
దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి.. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి.. రాత్రుళ్లు ఇంట్లో విద్యుత్ ద్వీపం వెలగక గాఢాంధకారాల్లో గడుపుతూ.. పొద్దున లేచింది మొదలు రాత్రి కనురెప్ప వాల్చేవరకు బతుకుజీవుడా అంటూ పోరాటం.. ఆ పూటకు నాలుగు మెతుకులు దొరికితే చాలు కడుపునింపుకోవడానికి అని ఆరాటం.. బతుకు దుర్భరమై, జీవితం మీద ఆశలు కరువై.. గాలిలో దీపంలా మారిన భవిష్యత్ ను తలుచుకుంటూ కుమిలిపోతూ కాలం వెల్లదీస్తున్న సమయంలో లంకకు వచ్చారు ఆస్ట్రేలియన్లు. 3 టీ20లు, 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడటానికి.. అసలు ఈ సిరీస్ జరుగుతుందా..? అన్న స్థితి నుంచి విజయవంతంగా సిరీస్ నిర్వహిస్తున్నది లంక బోర్డు. అందుకే లంక క్రికెట్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా కంగారూలకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఆసీస్ లంకకు రావడానికి ముందు ఇక్కడి పరిస్థితిని దుర్భరం. స్టేడియాలలో మ్యాచుల నిర్వహణకు కూడా లంక బోర్డు దగ్గర డబ్బులు లేని దుస్థితి. డే అండ్ నైట్ మ్యాచులను పెడితే కరెంట్ ఎక్కువ వినియోగించాల్సి వస్తుందని.. జనరేటర్లు పెట్టి నడిపించలేని స్థితిలో ఉన్నామని.. మ్యాచులన్నీ ఉదయమే నిర్వహించేలా చూడాలని క్రికెట్ ఆస్ట్రేలియా ను వేడుకుంది లంక బోర్డు. లంక పరిస్థితిని అర్థం చేసుకున్న ఆసీస్ అందుకు అంగీకారం తెలిపింది.
ఎన్నో సవాళ్ల నడుమ ఆసీస్ పర్యటనను విజయవంతంగా నిర్వహిస్తున్నది లంక బోర్డు. వాళ్ల పరిస్థితి చూసి గతంలో రెండు మూడు బోర్డులు అక్కడ మ్యాచులు ఆడటం వృథా అనే పరిస్థితికి వచ్చాయి. కానీ ఆసీస్ మాత్రం పూర్తిస్థాయి జట్టును పంపి వారికి ఊరటనిచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా.
లంక పర్యటనకు వచ్చిన ఆసీస్.. తొలుత టీ20 సిరీస్ ను ఆడింది. ఈ సిరీస్ ను ఆసీస్.. 2-1 తో గెలుచుకుంది. ఇక ఆ తర్వాత ఐదు వన్డేల సిరీస్ ను లంక 3-2 తో నెగ్గింది. శుక్రవారం చివరి వన్డే అనంతరం ప్రేమదాస స్టేడియానికి భారీగా చేరుకున్న అభిమానులు.. ‘థాంక్యూ ఆస్ట్రేలియా.. థాంక్యూ ఆస్ట్రేలియా..’ అనే నినాదాలతో హోరెత్తించారు.
మ్యాచ్ అనంతరం ఆసీస్ ఆటగాళ్లంతా గ్రౌండ్ లోపల తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. లంకేయుల అభిమానానికి కంగారూలు ఫిదా అయ్యారు. తమ దేశానికి వచ్చినందుకు గాను చాలా మంది లంక క్రికెట్ ఫ్యాన్స్.. ఆసీస్ జెర్సీ ఎల్లో షర్ట్స్ వేసుకుని ‘థ్యాంక్యూ ఆసీస్.. వీ లవ్ యూ’ బ్యానర్లతో కనిపించారు. అవి చూసి ఆసీస్ ఆటగాళ్లు కళ్లు చెమ్మగిల్లాయి. ఇదే విషయమై ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ముగ్దుడైపోయాడు. అతడు మాట్లాడుతూ.. ‘అభిమానుల మద్దతు చూస్తుంటే చాలా గొప్పగా ఉంది. మా ఆసీస్ సహచర ఆటగాళ్లతో నేను.. ఇది మన జీవితంలో చాలా స్పెషల్ ఫీలింగ్ అని చెప్పాను. ఇతర దేశంలో ఉండి కూడా అభిమానులు మనకు ఇంత మద్దతునివ్వడం మరిచిపోరానిది. సాధారణంగా ఆసీస్ జట్టు ఇతర దేశాల పర్యటనలకు వెళ్తే మమ్మల్ని అక్కడ శత్రువులుగా చూస్తారు. ఇక్కడ స్టేడియంలో కూడా మా దేశ అభిమానులు కూడా పెద్దగా లేరు. కానీ లంక అభిమానుల నుంచి మేం పొందుతున్న మద్దతు మాత్రం మరిచిపోలేనిది..’ అని తెలిపాడు.
కంగారూల రాకకు ముందు, తర్వాత లంకేయుల జీవితాల్లో గణనీయమైన మార్పులేమీ లేవు. కానీ వారికి ఉన్నంతలో కాసింత ఉపశమనం. గత నాలుగు నెలలుగా నిత్య కృత్యమైన కష్టాల నుంచి కాస్త రిలీఫ్. ఇరు జట్ల ఆటగాళ్ల టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ చూసి కడుపు నింపుకున్న లంక క్రికెట్ అభిమానులు వేలల్లో ఉన్నారు. ఇక లంక పర్యటనలో ఉన్న ఆసీస్.. మిగిలిన రెండు టెస్టులలో ఒక టెస్టును జులై 3 నుంచి గాలే వేదికగా ఆడనున్నది.