బీసీసీఐ నుంచి సౌరభ్ గంగూలీ ఔట్...కొత్త అధ్యక్షుడు ఎవరంటే...

By SumaBala BukkaFirst Published Oct 12, 2022, 9:10 AM IST
Highlights

బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సౌరవ్ గంగూలీ తప్పుకున్నాడు. రెండో దఫా అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో దాదా ఇక బీసీసీఐలో ఉండకపోవచ్చు. 

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కథ ముగిసినట్లే.  గత మూడేళ్లుగా  భారత క్రికెట్ లో చక్రం తిప్పిన  గంగూలీకి Bcciలో స్థానం లేనట్లే. ఐసీసీ చైర్మన్ పదవి దాదాకు దాదాపుగా దూరం అయినట్లే. బీసీసీఐ నుంచి గంగూలీ నిష్క్రమణకు తేదీ ఖరారైంది. 1983 ప్రపంచ కప్ హీరో రోజర్ బిన్నీ(కర్ణాటక) బోర్డు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. ఈనెల 18న ముంబైలో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసిసిఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఢిల్లీలో వారం రోజుల పాటు తీవ్రంగా సాగిన చర్చల అనంతరం 67 ఏళ్ల బిన్నీని బోర్డు అధ్యక్ష పీఠం వరించింది. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా  రెండోదఫా కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఐసీసీ బోర్డులో బీసీసీఐ ప్రతినిధిగా కూడా గంగోలి కొనసాగే అవకాశం కనిపించడం లేదు. జై షా ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చని సమాచారం. ‘బీసీసీఐ తరఫున ఐసిసి వ్యవహారాలను చక్కబెట్టడంలో  జై షా  ముందున్నాడు. 2023 ప్రపంచ కప్ కు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో ఐసీసీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో భారత్ కు బలమైన నాయకత్వం ఉండటం చాలా ముఖ్యం’ అని బిసిసిఐ వర్గాలు తెలిపాయి.

స్టార్లు లేకుండా సిరీస్ గెలిచి... ఆస్ట్రేలియా రికార్డును లేపేసిన టీమిండియా...

సోమవారం ముంబైకి చేరుకున్న గంగూలీ గత వారం రోజులుగా ఢిల్లీలో బోర్డులోని కీలక సభ్యులతో చర్చలు సాగించారు. బోర్డు అధ్యక్షుడిగా  మరో దఫా కొనసాగేందుకు గంగోలి ఆసక్తి కనపరిచినా.. అతనికి నిరాశే ఎదురైంది. అధ్యక్ష పదవి రెండో దఫా ఇచ్చే సంప్రదాయం లేదని దాదాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘గంగూలీకి ఐపీఎల్  చైర్మన్ పదవిని ఇవ్వజూపగా అతను సున్నితంగా తిరస్కరించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసిన తర్వాత బోర్డు లోని సబ్ కమిటీకి సారథ్యం వహించడం సరికాదని గంగూలీ భావించాడు.  

కొత్త కార్యవర్గంలో దాదాకు చోటు లభించకపోవడం ఆశ్చర్యం కలిగించలేదు. విధుల నిర్వహణలో విఫలమయ్యాడంటూ ఢిల్లీ సమావేశంలో విమర్శలు వచ్చినప్పుడే బోర్డు అధ్యక్షుడిగా అతడిని కొనసాగించడం కష్టమని స్పష్టమయింది. ఐసీసీ అధ్యక్ష పదవికి గంగూలీ పేరును ప్రతిపాదిస్తారో, లేదో తెలియదు. ఈ పరిస్థితుల్లో అది జరిగేలా లేదు’ అని బోర్డు వర్గాలు వివరించాయి. బోర్డు లోని అన్ని పదవులు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉండడంతో..  ఏజీఎంలో ఎన్నికలు జరగకపోవచ్చు. బిన్నీ, జై షా, రాజీవ్ శుక్లా సహా  వివిధ పదవులకు రేసులో ఉన్న వాళ్లంతా మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు.  

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ శుక్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు, ప్రస్తుత కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్ ఐపీఎల్ పగ్గాలు చేపట్టనున్నాడు. బ్రిజేష్ పటేల్ స్థానంలో ఐపీఎల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మహారాష్ట్ర బీజేపీ నాయకులు ఆశిష్ షెలార్ కోశాధికారి పదవిని చేపట్టనున్నారు. శరద్ పవార్ వర్గంతో కలిసి ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు కావాలనుకున్న ఆశిష్ కు బోర్డు కోశాధికారి పదవిని కట్టబెట్టారు.

అసోం ముఖ్యమంత్రి హిమంత భిశ్వ శర్మ సన్నిహితులు దేవజిత్ సైకియా సంయుక్త కార్యదర్శిగా ఎంపిక కానున్నాడు. ‘ఐపీఎల్ పాలక మండలికి అరుణ్ ధుమాల్ సారథ్యం వహిస్తాడు. అభిషేక్ దాల్మియా, ఖైరుల్ జమాల్ మజుందార్ ఐపీఎల్ పాలక మండలిలో సభ్యులుగా కొనసాగుతారు. ప్రస్తుతానికి వీరి నామినేషన్లు మాత్రమే వచ్చాయి. బోర్డు కోశాధికారిగా షెలార్  బాధ్యతలు చేపట్టగానే ఎంసీఏ  అధ్యక్ష పదవికి సమర్పించిన నామినేషన్ను ఉపసంహరించుకుంటాడు. 

ఐసీసీ చైర్మన్ పదవికి  బోర్డు పోటీ పడుతుందా? లేదా? అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఈ విషయాన్ని ఏజీఎంలో చర్చిస్తాం’ అని రాజీవ్ శుక్లా తెలిపాడు. బుధవారం నామినేషన్ల దాఖలు గడువు పూర్తవుతుంది. ఈనెల 14లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. వివిధ పదవులకు బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను 15న ప్రకటిస్తారు. 
 

click me!