ఎవడి ఖర్మకు వాడే బాధ్యుడు: అసహనం చూపించాడు..మ్యాచ్‌కు దూరమయ్యాడు

By sivanagaprasad KodatiFirst Published Oct 18, 2019, 8:55 AM IST
Highlights

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్న సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్ సిరీస్ ముగిసింది. చేతికి గాయం కారణంగా అతను మూడో టెస్టుకు దూరమయ్యాడు. అయితే ఈ గాయం ఏదో యాధృచ్ఛికంగా జరిగింది కాదు.. తనకు తాను కావాలని చేసుకుంది. 

భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్న సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్ సిరీస్ ముగిసింది. చేతికి గాయం కారణంగా అతను మూడో టెస్టుకు దూరమయ్యాడు.

అయితే ఈ గాయం ఏదో యాధృచ్ఛికంగా జరిగింది కాదు.. తనకు తాను కావాలని చేసుకుంది. పుణేలో జరిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్సులలోనూ డకౌట్‌గా వెనుదిరిగిన మార్కరమ్ మ్యాచ్ తర్వాత ఆ అసహనాన్ని ఒక బలమైన వస్తువుపై చూపించాడు.

దాంతో అతని చేతికి తీవ్రమైన గాయమైంది. జట్టు ఫిజియో తీయించిన ఎక్స్‌రేలో మణికట్టు ఎముకలో ఫ్రాక్చర్ అయినట్లు తేలడంతో మార్కరమ్ చికిత్స కోసం దక్షిణాఫ్రికాకు బయలుదేరాడు.

కాగా.. అతని స్థానంలో సఫారీలు మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు. సీనియర్ జట్టుకంటే ముందుగా ‘ఎ’ జట్టు తరపున మార్కరమ్ భారతదేశంలో అడుగుపెట్టాడు. ఒక మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన అతను.. అనంతరం విజయనగరంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సైతం మరో అర్థశతకం బాదాడు.

ఆ విధంగా ఆత్మవిశ్వాసంతో విశాఖ టెస్టులో బరిలోకి దిగిన మార్కరమ్ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పుణేలో రెండో ఇన్నింగ్స్‌లో ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాక రివ్యూకు అవకాశం ఉన్నా...మానసికంగా అప్పటికే కుంగిపోయిన అతను రివ్యూకి వెళ్లలేదు. కాగా టీవీ రిప్లేలో అది నాటౌట్‌గా తేలింది.

గాయం అనంతరం మార్కరమ్ స్పందిస్తూ.. ఇలాంటి పరిస్దితుల్లో స్వదేశం తిరిగి వెళ్లడం బాధాకరమని.. తాను చేసింది పూర్తిగా తప్పేనని,దానికి తానే బాధ్యత వహిస్తానని స్పష్టం చేశాడు.

మంచి వాతావరణం ఉన్న మా జట్టులో తనపై నమ్మకం ఉంచినవారిని నిరాశపర్చడం తనను ఎక్కువగా వేదనకు గురిచేస్తోందని.. క్రీడల్లో కొన్ని భావోద్వేగాలు దాటిపోయి అసహనం పెరిగిపోతోంది. తనకు అదే జరిగిందని దీనిపై సహచరులకు క్షమాపణలు కూడా చెప్పానని జరిగిన తప్పును సరిదిద్దుకుంటానని మార్కరమ్ వివరణ ఇచ్చాడు.

మూడో టెస్టులో మార్కరమ్ స్థానంలో జుబేర్ హమ్జాకు తుది జట్టులో స్థానం లభించవచ్చని తెలుస్తోంది. మరో ఓపెనర్ డీన్ ఎల్గర్ మాట్లాడుతూ.. భారత పర్యటన జీవితానికి సరిపడా ఎంతో అనుభవాన్ని నేర్పిస్తుందన్నాడు.

క్రికెటర్‌గా, వ్యక్తిగా ఎంతో మెరుగయ్యేందుకు భారత పర్యటన అవకాశం కల్పిస్తుందని.. అది మైదానంలో కావొచ్చు లేదా మైదానం బయట కావొచ్చని ఎల్గర్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడి మైదానాల్లో కఠిన పరిస్థితులు ఎదురవుతాయని.. దానితో పాటు చిన్న నగరాల్లో, పెద్దగా సౌకర్యాలు లేని హోటళ్లలో కూడా ఉండాల్సి వుస్తుందన్నాడు.

ఇటువంటి పరిస్థితుల్లో మన గురించి మనం తెలుసుకునేందుకు పనికొస్తాయని ఎల్గర్ అభిప్రాయపడ్డాడు. పుణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలుపొందటంతో పాటు సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది.

టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథుల్లో మూడో ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో పుణేలో జరిగిన రెండో టెస్టులో విజయం ద్వారా కెప్టెన్‌గా 30వ విజయాన్ని అందుకున్నాడు విరాట్. దీనితో పాటు 50వ టెస్టుకు నాయకత్వం వహించాడు.

తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న వారిలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు స్టీవ్ వా 37, రికీ పాంటింగ్‌లు మొదటి, రెండో స్థానంలో నిలిచారు.

మరోవైపు మొదటి 50 టెస్టుల్లో 30 విజయాలు అందుకున్న ఏకైక భారత కెప్టెన్ కోహ్లీయే కావడం విశేషం. అతని తర్వాత ధోని 27 టెస్టులతో నిలిచాడు.. కెప్టెన్‌గా మహేంద్రుడు 60 టెస్టులకు నాయకత్వం వహించాడు.

click me!