తలకు బంతి తగిలి కుప్పకూలిన శ్రీలంక పేసర్ కులసురియ

By telugu teamFirst Published Feb 17, 2020, 1:12 PM IST
Highlights

టీ20 మహిళా ప్రపంచ కప్ పోటీల నేపథ్యంలో దక్షిణాఫ్రికాపై జరిగిన వార్మప్ మ్యాచులో శ్రీలంక పేసర్ కులసురియ తలకు బంతి తగిలి కుప్పకూలింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అడిలైడ్: మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే మహిళా టీ20 ప్రపంచ కప్ సందర్భంగా ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచులో శ్రీలంక పేసర్ అచిని కులసురియ తీవ్రంగా గాయపడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో సూపర్ ఓవర్ లో ఆమెకు తలకు బంతి తగిలింది. దీంతో ఆమె గాయపడింది. 

అప్పటికి దక్షిణాఫ్రికా 41 పరుగులతో మ్యాచ్ గెలిచింది. అయితే, ప్రాక్టీస్ కోసం సూపర్ ఓవర్ ఆడించారు. ఈ సందర్భంగా ఆ జట్టు బ్యాట్ వుమన్ క్లో ట్రియన్ తొలి బంతిని భారీ షాట్ ఆడింది. అదే సమయంలో లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న కులసురియ బంతిని అందుకోవడానికి ప్రయత్నించింది. 

బంతి ఆమె చేతికి చిక్కకుండా తలకు తగిలింది. దీంతో ఆమె మైదానంలో కుప్పకూలింది. దాంతో  శ్రీలంక క్రికెటర్లతో సహా దక్షిణాప్రికా బ్యాట్స్ వుమెన్ వెంటనే ఆమె వద్దకు పరుగెత్తారు. అప్పటికే కులసురియ స్పృహ కోల్పోయింది. 

ఆమెను అంబులెన్స్ దగ్గరలోని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని, అయితే, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని వైద్యులు చెప్పారు. 

కాగా, దక్షిణాఫ్రికా బ్యాట్స్ వుమన్ క్లో ట్రియన్ మాత్రం తీవ్రంగా బాధపడింది. తన వల్లనే ఇది జరిగిందని భావోద్వేగానికి గురైంది. ఆమెను శ్రీలంక క్రికెటర్లు ఓదార్చారు. ఆ తర్వాత సూపర్ ఓవరును రద్దు చేసి ఆటను ముగించారు. 

click me!