T20 WC 2022: పొట్టి పోరుకు కౌంట్ డౌన్ స్టార్ట్.. వరల్డ్ టూర్ ప్రారంభించిన ఐసీసీ

Published : Jul 08, 2022, 03:46 PM ISTUpdated : Jul 08, 2022, 03:48 PM IST
T20 WC 2022: పొట్టి పోరుకు కౌంట్ డౌన్ స్టార్ట్.. వరల్డ్ టూర్ ప్రారంభించిన ఐసీసీ

సారాంశం

ICC T20 Worldcup 2022: గతేడాది టీ20 ప్రపంచకప్ తాలూకు జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోకముందే ఈ ఏడాది మరో  పొట్టి సమరం క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది.   

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్ కు కౌంట్ డౌన్ మొదలైంది.  ఈ టోర్నీ ప్రారంభానికి మరో వంద రోజుల సమయం మాత్రమే మిగిలుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)  ఈ టోర్నీ ప్రచారానికి వినూత్న రీతిలో ప్లాన్ వేసింది.  నేటి నుంచి అక్టోబర్ 16 వరకు టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో  వరల్డ్ టూర్ ను ప్రారంభించింది. ఒలింపిక్స్ కు ముందు టార్చ్ ను తీసుకుని పలు దేశాల గుండా తిరిగి  వాటిపై  ప్రచారం కల్పించే విధంగా ఐసీసీ ఈ ప్లాన్ వేసింది. 

మొత్తం 16 జట్లు పాల్గొనబోయే ఈ మెగా ఈవెంట్ అక్టోబర్ 16న శ్రీలంక-నమీబియా మధ్య జరగబోయే పోరుతో  ప్రారంభం కానుంది. ఆలోపు ఈ టోర్నీకి ప్రచారం కల్పించడానికి గాను ఐసీసీ.. ‘టీ20 పురుషుల ప్రపంచకప్ ట్రోఫీ టూర్’ను డిజైన్ చేసింది. 

ఈ మేరకు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్ సారథి ఆరోన్ ఫించ్ తో పాటు  ఆస్ట్రేలియా మహిళా జట్టు క్రికెటర్లు  జార్జియా వేర్హమ్, టైలా వ్లెమ్నిక్.. క్రికెట్ దిగ్గజాలు షేన్ వాట్సన్, వకార్ యూనిస్ (పాకిస్తాన్), మోర్నీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా) లు ఈ టూర్ ను మెల్బోర్న్ నుంచి అధికారికంగా ప్రారంభించారు. 

 

టీ20 పురుషుల ప్రపంచకప్ ట్రోఫీ టూర్..  మొత్తం నాలుగు ఖండాలలోని 13 దేశాల్లో గల 35 లొకేషన్లను చుట్టివస్తుంది. ఫిజి, ఫిన్లాండ్, జర్మనీ, ఘనా, ఇండోనేషియా, జపాన్, నమీబియా, నేపాల్, సింగపూర్,  వనూటు దేశాల గుండా సాగుతుంది. పైన పేర్కొన్న దేశాలలో నమీబియా మినహా మిగతావన్నీ క్రికెట్ కు కొత్త దేశాలే. ఈ దేశాలలో క్రికెట్ వ్యాప్తికి గాను  ఐసీసీ ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది.  ప్రపంచ దేశాలను చుట్టొచ్చే ఈ ట్రోఫీ అక్టోబర్ 16న గీలాంగ్ (ఆస్ట్రేలియా) వేదికగా జరుగబోయే శ్రీలంక - నమీబియా మ్యాచ్ వద్ద ఆగనుంది. 

ఈ టూర్ కు సంబంధించిన వార్తలు,  ఫోటోలు, వీడియోలు, విశేషాల గురించి అభిమానులు ఐసీసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావాలని ఐసీసీ తెలిపింది. ఈ టోర్నీలో భాగంగా భారత జట్టు.. అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఢీకొట్టనున్న విషయం తెలిసిందే.  

 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు