ఆఖరికి స్టీవ్ స్మిత్ కూడా కొట్టేశాడు... నువ్వెప్పుడు సెంచరీ చేస్తావ్ సామీ! కోహ్లీపై మరోసారి ట్రోల్స్...

Published : Jul 08, 2022, 05:17 PM IST
ఆఖరికి స్టీవ్ స్మిత్ కూడా కొట్టేశాడు... నువ్వెప్పుడు సెంచరీ చేస్తావ్ సామీ! కోహ్లీపై మరోసారి ట్రోల్స్...

సారాంశం

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్... 18 నెలల తర్వాత సెంచరీ బాదిన స్టీవ్ స్మిత్...

టైమ్ బాగాలేనప్పుడు ఎక్కడో ఊరవతల ఎగిరిపడిన ఎంగిలాకు వచ్చి ముఖం మీద పడుతుందట... ఇప్పుడు విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్రికెటర్ సెంచరీ కొట్టినా... అది తిరిగి తిరిగి విరాట్ కోహ్లీపై ట్రోలింగ్‌లా మారుతోంది. దాదాపు ఏడాదిన్నరగా సెంచరీ అందుకోలేకపోయిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్... శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో శతకాన్ని నమోదు చేశాడు...

2020లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడో టెస్టులో చివరిసారి సెంచరీ అందుకున్న స్టీవ్ స్మిత్, 18 నెలల తర్వాత టెస్టుల్లో సెంచరీ నమోదు చేశాడు.  స్టీవ్ స్మిత్‌కి టెస్టు కెరీర్‌లో ఇది 28వ సెంచరీ. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియాపై సెంచరీ చేసిన జో రూట్... టెస్టుల్లో 28వ సెంచరీ నమోదు చేయగా, స్టీవ్ స్మిత్ అతని రికార్డును సమం చేశాడు...

జో రూట్ 28వ టెస్టు సెంచరీ చేయడానికి 121 మ్యాచులు అవసరం రాగా, స్టీవ్ స్మిత్‌కి ఇది 87వ టెస్టు మ్యాచ్ మాత్రమే. వీళ్లిద్దరికంటే ముందు అప్పుడెప్పుడో నవంబర్ 2019లో వెస్టిండీస్‌పై సెంచరీ చేసి టెస్టుల్లో 27వ సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీ మాత్రం రెండున్నరేళ్లుగా 28వ సెంచరీ మార్కును అందుకోలేకపోతున్నాడు... చేసింది ఫామ్‌లో లేని లంకపైన అని కోహ్లీ ఫ్యాన్స్ సర్దిచెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అదే శ్రీలంకపై స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు విరాట్..

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. డేవిడ్ వార్నర్ 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి కసున్ రజిత బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 77 బంతుల్లో 4 ఫోర్లతో 37 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, రమేశ్ మెండీస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

ఆస్ట్రేలియా 70 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మూడో వికెట్‌కి 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 156 బంతుల్లో 12 ఫోర్లతో 104 పరుగులు చేసిన లబుషేన్, జయసూర్య బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ 36 బంతుల్లో 12 పరుగులు, కామెరూన్ గ్రీన్ 14 బంతుల్లో 4 పరుగులు చేసి ప్రబాత్ జయసూర్య బౌలింగ్‌లోనే అవుట్ అయ్యారు...

212 బంతుల్లో 14 ఫోర్లతో 109 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌తో పాటు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 35 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శ్రీలంక పర్యటనలో గాలేలో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఆస్ట్రేలియా...  ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో 9 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని, మూడు మ్యాచులను డ్రా చేసుకున్న ఆస్ట్రేలియా, ఈ టెస్టు కూడా గెలిస్తే... ఫైనల్‌కి మరింత చేరువవుతుంది...

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు