స్వదేశంలో బంగ్లా కు షాకిచ్చిన లంక.. టెస్టుతో పాటు సిరీస్ కూడా కైవసం..

By Srinivas MFirst Published May 27, 2022, 5:32 PM IST
Highlights

BAN vs SL 2nd Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 లో భాగంగా  బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య  జరిగిన రెండో టెస్టు లో లంకను విజయం వరించింది. పది వికెట్ల తేడాతో బంగ్లాను ఓడించిన లంక సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది.

స్వదేశంలో శ్రీలంకతో జరిగిన  టెస్టు సిరీస్ ను బంగ్లాదేశ్ 0-1 తో కోల్పోయింది. సిరీస్ విజేతను తేల్చే రెండో టెస్టు లో  బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.  గతేడాది స్వదేశంలో  బంగ్లాదేశ్ తో ముగిసిన టెస్టు సిరీస్ ను కోల్పోయిన బంగ్లా.. తాజాగా లంకతో కూడా సిరీస్  కోల్పోవడం గమనార్హం.  లంక ముందు నిర్దేశించిన 29 పరుగుల లక్ష్యాన్ని  ఆ జట్టు 3 ఓవర్లోనే ఛేదించి పది వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2021-2023 లో భాగంగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు లో లంక పది వికెట్ల తేడాతో విజయం సాధించడమే గాక సిరీస్ ను 1-0తో నెగ్గింది. ఈ సిరీస్ లో తొలి టెస్టు డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. 

ఈనెల 23న మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ చేసి 365 పరుగులు చేసింది. వెటరన్ ముష్ఫీకర్ రహీమ్ (175 నాటౌట్) తో పాటు వికెట్ కీపర్ లిటన్ దాస్ (141) ల సెంచరీలతో ఆదుకున్నారు. రజిత ఐదు వికెట్లతో చెలరేగగా.. అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లు  తీశాడు. 

బదులుగా తొలి ఇన్నింగ్స్ లో లంక.. 165.1 ఓవర్లలో 506 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (145 నాటౌట్), చండిమాల్ (124), కెప్టెన్ కరుణరత్నె (80) లు రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఉల్ హసన్ 5 వికెట్లు తీయగా.. ఎబాదత్ హుసేన్ 4 వికెట్లు తీశాడు. 

 

Sri Lanka won by 10 wickets and wrapped the series by 1-0. pic.twitter.com/vE6OEvq8ka

— Bangladesh Cricket (@BCBtigers)

రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా మరోసారి  చేతులెత్తేసింది. లిటన్ దాస్ (52), షకిబ్ (58) మినహా మిగిలిన వారెవరూ  రెండంకెల స్కోరు చేయడానికే ఇబ్బంది పడ్డారు. నలుగురు డకౌట్ అయ్యారు. ఫలితంగా ఆ జట్టు 55.3 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. అసిత ఫెర్నాండో ఆరు వికెట్లు తీశాడు.  అనంతరం లంక.. 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 29 పరుగులను ఊదేసింది.

ఈ మ్యాచ్ లో  రెండు ఇన్నింగ్స్ లలో ఆకట్టుకున్న అసిత ఫెర్నాండో కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. ఏంజెలో మాథ్యూస్ కు ప్లేయర్ ఆఫ్  ది సిరీస్ అవార్డు దక్కింది.  

click me!