
ఈ ఏడాది ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. త్వరలో జరగనున్న ఐపీఎల్ మ్యాచులకు గురువారం మినీ వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో ఏ క్రికెటర్ ఎంత ధర పలికాడు..? ఏ క్రికెటర్ ధర పడిపోయిందనే చర్చ నిన్నటి నుంచి కొనసాగుతూనే ఉంది. కాగా.. దానికి మించి ఇద్దరు ఆ వేలంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
వాళ్లెవరో కాదు.. బాలీవుడ్ దిగ్గజాలు షారూక్ ఖాన్, జూహీ చావ్లా పిల్లలు. వీరి వారసులు ఐపీఎల్ వేలం దగ్గర సందడి చేశారు. ఇంతకీ మ్యాటరేంటంటే... షారూక్ ఖాన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యజమాని అన్న విషయం మనకు తెలిసిందే. కాగా.. దీనికే నటి జూహీ చావ్లా భర్త జై మెహతా కూడా భాగస్వామ్యం కలిగి ఉన్నారు. వీరు ఈ వేలంలో వారి పిల్లలను తీసుకురావడం విశేషం.
షారూక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్. జూహీ కుమార్తె జాహ్నవీ మెహతాలు అక్కడ దర్శనమిచ్చారు. తమ ఫ్రాంఛైజీ మేనేజ్మెంట్ దగ్గర వీరిద్దరూ కలిసి కూర్చోవడం గమనార్హం. కాగా.. ఆ ఫోటోని జూహీ చావ్లా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
తమ కేకేఆర్ కిడ్స్ ఇద్దరూ ఆక్షన్ టేబుల్ దగ్గర కూర్చున్నారంటూ.. అలా చూడటం తనకు ఆనందంగా ఉందంటూ జూహీ చావ్లా ఆ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. కాగా.. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా షారూక్ కుమారుడు త్వరలో నే సినిమాల్లోకి అడుగుపెడతాడంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.