వైజాగ్ టెస్ట్: బయటపడ్డ భద్రతా వైఫల్యం... ఆటగాళ్ల వెంటబడ్డ అభిమాని

By Arun Kumar PFirst Published Oct 4, 2019, 4:11 PM IST
Highlights

విశాఖ పట్నం వేదికన జరుగుతున్న మొదటి టెస్ట్ లో భద్రతావైఫల్యం బయటపడింది. ఆటగాళ్లంతా మైదానంలో వున్నపుడే ఓ అభిమాని హంగామా సృష్టించాడు. 

భారత్- సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడు టెస్టులతో ఓ సీరిస్ జరుగుతోంది. మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ల గౌరవార్థం నిర్వహిస్తున్న ఈ సీరిస్ విశాఖపట్నంలో గాంధీజయంతి రోజునే మొదలయ్యింది. ఇలా చాలాకాలం తర్వాత వైజాగ్ స్టేడియం ఓ అంతర్జాతీయ మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది.  ఇలా అరుదుగా జరుగుతున్న మ్యాచ్ ను కూడా సక్రమంగా నిర్వహించడంలో మేనేజ్‌మెంట్ విఫలమయ్యింది. ఇవాళ(శుక్రవారం) మూడోరోజు ఆటలో భద్రతా వైఫల్యంతో కాస్సేపు గందరగోళం ఏర్పడింది. 

మూడో రోజు సౌతాఫ్రికా బ్యాటింగ్ కొనసాగించగా భారత ఆటగాళ్లు పీల్డింగ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఎక్కడినుండి మైదానంలోకి చొరబడ్డాడో ఏమోగానీ ఓ అభిమాని ఆటగాళ్ల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కొందరు ఆటగాళ్ల వద్దకు వెళ్లి సెల్పీలు దిగేందుకు ప్రయత్నిస్తూ ఆటకు ఆటంకం సృష్టించాడు. 

దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అతడు వారికి దొరక్కుండా తప్పించుకోడానికి మైదానంలోనే పరుగుతీశాడు. కాస్సేపలా సెక్యూరిటీకి దొరక్కుండా పరుగుతీసి చివరకు చిక్కాడు. దీంతో అతడిని మైదానం నుండి బయటకు తీసుకువచ్చిన సిబ్బంది స్థానిక పోలీసులకు అప్పగించారు. 

ఈ గందరగోళంతో మరోసారి ఆటగాళ్ల భద్రతపై చర్చ మొదలయ్యింది. ఇటీవల ఇదే దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సీరిస్ లో కూడా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. ఒక్కసారి కాదు పలుమార్లు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చి ఆటగాళ్లను కలుసుకోవడం, వారితో ఫోటోలు దిగే ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి వైజాగ్ టెస్టులో కూడా అభిమాని మైదానంలోకి రావడంతో ఆటగాళ్లు భద్రతపై అధికారులు తీసుకుంటున్న చర్యలెలా వున్నాయో అర్థమవుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోక ముందే క్రికెటర్లతో పాటు స్టేడియంలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

click me!