
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దుర్భరమవుతున్నాయి. ఇప్పటికే అక్కడ నిరసనాకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. పరిస్థితులు నానాటికీ దిగజారుతున్న వేళ లంక తాత్కాలిక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమ్ సింఘే లంకలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. దీంతో దేశమంతటా కర్ఫ్యూ మయం కానున్నది. ఈ నేపథ్యంలో అక్కడ త్వరలో జరుగబోయే శ్రీలంక - పాకిస్తాన్ సిరీస్ తో పాటు ఆసియా కప్ జరుగుతాయా..? లేదా..? అనేది అనుమానమే.
లంకతో రెండు టెస్టులు ఆడేందుకు గాను పాకిస్తాన్ జట్టు ఇప్పటికే లంకకు వచ్చింది. ఈనెల 16న పాకిస్తాన్-శ్రీలంక మధ్య గాలే వేదికగా తొలి టెస్టు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఇరు జట్ల ఆటగాళ్లు గాలేలో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు.
ఇదిలాఉండగా ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమల్లోకి వస్తాయి. మరి క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించడమనేది సాధ్యమయ్యే పనే కాదు. దీంతో మరికొద్దిగంటల్లో లంక బోర్డు పాకిస్తాన్ పర్యటనపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడుప్పుడే లంకలో ఈ సంక్షోభం ముగిసిపోయే అవకాశం కూడాలేకపోవడంతో మళ్లీ అక్కడ మ్యాచుల నిర్వహణ కూడా కష్టమే. దాంతో సిరీస్ ను ఉపసంహరించుకోవడం మినహా లంక బోర్డుకు మరో దారి లేదు.
ఆసియా కప్ కూడా..
పాకిస్తాన్ తో రెండు టెస్టుల తర్వాత లంకలో ఆసియా కప్-2022 జరగాల్సి ఉంది. నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ట్రోఫీని మళ్లీ ఈ ఏడాదే నిర్వహిస్తున్నారు. కానీ లంకలో అత్యయిక స్థితి విధించడంతో ఆసియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీసీ) అక్కడ ట్రోఫీ నిర్వహించకపోవడమే ఉత్తమమనే భావనకు వచ్చినట్టు తెలుస్తున్నది. లంకకు బదులుగా బంగ్లాదేశ్ లో ఈ ట్రోపీ నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నది.
ఆగస్టు 27 నుంచి ఈ టోర్నీని టీ20 ఫార్మాట్ లో ఆడించేందుకు గాను సన్నాహాలు మొదలెట్టిన ఏసీసీ.. బంగ్లాదేశ్ లో 2022 ట్రోఫీని నిర్వహించేందుకు గాను బంగ్లాక్రికెట్ బోర్డు (బీసీబీ) తో ఏసీసీ ప్రతినిధులు చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది. 2016లో ఆసియా కప్ ను బంగ్లాదేశ్ లోనే నిర్వహించారు.