
స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న శ్రీలంక.. తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో మాత్రం పటిష్టస్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసిన లంకేయులు ఈ టెస్టును శాసించే స్థాయికి వెళ్లారు. గాలే వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో తొలుత ఆస్ట్రేలియా.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో లంక.. 554 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. కాగా ఆట నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్.. 22 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులే చేసి కష్టాల్లో పడింది.
లంక తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ పథుమ్ నిస్సంక (6) విఫలమైనా.. కెప్టెన్ కరుణరత్నె (86), కుశాల్ మెండిస్ (85), ఏంజెలా మాథ్యూస్ (52) లు రాణించారు. వీరికి తోడు దినేశ్ చండిమాల్ (326 బంతుల్లో 206 నాటౌట్.. 16 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఇది అతడి కెరీర్ లో తొలి డబుల్ హండ్రెడ్.
అతడికి తోడుగా కమిందు మెండిస్ (61) తో పాటు టెయిలెండర్లు సహకరించడంతో తొలి ఇన్నింగ్స్ లో లంక శాసించే స్కోరు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 190 పరుగుల వెనుకబడ్డ ఆసీస్ ఇన్నింగ్స్ కు వరుసగా షాకులు తాకుతున్నాయి.
ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (24), ఉస్మాన్ ఖవాజా (29) లు పది పరుగుల తేడాతో పెవిలియన్ చేరారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్.. రెండో ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్ (5) కూడా త్వరగానే వెనుదిరిగాడు. ప్రస్తుతం మార్నస్ లబూషేన్ (15 బ్యాటింగ్), కామెరాన్ గ్రీన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై లంక స్పిన్నర్లు రమేశ్ మెండిస్, ప్రభాత్ జయసూర్యలు అదరగొడుతున్నారు. ఆసీస్ కోల్పోయిన నాలుగు వికెట్లలో తలో రెండు వీరి ఖాతాలోనివే. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ఇంకా 115 పరుగులు వెనుకబడి ఉంది. మరో రోజు ఆట మిగిలుండటం.. కంగారూలు వరుసగా వికెట్లు కోల్పోతుండటం తో ఈ టెస్టులో విజయం పై లంక ధీమాగా ఉంది. ఐదో రోజు వరుణుడు అడ్డు రాకుంటే లంక విజయం ఖాయమే..