
ఇంగ్లాండ్ తో తొలి వన్డేలో ఆ జట్టు పతనాన్ని శాసించిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. అంతర్జాతీయ దిగ్గజ క్రికెటర్లతో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బుమ్రాను ఆకాశానికెత్తాడు. అతడొక అద్భుతమని కొనియాడాడు. ఇంగ్లాండ్ తో తొలి వన్డే మ్యాచ్ ముగిశాక సచిన్ తన ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘బుమ్రా మూడు ఫార్మాట్లలో ఉత్తమ బౌలర్ అని నేనెప్పట్నుంచో చెబుతున్నాను. ఇప్పుడు నాసిర్ హుస్సేన్ (ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్) కూడా అదే అంటున్నాడు. ఆ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది.
ఓవల్ పిచ్ లో సాధారణంగానే బౌన్స్ వస్తుంది. కానీ టీమిండియా బౌలర్లు మాత్రం ఈ మ్యాచ్ లో అసాధారణంగా బౌలింగ్ చేశారు. సరైన లెంగ్త్ లు, స్వింగ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా బుమ్రా అయితే ఒక అద్భుతం..’ అని సచిన్ ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్ లో బుమ్రా.. 7.2 ఓవర్లు బౌలింగ్ చేసి 19 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా విజృంభణ తో ఇంగ్లాండ్.. 110పరుగులకే కుప్పకూలింది. తన కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బుమ్రా.. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.
ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో అగ్రస్థానానికి..
ఇంగ్లాండ్ పై కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన బుమ్రా..వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టాప్-10 బౌలర్ల జాబితాలో బుమ్రా.. 718 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. బుమ్రా తర్వాత స్థానంలో న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (712 పాయింట్లు), పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది (681 పాయింట్లు) నిలిచారు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు ముందు బుమ్రా..రెండో స్థానంలో ఉండేవాడు.
సూర్య పైపైకి..
ఇదిలాఉండగా ఇంగ్లాండ్ తో ఇటీవలే ముగిసిన మూడో టీ20లో సెంచరీ చేయడం ద్వారా సూర్యకుమార్ యాదవ్.. టీ20లలో టాప్-10 లోకి వచ్చాడు. అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరాడు. టాప్-10 లో ఇండియా తరఫున అతడొక్కడే ఉన్నాడు.