపర్ కెఎస్ భరత్.. కీపింగ్ చేశాడు. అప్పటికే రెండో రోజు సగానికి పైగా ఆడిన న్యూజిలాండ్ ఓపెనర్లు..  మూడో రోజు కూడా దూకుడుగా కనిపించారు. ముఖ్యంగా యంగ్ అయితే సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ ఇన్నింగ్స్ 67వ ఓవర్ల్ అశ్విన్ ఓ బంతితో యంగ్ ను బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన బంతి.. యంగ్ బ్యాట్ ను చిన్నగా ముద్దాడుతూ కీపర్ చేతుల్లో పడింది. 

 

pic.twitter.com/OONJkFs40H

— Maqbool (@im_maqbool)

తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని భరత్  అద్భుతంగా అందుకుని ఔట్ అని అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మాత్రందానిని ఔట్ ఇవ్వలేదు.  కాన్ఫిడెంట్ గా ఉన్న భరత్.. స్టాండ్ బై కెప్టెన్  రహానే దగ్గరికెళ్లి డీఆర్ఎస్ కోరదామని అడిగాడు. అప్పటికే  కివీస్ బ్యాటర్లు నాలుగైదు రివ్యూలు తీసుకుని బతికిపోయారు. సంశయిస్తున్న రహానే తో పాటు అశ్విన్ ను భరత్ ఒప్పించాడు. కీపర్ మీద నమ్మకంతో రహానే డీఆర్ఎస్ కోరాడు. రిప్లైలో బంతి.. యంగ్ బ్యాట్ ను చిన్నగా తాకుతూ వెళ్లినట్టు స్పష్టంగ కనిపించింది. అంతే.. 151 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. 

ఇక ఆ తర్వాత కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ల తర్వాత జెమీసన్ ఒక్కడే 20 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. మిగతా వాళ్లంతా 20 లోపే ఔటయ్యారు.  అక్షర్ పటేల్ మాయ చేయడంతో కివీస్ బ్యాటర్లకు ఏం చేయాలో పాలుపోక ఒక్కొక్కరుగా పెవిలియన్ కు చేరారు. దీంతో ఆ జట్టు 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి  శుభమన్ గిల్ (1) వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (4 నాటౌట్), ఛతేశ్వర్ పుజారా (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు.  ఆదివారం తొలి సెషన్ ఆట ఇరు జట్లకు కీలకం కానున్నది. 

click me!