SLC requests BCCI: షెడ్యూల్ ను మార్చండి.. లేకుంటే మాకు కష్టం : బీసీసీఐని కోరిన శ్రీలంక

By Srinivas MFirst Published Jan 26, 2022, 3:02 PM IST
Highlights

SLC requests BCCI: ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా సిరీస్ లో స్వల్ప మార్పులు చేయాలని శ్రీలంక అభ్యర్థించింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 25 నుంచి...
 

వచ్చే నెల నుంచి శ్రీలంక జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే షెడ్యూల్ లో మార్సులు చేయాలని, లేకుంటే తమకు కష్టంగా ఉంటుందని  శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ).. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ని కోరినట్టు సమాచారం.  ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా.. సిరీస్ లో స్వల్ప మార్పులు చేయాలని లంక బోర్డు  అభ్యర్థించింది. షెడ్యూల్ ప్రకారం.. శ్రీలంక జట్టు ముందు  టెస్టులు ఆడి తర్వాత టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ.. తాము ముందుగా టీ20లు ఆడి ఆ తర్వాత టెస్టులు ఆడతామని శ్రీలంక అంటున్నది. 

ఫిబ్రవరి  25 న శ్రీలంక జట్టు భారత్ తో తొలి టెస్టు ఆడాల్సి ఉంది. అనంతరం రెండో టెస్టు ఆడుతుంది.  మార్చి 13 నుంచి 18 వరకు టీ 20 సిరీస్ నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్, వేదికలను కూడా ఖరారు చేసింది. తొలి టెస్టును బెంగళూరులో నిర్వహించనుండగా.. రెండో టెస్టు (మార్చి 5 నుంచి)ను మొహాలిలో ఆడించనున్నారు. ఇక మార్చి 13న తొలి టీ20 (మొహాలీ), మార్చి 15న రెండో టీ20 (ధర్మశాల),  18న మూడో టీ20 (లక్నో) ని  నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసింది. 

అయితే తాము ముందుగా టీ20 సిరీస్ ఆడతామని శ్రీలంక తెలిపింది. ఆస్ట్రేలియాతో ఆ జట్టు ఫిబ్రవరి 20 వరకు  టీ20 సిరీస్ ఆడనున్నది.  వచ్చే నెల 5 నుంచి 20 దాకా శ్రీలంక  జట్టు ఆసీస్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే శ్రీలంక.. జట్టును కూడా ప్రకటించింది. అక్కడ 5 టీ20 మ్యాచులు ఆడనుంది. ఈ నేపథ్యంలో.. ఆస్ట్రేలియా నుంచి వచ్చే జట్టునే భారత్ కు పంపించాలనే యోచనలో లంక బోర్డు ఉంది. 

ముందుగా టెస్టు సిరీస్ నిర్వహిస్తే తాము మళ్లీ ఆటగాళ్లను వెనక్కి పిలింపిచడం..  టెస్టు  జట్టును ప్రకటించడం వంటివి చేయాల్సి వస్తుందని.. ఒకవేళ బీసీసీఐ షెడ్యూల్ లో  స్వల్ప మార్పులు చేసి ముందుగా టీ20 లను నిర్వహిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని విన్నవించుకుంది.  ఆసీస్ సిరీస్ ముగిసినా భారత్ ముందు టీ20లకు అనుమతిస్తే అప్పటికే బబుల్ లో ఉండే ప్లేయర్లనే తిరిగి కొనసాగించగలమని తెలిపినట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరి దీనిపై బీసీసీఐ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. 

ఆస్ట్రేలియా సిరీస్ కు శ్రీలంక జట్టు : దసున్ శనక (కెప్టెన్), చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, పథుమ్ నిస్సంక, దనుష్క గుణతిలక, కుశాల్ మెండీస్, దినేశ్ చండీమాల్, చమిక కరుణరత్నే, జనిత్ లియనగె, కమిల్ మిషారా, రమేశ్ మెండీస్, వనిందు హసరంగ, లాహిరు కుమార,  నువాన్ తుషారా, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందెర్సే, ప్రవీణ్ జయవిక్రమ, శెరిన్ ఫెర్నాండో 

శ్రీలంక సిరీస్ కూ వేదికలు కుదించే యోచనలో బీసీసీఐ..? 

వెస్టిండీస్ తో  వన్డే, టీ20 సిరీస్ లకు గాను భారత జట్టు వేదికలను కుదించిన విషయం తెలిసిందే.  ఆరు మ్యాచు (మూడు వన్డేలు, మూడు టీ20లు) లకు గాను గతంలో 6 వేదికలుండగా.. దేశంలో కరోనా మళ్లీ స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో వాటిని రెండింటికే కుదించింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల నరేంద్ర మోడీ స్టేడియంలో వన్డేలు, బెంగాల్ లోని  కోల్కతాలో ఉన్న ఈడెన్ గార్డెన్స్ లో టీ20లు జరుగనున్నాయి. ఇక తాజాగా శ్రీలంక సిరీస్ కు కూడా  నాలుగు వేదిక (బెంగళూరు, మొహాలి, ధర్మశాల, లక్నో) లను ఎంపిక చేసిన   బీసీసీఐ.. వాటిని కూడా రెండు వేదికలుగానే మార్చేందుకు  చర్చలు సాగిస్తున్నది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ లో భాగంగా బెంగళూరులో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో మొహాలి, ధర్మశాలలో మ్యాచులను నిర్వహించాలని  బీసీసీఐ భావిస్తున్నది. 
 

click me!