వైజాగ్ టెస్ట్: ఎల్గర్ వికెట్... రవీంద్ర జడేజా ఖాతాలోకి అద్భుత రికార్డు

By Arun Kumar PFirst Published Oct 4, 2019, 6:05 PM IST
Highlights

వైజాగ్ టెస్ట్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. సెంచరీ వీరుడు ఎల్గర్ వికెట్ పడగొట్టడం ద్వారా జడేజా ఈ రికార్డును నమోదుచేశాడు.  

 

విశాఖపట్నం వేదికన సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రసవత్తంగా మారింది. మొదటి రెండు రోజులు ఆతిథ్య టీమిండియా ఆధిపత్యం కొనసాగగా మూడో రోజు మాత్రం సఫారీ టీం పైచేయి సాధించింది. అలా ఆ జట్టును అద్భుత సెంచరీతో ఆదుకుని ఓపెనర్ ఎల్గర్(160 పరుగులు) రికార్డు సాధించగా అతన్ని ఔట్ చేయడం ద్వారా టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. 

ఎల్గర్ మొదట కెప్టెన్ డుప్లెసిస్ తో ఆ తర్వాత డికాక్ తో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఎల్గర్-డికాక్ ల జోడీ ఏకంగా 164 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు. ఇలా మ్యాచ్ ఆరంభంనుండి భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ సాధించిన ఎల్గర్ చివరకు జడేజా స్పిన్ మాయాజాలానికి బలయ్యాడు. 
జడేజా బౌలింగ్ లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి ఎల్గర్ వికెట్ సమర్పించుకున్నాడు.  ఇలా మంచి ఊపుమీదున్న ఆటగాన్ని ఔట్ చేసి జట్టుకు సహకరించడమే కాకుండా జడేజా మరో అరుదైన ఘనత సాధించాడు. 

ఎల్గర్ వికెట్ తో జడేజా ఖాతాలోకి 200వ టెస్ట్ వికెట్ చేరింది. 200 వికెట్ల క్లబ్ చేరేందుకు జడేజా కేవలం 44 టెస్టులు మాత్రమే ఆడాడు. దీంతో అత్యంత వేగంగా 200 టెస్ట్ వికెట్లు పడగొట్టిన ఎడమచేతి వాటం స్పిన్నర్ గా జడేజా చరిత్ర సృష్టించాడు. ఇప్పటవరకు అంతర్జాతీయ స్థాయిలో ఇంత తక్కువ మ్యాచుల్లో ఇన్ని వికెట్లు మరే ఎడమచేతివాటం బౌలర్ తీయలేకపోయాడు.   

మూడో రోజు ఆటలో ఓ వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ ఎల్గర్ ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా  భారీ సెంచరీ(160 పరుగులు) బాదాడు. అతడితో పాటు టీ20 కెప్టెన్ క్వింటన్ డికాక్ (111 పరగులు) కూడా సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా మంచి స్కోరు దిశగా సాగుతోంది. కెప్టెన్ డుప్లెసిస్ కూడా 55 పరుగులతో తన వంతు సహకారం అందించాడు. దీంతో 118 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. 

భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో చెలరేగగా జడేజాకు 2, ఇషాంత్ శర్మ కు 1 వికెట్ దక్కింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 118 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 385 పరుగుల వద్ద నిలిచింది. టీమిండియాను అధిగమించాలంటే ఆ జట్టు ఇంకా 117 పరుగులు చేయాల్సి వుండగా చేతిలో కేవలం 2 వికట్లు మాత్రమే వున్నాయి.  

click me!