స్టువర్ట్ బిన్నీ సెన్సేషనల్ ఫిఫ్టీ! రైనా, యూసఫ్ మెరుపులు.. భారీ స్కోరు చేసిన ఇండియా లెజెండ్స్...

By Chinthakindhi RamuFirst Published Sep 10, 2022, 9:32 PM IST
Highlights

Road Safety World series 2022: 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేసిన స్టువర్ట్ బిన్నీ... 15 బంతుల్లో 35 పరుగులు చేసిన యూసఫ్ పఠాన్... సౌతాఫ్రికా లెజెండ్స్ ముందు 218 పరుగుల భారీ టార్గెట్..

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 2లో సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా లెజెండ్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్, నామన్ ఓజాతో కలిసి ఓపెనింగ్ చేశాడు...

ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 15 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, మక్కాయ ఎన్తినీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసిన నామన్ ఓజా... వార్ దేవ్ వాత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

52 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇండియా లెజెండ్స్ టీమ్. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సురేష్ రైనా, స్టువర్ట్ బిన్నీ కలిసి మూడో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన సురేష్ రైనా, ఎడ్డీ లీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

యువరాజ్ సింగ్ 8 బంతుల్లో 6 పరుగులు చేసి తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ మాత్రం సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేసిన స్టువర్ట్ బిన్నీ, సౌతాఫ్రికా సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు...

స్టువర్ట్ బిన్నీ చేసిన 82 పరుగులే, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భారత లెజెండ్స్‌కి అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంతకుముందు గత సీజన్‌లో 35 బంతుల్లో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును దాటేశాడు స్టువర్ట్ బిన్నీ. ఓవరాల్‌గా ఈ టోర్నీలో నాలుగో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు స్టువర్ట్ బిన్నీ..

శ్రీలంక లెజెండ్స్ ప్లేయర్ ఉపుల్ తరంగ 47 బంతుల్లో 99 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా ఆస్ట్రేలియా లెజెండ్స్ ప్లేయర్ రేర్‌డన్ 53 బంతుల్లో 96 పరుగులు, సౌతాఫ్రికా లెజెండ్స్ ప్లేయర్ ఆండ్రూ పుట్టిక్ 54 బంతుల్లో 82 పరుగులు చేసి స్టువర్ట్ బిన్నీ కంటే ముందున్నారు. 

మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ 15 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 35 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఆఖరి 5 ఓవర్లలో 79 పరుగులు రాబట్టింది భారత లెజెండ్స్ టీమ్. 

click me!