
అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రపంచకప్ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 46 రోజులపాటు దేశవ్యాప్తంగా పది నరగాలలో జరుగబోయే ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే కొత్త వివాదానికి తెరలేచింది. షెడ్యూల్, వెన్యూస్ (వేదికలు) విషయంలో పలు స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నచోటే బీసీసీఐ మ్యాచ్ లను నిర్వహణకు అంగీకారం తెలిపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంగళవారం విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. ఢిల్లీ, ధర్మశాల, లక్నో, కోల్కతా, అహ్మదాబాద్, ముంబై, పూణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులను ఎంపిక చేసింది. వరల్డ్ కప్ నిర్వహణ రేసులో గువహతి, రాజ్‌కోట్, ఇండోర్ పోటీ పడ్డా వీటికి ఛాన్స్ దక్కలేదు.
ఇండోర్ (మధ్యప్రదేశ్), మొహాలి (పంజాబ్) లలో మ్యాచ్ లు లేకపోవడంపై ఆ రాష్ట్రాల క్రికెట్ బోర్డులు బీసీసీఐ పై నేరుగా విమర్శలు సంధించాయి. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అభిలాష్ ఖండేకర్ మాట్లాడుతూ.. ‘1987లో భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఇండోర్ లో ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్.. ఇక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడింది. ఘన చరిత్ర ఉన్న ఈ స్టేడియానికి వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా దక్కకపోవడం బాధాకరం. ఈ టోర్నీలో మేం కనీసం రెండు, మూడు మ్యాచ్ లు అయినా దక్కుతాయని ఆశించాం. కానీ మాకు నిరాశే మిగిలింది..’అని తెలిపాడు.
ఇక పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. ‘వరల్డ్ కప్ షెడ్యూల్ ను చూస్తుంటే కేవలం మెట్రో నగరాలు, బీసీసీఐ బోర్డులో ఉన్న ఆఫీస్ బేరర్లు ప్రాతినిథ్యం వహించే నగరాలకు మాత్రమే వేదికలు దక్కాయి. మేం మొహాలీలో వరల్డ్ కప్ మ్యాచ్ లు ఉంటాయని భావించాం. కానీ ఒక్క మ్యాచ్ కూడా మాకు దక్కలేదు. కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కు కూడా మేం నోచుకోలేదు..’అని చెప్పాడు.
హైదరాబాద్ లో మూడే..
ఇండోర్, మొహాలితో పాటు హైదరాబాద్ క్రికెట్ అభిమానులు కూడా బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో మూడంటే మూడు మ్యాచ్ లే జరుగుతాయి. అవి కూడా రెండు క్వాలిఫయర్ టీమ్స్ తో పాకిస్తాన్ ఆడేవి కాగా మరోకటి న్యూజిలాండ్ మ్యాచ్. ఒక్క భారత్ మ్యాచ్ కూడా లేదు. వరల్డ్ కప్ ప్రారంభమైన పది రోజుల్లోనే ఉప్పల్ లో మ్యాచ్ లు ముగుస్తాయి. దీనిపై తెలుగు క్రికెట్ అభిమానులు బీసీసీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ముష్టి వేసినట్టుగా ఎందుకింత వివక్ష..? అని వాపోతున్నారు.
టీమిండియా వరల్డ్ కప - 2023 షెడ్యూల్ :
అక్టోబర్ 8, చెన్నై : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
అక్టోబర్ 11, ఢిల్లీ : ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్
అక్టోబర్ 15, అహ్మదాబాద్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్
అక్టోబర్ 19, పూణె : ఇండియా వర్సస్ బంగ్లాదేశ్
అక్టోబర్ 22, ధర్మశాల : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
అక్టోబర్ 29, లక్నో : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్
నవంబర్ 02, ముంబై : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్
నవంబర్ 05, కోల్‌కతా : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా
నవంబర్ 11, బెంగళూరు : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్